అమెరికాలో వీసా దెబ్బ.. భారత్‌కు క్యూ కడుతున్న టెకీలు.. ఐటీ మార్కెట్‌లో కొత్త ఉద్యోగాలొస్తున్నాయా? అసలు నిజమిదే!

అమెరికాలో ఐటీ ఉద్యోగం సాధించి.. అక్కడ స్థిరపడాలనేది ఎంతోమంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కల. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ కల కాస్తా అనిశ్చితిలోకి నెట్టబడినట్లు కనిపిస్తోంది.

Update: 2026-07-07 16:30 GMT

అమెరికాలో ఐటీ ఉద్యోగం సాధించి.. అక్కడ స్థిరపడాలనేది ఎంతోమంది భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల కల. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ కల కాస్తా అనిశ్చితిలోకి నెట్టబడినట్లు కనిపిస్తోంది. యూఎస్‌లో వీసా నిబంధనలు నానాటికీ కఠినతరం కావడం.. ఉద్యోగ భద్రతపై ఆందోళనలు పెరగడంతో చాలామంది భారతీయ ఐటీ నిపుణులు స్వదేశానికి తిరుగుముఖం పడుతున్నారు. అయితే ఈ 'రివర్స్ మైగ్రేషన్' వల్ల భారత ఐటీ రంగంలో కొత్త ఉద్యోగాల విప్లవం వస్తుందని ఆశించిన వారికి మాత్రం నిరాశే ఎదురవుతోంది. ప్రముఖ ప్రొఫెషనల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్ 'బ్లైండ్' నిర్వహించిన తాజా సర్వేలో పలు ఆసక్తికర, విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి.

కంపెనీల కొత్త వ్యూహం.. అదే ఉద్యోగి.. తక్కువ వేతనం!

అమెరికా నుంచి టెకీలు తిరిగి రావడం వల్ల ఇక్కడ కొత్త ఉద్యోగ అవకాశాలు పెరగట్లేదు సరే కదా.. ఉన్న ఉద్యోగాలకే విపరీతమైన పోటీ పెరుగుతోంది. యూఎస్ టెక్ దిగ్గజాలు తమ అనుభవజ్ఞులైన ఉద్యోగులను వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఒక స్మార్ట్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. వారిని భారతదేశంలోని తమ గ్లోబల్ కెపబిలిటీ సెంటర్స్ (జీసీసీ)లకు బదిలీ చేస్తున్నాయి. దీనివల్ల కంపెనీలకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. నైపుణ్యం కలిగిన పాత ఉద్యోగులు కంపెనీలోనే ఉంటారు. అమెరికాతో పోలిస్తే భారతదేశంలో చాలా తక్కువ వేతనానికే వారు అందుబాటులోకి వస్తారు. "గత ఆరు నెలల్లో ఇక్కడ సగటు వేతనాలు భారీగా పడిపోయాయి. అమెరికాలో లభించిన జీతంలో కేవలం ఐదో వంతు మాత్రమే ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నారు" అని గూగుల్‌కు చెందిన ఒక ఉద్యోగి ఈ సర్వేలో తన ఆవేదనను పంచుకున్నారు.

సర్వే ఏం చెబుతోంది?

జూన్ 16 నుంచి 25 మధ్య భారతదేశానికి చెందిన 1,276 మంది ధృవీకరించిన టెక్ ప్రొఫెషనల్స్‌పై 'బ్లైండ్' సంస్థ ఈ సర్వే నిర్వహించింది. 53% మంది ఉద్యోగులు అమెరికా వీసా సమస్యల వల్లే భారత్‌కు తిరిగి వస్తున్నారని స్పష్టం చేశారు. ఇప్పటికే తమ సహోద్యోగులు రిటర్న్ అయ్యారని 36% మంది చెప్పగా.. త్వరలోనే మరికొందరు రాబోతున్నారని 17% మంది పేర్కొన్నారు. అమెజాన్‌లో 57%, వాల్‌మార్ట్‌లో 58%, ఉబెర్‌లో 55% మంది ఉద్యోగులు తమ సహోద్యోగులు అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చినట్లు ధృవీకరించారు. వాల్‌మార్ట్ లో 58%, అమెజాన్ లో 57%, ఉబెర్ లో 55% ఉద్యోగులు అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చారు.

పెరిగిన పోటీ.. తగ్గిన అవకాశాలు

ఇండియాలో జీసీసీలు విస్తరిస్తున్నప్పటికీ సాధారణ ఉద్యోగార్థులకు మాత్రం అవకాశాలు ఆశాజనకంగా లేవు. గత ఏడాదితో పోలిస్తే ఉద్యోగ అవకాశాలు తగ్గాయని 51% మంది అభిప్రాయపడగా, కేవలం 26% మంది మాత్రమే పెరిగాయన్నారు. పరిస్థితిలో మార్పు లేదని 23% మంది చెప్పారు. అమెరికా నుంచి వస్తున్న సీనియర్, అనుభవజ్ఞులైన టెకీలే ఇక్కడి మార్కెట్లోని కీలక ఉద్యోగాలను దక్కించుకుంటుండటంతో ఇప్పటికే భారత్‌లో ఉండి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి పోటీ నెక్-టు-నెక్ మారుతోంది.

ఏఐ, ఎంఎల్ రంగాలదే హవా!

ఈ అనిశ్చితి టెక్ రంగంలోని అన్ని విభాగాలపై ఒకేలా లేదు. సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ రంగాలతో పోలిస్తే, సరికొత్త సాంకేతికతలకు మార్కెట్లో ఇంకా మంచి డిమాండ్ ఉంది. వివిధ విభాగాల్లో అవకాశాలు తగ్గాయని భావిస్తున్న వారి శాతం చూస్తే.. డేటా అండ్ అనలిటిక్స్ 56%, ప్రొడక్ట్ మేనేజర్లు 54%, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు 52%,

ఏఐ, మెషిన్ లెర్నింగ్ 42% తగ్గుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు ఉన్న వారికి ఇప్పటికీ మార్కెట్లో మెరుగైన అవకాశాలు, డిమాండ్ లభిస్తున్నాయని స్పష్టమవుతోంది.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

ఈ రివర్స్ మైగ్రేషన్ వల్ల తమ కెరీర్‌పై పెద్దగా ప్రభావం ఉండదని 40% మంది భావిస్తుండగా పెరిగిన పోటీ వల్ల తాము నష్టపోతున్నామని 39% మంది.. 24% మంది తమ ఉద్యోగాలు రిటర్న్ అయిన వారికే వెళ్తున్నాయని, 15% మంది పోటీ పెరిగిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయితే కేవలం 21% మంది మాత్రమే ఈ మార్పును సానుకూలంగా చూస్తున్నారు. అంతర్జాతీయ అనుభవం ఉన్న టెకీలు రావడం వల్ల దీర్ఘకాలంలో భారత టెక్ రంగం మరింత బలోపేతం అవుతుందని, భవిష్యత్తులో వేతనాలు పెరగడానికి ఇది దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతానికైతే భారత ఐటీ మార్కెట్లో తీవ్రమైన పోటీ వాతావరణం నెలకొందనేది జగమెరిగిన సత్యం.

Tags:    

Similar News