"నాది తక్కువ కులం" అందుకే మంత్రిని కాలేదు - ఫైర్ బ్రాండ్ చింతమనేని స్టన్నింగ్ కామెంట్స్!
అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని తనను తాను ‘తక్కువ కులం’ అంటూ చెప్పుకోవడంపై చర్చ జరుగుతోంది.
తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక సమీకరణాల వల్లే మంత్రిని కాలేకపోయానని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనది తక్కువ కులం అంటూ ఎమ్మెల్యే చింతమేని వ్యాఖ్యానించడం వైరల్ అవుతోంది. తన జాతకంలో మంత్రి యోగం లేదని, ఆ విషయమై తనకు అవగాహన ఉందని స్పష్టం చేశారు. దీంతో మంత్రి పదవిపై తనకు ఆశ లేదని చింతమనేని తేల్చిచెప్పినట్లైందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు ఓ యూట్యూబ్ చానల్ ఆయనను ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా చింతమనేనికి మంత్రియోగంపై ఇంటర్వ్యూలో ఎదురైన ప్రశ్నకు ఆయన తన సహజ పద్ధతిలో జవాబివ్వడం నెటిజన్లను ఆకర్షించింది.
ఫైర్ బ్రాండ్ గా వచ్చిన గుర్తింపు వల్లే చింతమనేని మంత్రి కాలేకపోయారా? అన్న ప్రశ్నపై ఎమ్మెల్యే ప్రభాకర్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. తన ఆవేశం వల్ల కేబినెట్ మంత్రి పదవి దక్కలేదని అనుకోవడం తప్పేనని అన్నారు. తన ఆవేశం వల్ల ఏ నష్టం జరగలేదని చెప్పుకొచ్చారు. అయితే మంత్రి పదవి రాకపోడానికి చాలా కారణాలు ఉన్నాయని వివరించారు. అందులో తన కులం కూడా ప్రధానమేనని చింతమనేని స్పష్టం చేశారు. ‘‘నా కులం తక్కువ కులం. నా కులంలో ఎంతమందికి అవకాశం ఇస్తారు? చంద్రబాబుది నా కులమే, లోకేశ్ బాబుది నా కులమే’’నని చింతమనేని వ్యాఖ్యానించారు. తనకు పదవి రాకపోవడానికి సామాజిక సమీకరణాలు మాత్రమే కారణమని చెప్పే క్రమంలో తక్కువ కులం అంటూ చింతమనేని అన్న మాటలు నెటిజన్లను ఆకర్షించాయి.
అగ్రవర్ణాలకు చెందిన ఎమ్మెల్యే చింతమనేని తనను తాను ‘తక్కువ కులం’ అంటూ చెప్పుకోవడంపై చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో తమ సామాజికవర్గం జనాభా పరిమితంగా ఉన్నారని, జనాభాలో తక్కువగా ఉన్న తమ సామాజిక వర్గానికి ఎక్కువ అవకాశాలు ఎలా ఇస్తారని వివరించే క్రమంలో ఎమ్మెల్యే చింతమనేని తనది ‘తక్కువ కులం’ అంటూ చెప్పుకుని అందరి అటెన్షన్ పొందారని అంటున్నారు. ఇక ఈ కామెంట్ల ద్వారా పార్టీపైన ముఖ్యమంత్రి చంద్రబాబుపైన తన విధేయత చాటుకున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతమనేని మంత్రి పదవి ఆశిస్తున్నట్లు టీడీపీలో జరుగుతున్న చర్చకు ఆయనే ఫుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు.
మంత్రి పదవి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును పూర్తిగా సమర్థిస్తున్నట్లు చింతమనేని మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారని, అందరికీ న్యాయం చేస్తారని అన్నారు. మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించేందుకు కూడా తాను సరిపోనని అన్నారు. తనకు అన్నీ అర్థం అవుతున్నాయని అనవసర వివాదాల్లోకి లాగొద్దని వేడుకున్నారు. తనకు మంత్రి పదవి వద్దని ఖరాకండీగా తేల్చిచెప్పారు. కాగా, సాధారణ రాజకీయ నాయకులకు భిన్నంగా తనకు మంత్రి పదవి వద్దని, మంత్రి అయ్యే యోగం లేదని చింతమనేని చెప్పడమే హాట్ టాపిక్ అవుతోంది. ఏ రాజకీయ నాయకుడైనా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవి చేపట్టాలని కలలు కంటుంటారు. కానీ, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సామాజిక సమీకరణాల దృష్ట్యా తనకు మంత్రి పదవి దక్కదని ముందే గుర్తించి చింతమనేని అధిష్టానానికి వెసులుబాటు కల్పించారని నెటిజన్లు చమత్కరిస్తున్నారు.