ఇండోనేషియా అధ్యక్షుడినే బురిడీ కొట్టించాడా? భారత సంతతి వ్యాపారవేత్తపై సంచలన ఆరోపణలు
వివరాల్లోకి వెళ్తే.. 2020 నుంచి 2022 మధ్యకాలంలో ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు (అప్పటి రక్షణ మంత్రి) ప్రబోవో సుబియాంతోతో గౌరవ్ శ్రీవాస్తవ అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.
అంతర్జాతీయ దౌత్య, వ్యాపార వర్గాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త దావానలంలా వ్యాపిస్తోంది. తాను అమెరికాకు చెందిన నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య ఏజెంట్‌నని చెప్పుకుంటూ.. ఏకంగా ఒక దేశ అధ్యక్షుడినే నమ్మించి బహుళ బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందాలను దక్కించుకోవడానికి ప్రయత్నించాడనే ఆరోపణలు ఒక భారత సంతతి వ్యాపారవేత్తపై వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జన్మించి.. ఆ తర్వాత అమెరికాలో స్థిరపడిన గౌరవ్ శ్రీవాస్తవ అనే వ్యాపారవేత్త చుట్టూ ఇప్పుడు ఈ అంతర్జాతీయ వివాదం ముదురుతోంది.
'మిస్టర్ జీ' అసలు కథేంటి?
వివరాల్లోకి వెళ్తే.. 2020 నుంచి 2022 మధ్యకాలంలో ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు (అప్పటి రక్షణ మంత్రి) ప్రబోవో సుబియాంతోతో గౌరవ్ శ్రీవాస్తవ అత్యంత సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకున్నాడు. తాను సీఐఏ కోసం నేరుగా పనిచేస్తున్నానని, వైట్ హౌస్ ఉన్నతాధికారులతో తనకు బలమైన సంబంధాలు ఉన్నాయని నమ్మబలికాడు. తనను తాను "మిస్టర్ జీ" అని పిలుచుకుంటూ వాషింగ్టన్, జకార్తాలలో జరిగిన అత్యున్నత స్థాయి రక్షణ రంగ సమావేశాల్లో ప్రబోవో పక్కన కూర్చుని సైనిక సామగ్రి కొనుగోళ్లపై చర్చలు కూడా జరిపాడు. తన అబద్ధాలను నిజం చేయడానికి శ్రీవాస్తవ కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేసినట్లు లీకైన ఫోన్ సంభాషణల ద్వారా తెలుస్తోంది. 2002లో జరిగిన బాలి బాంబు పేలుళ్ల నిందితులను పట్టుకోవడంలో తాను కీలక పాత్ర పోషించానని చెప్పుకున్నాడు. ప్రబోవో సుబియాంతోపై గతంలో అమెరికా విధించిన ట్రావెల్ బ్లాక్‌లిస్ట్‌ను తనకున్న ఇన్ఫ్లుయెన్స్‌తోనే తొలగించానని నమ్మించాడు.
ఐదు రక్షణ ఒప్పందాలు.. అన్నీ షెల్ కంపెనీలే
ఈ మాటలను నిజమని నమ్మిన ఇండోనేషియా రక్షణ శాఖ, శ్రీవాస్తవకు చెందిన సంస్థలతో ఐదు ప్రాథమిక రక్షణ ఒప్పందాలు కుదుర్చుకుంది. అయితే తదుపరి దర్యాప్తులో ఆ ఒప్పందాల వెనుక ఉన్న నాలుగు కంపెనీలు కేవలం కాగితాలకే పరిమితమైన "షెల్ కంపెనీలు" అని తేలడంతో ఇండోనేషియా అధికారులు షాక్‌కు గురయ్యారు.
భాగస్వామిని కూడా వదల్లేదు..
ఈ అంతర్జాతీయ మోసం బయటపడటానికి శ్రీవాస్తవ మాజీ వ్యాపార భాగస్వామి నీల్స్ ట్రూస్ట్ కీలక కారణం. శ్రీవాస్తవ నిజంగానే సీఐఏ ఏజెంట్ అనుకుని నమ్మిన ట్రూస్ట్, తన కంపెనీలోని 50 శాతం వాటాను అతనికి రాసిచ్చాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి, ప్రస్తుతం న్యూయార్క్, కాలిఫోర్నియా కోర్టుల్లో శ్రీవాస్తవపై సివిల్ కేసులు దాఖలు చేయడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది.
ఆరోపణలను ఖండిస్తున్న శ్రీవాస్తవ
మరోవైపు గౌరవ్ శ్రీవాస్తవ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నారు. తనపై వస్తున్న మోసం, బెదిరింపుల ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. తాను సీఏఐ ఏజెంట్‌నని చెప్పినట్లు ఉన్న ఆడియో రికార్డింగులు పూర్తిగా నకిలీవని, తన మాజీ భాగస్వామి కావాలనే తన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్ర పన్నాడని వాదిస్తున్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం ఇరు దేశాల దౌత్య వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కోర్టు విచారణలో ఎలాంటి నిజాలు బయటపడతాయోనని అంతర్జాతీయ సమాజం ఆసక్తిగా గమనిస్తోంది.