ఇండోనేషియా పర్యటనలో మోడీకి లభించిన గౌరవం ఎంత అరుదైనదంటే?

ఇండోనేషియా అనంతరం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీకి అనూహ్య రీతిలో అత్యంత అరుదైన స్వాగతం లభించింది.

Update: 2026-07-07 05:35 GMT

మన దేశ ప్రధానికి ఒక విదేశీ గడ్డ మీద అత్యంత అరుదైన స్వాగతం లభిస్తే.. అది మనకు మొదటి పేజీ వార్త కాదా? సదరు దేశ చరిత్రలో అరుదైన స్వాగతం పొందిన రెండో విదేశీ అధినేత/ప్రధాని అయినప్పుడు.. ఆ పరిణామం మన దేశ మీడియాలో అంతంతమాత్రంగా కవర్ కావటం దేనికి నిదర్శనం? అందులోకి సదరు దేశం ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా దేశంగా ఉండి.. ఆ దేశంలో సంబంధాలు అంతంతగా అన్నట్లు విశ్లేషణలు వినిపించే వేళ.. అందుకు భిన్నంగా లభించిన అత్యంత అరుదైన స్వాగతానికి తెలుగు మీడియా ఇచ్చిన ప్రాధాన్యత చూస్తే.. అసలు వీరికి ఏమైంది?అన్న సందేహం కలుగకమానదు.

ఇండోనేషియా అనంతరం ఆస్ట్రేలియా.. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీకి అనూహ్య రీతిలో అత్యంత అరుదైన స్వాగతం లభించింది. ఒక విధంగా చెప్పాలంటే డబుల్ థమాకాగా చెప్పాలి. ఇండోనేషియాకు వెళ్లిన విదేశీ దేశాధినేతలకు.. ప్రధానులకు తమ యుద్ధ విమానాలతో రక్షణగా నిలుస్తూ స్వాగతం పలకటం అరుదైన స్వాగతంగా పరిగణిస్తారు. ఇండోనేషియా గగనతలంలోకి నరేంద్ మోడీ ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ విమానం ప్రవేశించినంతనే ఆ దేశ వైమానిక దళానికి చెందిన ఎఫ్16, సుఖోయ్ 30 ఫైటర్జెట్లు ఆయన విమానానికి ఇరువైపులా చేరి సురక్షితంగా జకార్తాలో ల్యాండ్ అయ్యే వరకు ఎస్కార్ట్ గా నిలవటం విశేషం.

ఇలాంటి అరుదైన స్వాగతం కొన్ని దేశాధినేతలకు మాత్రమే ఇప్పటివరకు దక్కింది. అంతేనా.. విషయం అక్కడితో ఆగితే ఇంతగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. జకార్తా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రోటోకాల్ ను పక్కన పెట్టి.. ఆయనే స్వయంగా ఎయిర్ పోర్టుకు వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకటం అత్యంత అరుదైన అంశంగా చెబుతున్నారు. అత్యంత అరుదైన అన్న పదాన్ని వాడటానికి కారణం.. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం చూస్తే.. ఇండోనేషియా చరిత్రలో ఒక విదేశీ అధినేతకు యుద్ధ విమానాలు ఎస్కార్టుగా వ్యవహరించి స్వాగతం పలికి.. విమానాశ్రయంలో ఆ దేశ అధ్యక్షుడే స్వయంగా వచ్చి వెల్ కం చెప్పిన రెండో సందర్భంగా ఇదే కావటం దీనికి కారణంగా చెప్పాలి. ప్రజాస్వామ్య దేశ ప్రధానికి ఈ తరహా గౌరవం లభించటం ఇదే తొలిసారిగా చెప్పొచ్చు.

ఇంతటి అరుదైన ఆత్మీయ ఘన స్వాగతం చివరకు అమెరికా.. చైనా దేశాధినేతలకు కూడా ఈ తరహా గౌరవం లభించకపోవటం గమనార్హం. గతంలో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ 2022లో ఇండోనేషియా వెళ్లారు. అప్పుడు బాలిలో జీ20 సదస్సు జరుగుతోంది. పలు దేశాధినేతలు ఈ సదస్సులో హాజరయ్యేందుకు వెళ్లగా.. చైనా అధ్యక్షుడికి మాత్రమే ఆయన ప్రయాణిస్తున్న విమానానికి ఫైటర్ జెట్ ఎస్కార్ట్ గౌరవాన్ని అందించింది. అప్పుడు కూడా ఇండోనేషియా అధ్యక్షుడు ఎయిర్ పోర్టుకు వెళ్లి స్వాగతం పలికింది లేదు.

అయితే.. ఆ సదస్సుకు పలు దేశాల అధినేతలు.. ప్రధానులు హాజరవుతున్న వేళలో.. చైనా అధ్యక్షుడుకు కాస్త భిన్నమైన స్వాగతం పలకటం ద్వారా.. చైనా తమకు ఎంత ముఖ్యమన్న విషయాన్ని ఇండోనేషియా చెప్పకనే చెప్పేసింది. ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. ఇండోనేషియాతో సన్నిహిత సంబంధాలు ఉన్న సింగపూర్, మలేషియా అధినేతలు ఆ దేశంలో పర్యటించిన సందర్భంలో నాటి అధ్యక్షులు వెళ్లి స్వాగతం పలికిన ఉదంతాలు ఉన్నాయి. కానీ.. ఫైటర్ జెట్లతో స్వాగతం పలికింది లేదు.

కట్ చేస్తే.. సరిగ్గా నాలుగేళ్లకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఫైటర్ జట్లతో మాత్రమే కాదు.. ఇండోనేషియా దేశాధ్యక్షుడు స్వయంగా వచ్చి.. స్వాగతం పలకటం, ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. ఇప్పటివరకు ఈ తరహా గౌరవాన్ని పొందిన వారిలో మోడీ రెండోవారు. అంతకుముందు 2017లో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఇండోనేషియాలో పర్యటించిన వేళ.. అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో స్వయంంగా ఎయిర్ పోర్టుకు వచ్చి స్వాగతం పలకటమే కాదు.. ఫైటర్ జెట్ల ఎస్కార్టుతో స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆ తరహాలో స్వాగతాన్ని సొంతం చేసుకున్నది నరేంద్ర మోడీ మాత్రమే.

ఇక్కడో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించాలి. 2018లో ప్రధాని నరేంద్ర మోడీ జకార్తాకు వచ్చినప్పుడు ఇండోనేషియా అధ్యక్ష భవనం వద్ద స్వాగతం లభించింది. అప్పటి ఆ దేశ అధ్యక్షుడు జోకో విడోడో అధికారిక స్వాగతం ఇచ్చారే తప్పించి.. ఎయిర్ పోర్టుకు రావటం.. ఫైటర్ జెట్లతో స్వాగతం పలకటం లాంటివి జరగలేదు. మరి.. ఇప్పుడే ఇలా ఎందుకు జరిగిందన్న విషయంలోకి వెళితే.. పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

అందులో మొదటిది గత ఏడాది గణతంత్ర దినోత్సవం (జనవరి 26, 2025) సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను విశిష్ఠ అతిధిగా ఆహ్వానించారు. ఆ సందర్భంగా ఆయనకు ఇచ్చిన అత్యున్నత ఆతిథ్యానికి.. ప్రధాని నరేంద్ర మోడీతో ఏర్పడిన వ్యక్తిగత స్నేహానికి గుర్తుగా తాజాగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రోటోకాల్ ను బ్రేక్ చేసి.. అరుదైన గౌరవాన్ని రిటర్న్ గిఫ్టుగా ఇచ్చారని చెప్పొచ్చు. 2018లో ఇండోనేషియాను ప్రధాని మోడీ పర్యటించిన సందర్భంలో ఇరు దేశాల బంధాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చారు. గడిచిన ఎనిమిదేళ్లలో రెండు దేశాల మద్య రక్షణ.. నౌకాదళ సహకారం పెద్ద ఎత్తున పెరిగాయి. ఇరుదేశాల మధ్య రక్షణ బంధం ఎంత బలంగా ఉందన్నది తాజాగా ప్రపంచానికి చెప్పేశారని చెప్పాలి.అంతేకాదు.. ఇండో - పసిఫిక్ రీజియన్ లో చైనా దూకుడును అడ్డుకోవటానికి భారత్-ఇండోనేషియాలు కీలక భాగస్వాములుగా మారాయన్న విషయాన్ని తాజా చర్యతో చెప్పేశాయని చెప్పాలి.

చివరగా మరో ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించి.. ముగిస్తాం.మోడీ ఇండోనేషియా పర్యటన సందర్బంగా అక్కడి టీవీ చానళ్లు.. సోషల్ మీడియా.. మీడియా భారీ ప్రాధాన్యతను ఇచ్చింది. అంతేకాదు.. తమ దేశాధ్యక్షుడు స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీకి స్వాగతం పలకటం.. ఫైటర్ జెట్లతో స్వాగతం పలకటం లాంటి అంశాల్ని ప్రస్తావించటం ద్వారా.. భారీ ప్రాధాన్యతను ఇచ్చాయి.సోషల్ మీడియాలోనూ నరేంద్రమోడీ పర్యటనను ఆ దేశ నెటిజన్లు సానుకూలంగా స్పందించటం కనిపిస్తుంది. మోడీ తాజా పర్యటన ద్వారా చోటు చేసుకున్నపరిణామాల్ని చూస్తే.. ప్రపంచంలోనే అధిక ముస్లిం జనాభా ఉన్న దేశం ప్రధాని మోడీని తక్కువ చేసి చూడటం.. అనుమానంగా చూడటం లాంటివి చేయటం లేదన్న విషయాన్ని స్పష్టం చేశాయని చెప్పాలి.

Tags:    

Similar News