మంచి భాష ఎక్కడ దొరుకును ?

మన తెలుగు భాష ఎంతో అందమైనది. అందులో ఎన్నో సామెతలు ఉన్నాయి. వ్యంగ్యోక్తులు ఉన్నాయి. అలాగే విశేషణాలు ఉన్నాయి, అభివర్ణనలు ఉన్నాయి. సునిశితమైన హాస్యంతో కూడా విమర్శలు చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

Update: 2026-07-07 03:20 GMT

ఫలానాది మంచిగా ఉంది, అది అక్కడ దొరుకుతుంది అని చెబుతూంటారు. ఆసక్తి గలవారు మంచి సరుకు కావాలనుకునే వారు వెళ్ళి కొనుక్కుంటారు. అయితే అన్నీ మార్కెట్ లో దొరుకుతారా అంటే అబ్బే అసలు దొరకవు. ఆ మాటకు వస్తే అనేక మంచి విషయాలు బయట దొరకవు. వాటి మూల కేంద్రాలు వేరు. వాటిని శోధనతో సాధనతో సాధించాలి. మంచిగా ఉండడమే కాదు మంచిగా మాట్లాడటం కూడా ఒక కళ. మన తెలుగు భాష ఎంతో అందమైనది. అందులో ఎన్నో సామెతలు ఉన్నాయి. వ్యంగ్యోక్తులు ఉన్నాయి. అలాగే విశేషణాలు ఉన్నాయి, అభివర్ణనలు ఉన్నాయి. సునిశితమైన హాస్యంతో కూడా విమర్శలు చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

వారి భాష వింటే :

మన తెలుగులో మంచి నాయకులు ఎందరో రాజకీయాల్లో ఉన్నారు. ఉప రాష్ట్రపతిగా చేసి ప్రస్తుతం పదవీ విరమణ చేసిన ఎం వెంకయ్యనాయుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతారు, ఆయన సభలో మాట్లాడితే ఎవరైనా రెండు చెవులూ రిక్కించి వింటారు, ఆయన మంచి తెలుగులో సామెతలతో చక్కగా విడమరచి వివరిస్తారు, విమర్శలు చేసినా ఎంతో అందంగా ఉంటాయి. ఆయన ఎదుటి వారిని అన్నట్లుగా అసలు ఉండదు, వెంకయ్యనాయుడు చక్కని అచ్చ తెలుగులోనే మాట్లాడుతారు. ఆయన నోటి వెంట ఎన్నడూ అసభ్య పదజాలం ఎవరూ వినలేదు, మరి ఆయనకు అంతటి మంచి భాష ఎక్కడ దొరికింది అంటే ఆయన సాధనతోనే అని చెప్పాల్సి ఉంటుంది.

అన్న ఎన్టీఆర్ సమ్మోహనం :

అంతే కాదు మూడు సార్లు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ ఎంత చక్కగా మాట్లాడేవారు అన్నది తెలిసిందే. ఆయన సంస్కృత సమాసాలను అలోవోకగా తన ప్రసంగాలలో ఉపయోగించేవారు. అందరికీ మీరు అని ఎంతగానో గౌరవించే సంస్కారం అన్న గారిది. ఆయన ప్రసంగం ధారాపాతంగా పోతూనే ఉంటుంది. పండిత పామరులు కూడా ఎంతగానో దానిని విని ఆనందించేవారు. ఎన్టీఆర్ సైతం రాజకీయ విమర్శలు చేసేవారు. అయితే ఎక్కడా అందులో ఒక్క అనుచితమైన పదం ఉండేది కాదు, తెలుగు భాషలోని పదాల తీవ్రతను ఆయన ఉపయోగించుకునేవారు. ఆయన మహా కవి విశ్వనాథ సత్యనారాయణ వారి ప్రియ శిష్యుడు. ఆయనకు తెలుగు బోధించినది విశ్వనాధ వారు, ఇక ఆయన సినీ రంగంలో సావాసం డాక్టర్ సి నారాయణరెడ్డి వంటి మహా కవులతో సాగింది.

సరస సంభాషణలతో :

ఇక గతంలో ఉమ్మడి ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు చూస్తే చతురోక్తులతో సరస సంభాషణలతో సాగిపోయేది. విమర్శలు కూడా ఒకరిని ఒకరు సున్నితంగా పూబంతులు ఆడుకున్నట్లుగా ఉండేది. అందరికీ భాష మీద పట్టు లేకపోవచ్చు కానీ తెలుగులో అచ్చమైన నుడికారంలో మాట్లాడడం ద్వారా ఆ భాషలోని సొగసులతో విమర్శలు దట్టించేవారు. అందువల్ల నాటి సభలు సమావేశాలు ఒక ఎత్తుగా నిలిచిపోయాయి.

ఎక్కడ నుంచి వస్తుంది :

మంచి భాష కావాలని ప్రస్తుతం అంతా అంటున్నారు, అది ఎక్కడ నుంచి వస్తుంది అంటే మంచి తెలుగు నుంచే వస్తుంది, తెలుగు భాష గొప్పదనం ఏమిటి అంటే తిట్టినా కూడా అందంగా తిట్టవచ్చు. అందరూ దానిని ఆస్వాదించేలా చేయవచ్చు. సామెతలతో పొడుపు కధలతో కూడా విమర్శలు ధాటీగా చేయవచ్చు. వర్తమాన అంశాలను కూడా చాలా చక్కగా ఏర్చి కూర్చి చెప్పవచ్చు. అయితే వీటికి కొంత సాధన చేయాలి. అంతే కాదు మంచి భాషను వాడుదామని అంతా గట్టి సంకల్పం తీసుకోవాలి. అపుడే చెప్పేవారికి వినేవారికి రాసేవారికి మాట్లాడేవారికి కూడా మంచి భాష అందుతుంది. ప్రస్తుతం చూస్తే వారిని చూసి వీరు అలాగే మరి కొందరు ఇలా అంతా కూడా దారుణమైన భాషను వినియోగిస్తున్నారు. కానీ మారాలి. అది అందరూ అనుకుని మొదలెట్టాలి. ఎవరైనా అనుచితంగా మాట్లాడితే వారిని కఠినంగా శిక్షించే చట్టాలు ఉన్నాయన్న భయం కలిగించాలి. ఇక రాజకీయ నాయకులు బాధ్యత కలిగిన పదవులలో ఉన్న వారు కూడా ఈ విషయంలో ఒట్టు పెట్టుకుని కనుక ముందుకు సాగితే మంచి భాష అన్నది ఎక్కడో కాదు, మన మధ్యనే దొరుకుతుంది.

Tags:    

Similar News