రెడ్ కార్డ్ Vs ‘ట్రంప్’ కార్డ్: ఇట్స్ 'ట్రంప్' వరల్డ్.. మనం జస్ట్ అందులో బతుకుతున్నాం అంతే
ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికా స్టార్ ప్లేయర్ బాలోగన్‌కు రిఫరీ చూపించిన రెడ్ కార్డ్ వివాదం.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో పొలిటికల్ కామెడీగా మారిపోయింది.
ఫుట్‌బాల్ అంటే కేవలం కాళ్లతో ఆడే ఆట మాత్రమే కాదు.. అవసరమైతే రాజకీయ ‘చేతులతో’ కూడా నడిపించవచ్చని ప్రపంచానికి సరికొత్త రూల్ బుక్ పరిచయం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ప్రస్తుతం జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికా స్టార్ ప్లేయర్ బాలోగన్‌కు రిఫరీ చూపించిన రెడ్ కార్డ్ వివాదం.. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్‌లో పొలిటికల్ కామెడీగా మారిపోయింది.
అసలేం జరిగింది?
మ్యాచ్ జరుగుతున్నప్పుడు రిఫరీ బాలోగన్‌కు రెడ్ కార్డ్ చూపించి గ్రౌండ్ బయటకు పంపించేశారు. ఇక్కడివరకు అంతా నార్మలే. కానీ, ఎప్పుడైతే ఈ విషయం వైట్ హౌస్‌కు చేరిందో కథ అడ్డం తిరిగింది. రెడ్ కార్డ్ ఇస్తే తదుపరి మ్యాచ్ ఆడకూడదనే నిబంధన విన్న ట్రంప్ తీవ్ర ఆశ్చర్యానికి అంతకంటే ఎక్కువ ఆగ్రహానికి గురయ్యారు.
ఈ వ్యవహారంపై ట్రంప్ తన మార్కు లాజిక్‌తో స్పందిస్తూ "బాలోగన్ మా టీమ్‌లో తోపు ప్లేయర్. మొదట ఆ రెడ్ కార్డ్ ముక్క ఏంటో నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది.. దానివల్ల వాడు నెక్స్ట్ మ్యాచ్ ఆడకూడదట! అసలు ఇంకా జరగని మ్యాచ్ గురించి ఇప్పుడే నిర్ణయం ఎలా తీసుకుంటారు? జరగని మ్యాచ్‌లో ఆడకుండా బ్యాన్ చేయడం ఏంటి? ఇదేం అన్యాయం? అందుకే నేరుగా ఫిఫా వాళ్లతో మాట్లాడాను. ఒక్కసారి ఆలోచించుకోమన్నాను" అని సెలవిచ్చారు.
ట్రంప్ గారి ఈ 'ఇంకా జరగని మ్యాచ్' లాజిక్ చూసి ఫుట్‌బాల్ విశ్లేషకులు తలలు పట్టుకుంటున్నారు. రేపు పొద్దున ఎవరైనా క్రైమ్ చేస్తే "ఇంకా జైల్లో రోజులు గడపలేదు కదా, అప్పుడే శిక్ష ఎలా వేస్తారు?" అని అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు!
ఫిఫా లొంగిపోయిందా? రూల్స్ మారాయా?
ట్రంప్ ఫోన్ కాల్ మహిమో ఏమో కానీ, అద్భుతం జరిగింది. ఫిఫా బాలోగన్‌పై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఫుట్‌బాల్ ప్రపంచం ముక్కున వేలేసుకుంది. దశాబ్దాలుగా ఉన్న నియమ నిబంధనలు, రిఫరీల నిర్ణయాలు, క్రమశిక్షణా కమిటీల రివ్యూలు.. ఇవన్నీ ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయాయా అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇకపై ఫుట్‌బాల్ మ్యాచ్‌లలో రిఫరీల అవసరం ఏముంది? ఎవరికైనా కార్డ్ ఇస్తే నేరుగా దేశాధినేతలే రంగంలోకి దిగి సెటిల్మెంట్ చేసుకుంటే సరిపోతుంది కదా!
సోషల్ మీడియాలో ట్రోల్స్ పండగ
ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో మీమ్స్ వరద పారుతోంది. క్రీడా స్ఫూర్తి, స్వతంత్ర నిర్ణయాలు అంటూ ఫుట్‌బాల్ లవర్స్ నెత్తీ నోరూ బాదుకుంటుంటే, నెటిజన్లు మాత్రం ఈ సీన్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. "ఇకపై ఫిఫా మ్యాచ్‌లలో ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్‌లతో పాటు 'ట్రంప్ కార్డ్' కూడా ప్రవేశపెడితే గొడవ వదిలిపోతుంది." అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఏదేమైనా వరల్డ్‌కప్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలి. కానీ పవర్ పాలిటిక్స్ ముందు రూల్స్ కూడా ఎలా మోకరిల్లుతాయో ఈ ఘటన నిరూపించింది. ఈ వ్యవహారంపై ఫిఫా నుంచి ఇంకా పూర్తి స్థాయి అధికారిక వివరణ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ నిర్ణయం నిజంగానే ట్రంప్ ఒత్తిడి వల్లే జరిగి ఉంటే.. భవిష్యత్తులో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు మైదానంలో కంటే, పొలిటికల్ ఆఫీసుల్లోనే ఎక్కువగా డిసైడ్ అయ్యేలా ఉన్నాయి.. ఏం చేస్తాం.. ఇట్స్ 'ట్రంప్' వరల్డ్, మనం జస్ట్ అందులో బతుకుతున్నాం అంతే!