బీజేపీని నమ్మిన నితీష్ ఇపుడు ఎక్కడ ?
దాదాపుగా పాతికేళ్ళ పాటు బీహార్ వంటి పెద్ద స్టేట్ కి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ తన హవా చాటుకున్నారు నితీష్ కుమార్.
దాదాపుగా పాతికేళ్ళ పాటు బీహార్ వంటి పెద్ద స్టేట్ కి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ తన హవా చాటుకున్నారు నితీష్ కుమార్. ప్రజాభిమానాన్ని నిండుగా పొంది పది సార్లకు పైగా సీఎం గా ప్రమాణం చేసి సరికొత్త చరిత్రను సృష్టించారు. అయితే 2024లో బీహార్ లో మరోసారి ఎన్డీయే గెలిచిన తరువాత కొద్ది నెలలకే నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం కదిలిపోయింది. దానిని చాలా విజయవంతంగా కదిల్చింది బీజేపీ. బీహార్ లో తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉండాలని బీజేపీది రెండు దశాబ్దాల కోరిక. దానిని ఎట్టకేలకు అలా నెరవేర్చుకుంది. దానికి గానూ నితీష్ కుమార్ ని రాజ్యసభ సభ్యుడిగా నెగ్గించింది. ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ కి బీహార్ లో ఆరోగ్య శాఖ మంత్రిగా చేసింది. నితీష్ కి కేంద్రంలో కీలక స్థానం ఇస్తామని కూడా హామీ ఇచ్చింది.
నెలలు గడుస్తున్నా కూడా :
ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలో నితీష్ కుమార్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గట్టిగా చెప్పాలంటే ఆయన సీఎం సీటు వదిలేసి వందకు పైగా రోజులు గడిచిపోయాయి. కానీ నితీష్ కి కేంద్రంలో అయితే కీలక స్థానం దక్కలేదని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఆయన అసలు ఎక్కడ ఉన్నారు అన్నది కూడా ఎవరికీ తెలియడం లేదు అని అంటున్నారు. బీహార్ సీఎం గా ఉన్నపుడు జాతీయ వార్తలలో వెలిగిన నితీష్ కుమార్ ఇపుడు తెర వెనక్కి పోయారు అని ప్రత్యర్ధులు గుర్తు చేస్తున్నారు. మరో వైపు చూస్తే ఎన్డీయే సమావేశాలు ఇటీవల ఢిల్లీలో జరిగాయి. 12 ఏళ్ళ ఎన్డీయే పాలన కేంద్రంలో పూర్తి అయిన సందర్భంగా అన్ని మిత్ర పార్టీల అధ్యక్షులు ఈ సమావేశానికి వచ్చారు, కానే జేడీయూ అధినేతగా నితీష్ కుమార్ మాత్రం ఎక్కడా కనిపించలేదు అని అంటున్నారు.
ఉప ప్రధాని అంటూ :
ఇక కేంద్రంలో నితీష్ కుమార్ కి ఉప ప్రధాని ఇవ్వాలని ఆయన పార్టీకి చెందిన నాయకులు గతంలో డిమాండ్ చేశారు. నిజానికి జేడీయూ నేతలు ఎవరికీ నితీష్ కుమార్ బీహార్ ని వీడిపోవడం అన్నది అసలు ఇష్టం లేదని తెలుస్తోంది. కేంద్రానికి వెళ్తే మాత్రం ఉప ప్రధాని అయినా ఇవ్వాలని అలాంటి స్థాయి నితీష్ ది అని ఆయన వర్గం అంటోంది. అయితే ఇప్పటికి చూస్తే కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తమే ఫిక్స్ కాలేదని అంటున్నారు. ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆ తరువాత ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. దాంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణ ఆగస్టు దాకా ఉండదా అన్న కొత్త చర్చ కూడా సాగుతోంది. దాంతో మరిన్నాళ్ళు నితీష్ కుమార్ ఎంపీగానే ఉండాల్సి వస్తుందా అన్నది ఆయన అభిమానులను వేధిస్తున్న విషయంగా ఉంది.
ఏ శాఖలు ఇస్తారంటూ :
ఇక చూస్తే కనుక మరో వైపు కేంద్రంలో కీలక శాఖలకు ఏవేవో పేర్లు వినిపిస్తున్నాయి. రైల్వే శాఖకు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ సిన్హా పేరు ప్రచారంలో ఉంది. అలాగే ఆర్ధిక మంత్రిగా మరో ప్రముఖుడి పేరు ఉంది. అలాగే ఇతర కీలక శాఖలకు అనేక మంది పేర్లు వినవస్తున్నాయి. దాంతో నితీష్ కి కేంద్ర మంత్రి వర్గంలో చోటు ఇచ్చినా ప్రాధాన్యత కలిగిన శాఖలు దక్కుతాయా అన్న చర్చ కూడా మొదలైంది అంటున్నారు. కేంద్ర వ్యవసాయం గ్రామీణాభివృద్ధి వంటి శాఖలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ సమర్ధంగా చేస్తున్నారు. దాంతో ఆయన నుంచి వాటిని తీసుకోవడానికి కుదిరేది కాదని అంటున్నారు. మొత్తానికి నితీష్ కి కేంద్ర మంత్రి పదవి ఎపుడు దక్కుతుంది, ఏ శాఖలు ఇస్తారు అన్నది ఇపుడు చర్చగా ఉంది. బీజేపీని నమ్మి సీఎం సీటు వదులుకున్న నితీష్ మిత్ర పార్టీలను అలెర్ట్ చేస్తున్నట్లుగానే కనిపిస్తున్నారు అని అంటున్నారు.