జస్ట్ ఆస్కింగ్.. ప్రకాష్ రాజుకు పెద్ద ప్రోబ్లం.. ఉపా కేసుపై బీజేపీ ఫోకస్?
ఉపా కేసులో అరెస్టు అయిన యూట్యూబర్ రావణ్ తో మరికొందరిని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు.
యూట్యూబర్ రావణ్ కేసులో ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ కు ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉపా చట్టం కింద రావణ్ అరెస్టు అనంతరం ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్లు, విడుదల చేసిన వీడియోల ద్వారా ఆయన కూడా ఈ సందేహం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. రావణ్ అరెస్టుకు ముందు ప్రకాష్ రాజ్ తో ఆయనకు ఉన్న సంబంధాలపై మంత్రి కందుల దుర్గేష్ చేసిన వ్యాఖ్యలు, ఉపా కేసులో అరెస్టు అయిన తర్వాత రావణ్ ఫోన్ నుంచి బయటపడిన సమాచారంతో ఇద్దరి మధ్య అవగాహన ఉందనే విషయమై పోలీసులు ఒక అంచనాకు వచ్చారని అంటున్నారు. దీంతో రావణ్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీసేందుకు ప్రకాష్ రాజ్ ను సైతం విచారించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.
ఉపా కేసులో అరెస్టు అయిన యూట్యూబర్ రావణ్ తో మరికొందరిని కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధానంగా ఈ కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయంగా పట్టు సాధించాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక అజెండాతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శిస్తున్న కొందరికి ప్రశ్న రావణ్ తో సంబంధాలు ఉండటంపై ప్రభుత్వం ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు. ప్రధానంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ తో ప్రశ్న రావణ్ కు ఉన్న సంబంధాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఫోకస్ చేసిందని అంటున్నారు. తరచూ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను విమర్శిస్తున్న ప్రకాష్ రాజ్ కు ఎక్కడ చెక్ చెప్పాలనే విషయమై కేంద్ర పెద్దలు ఎదురుచూస్తున్నారని, వారికి ఏపీలో నమోదు అయిన ఉపా కేసు చక్కని అస్త్రంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిపై ఉపా కేసులు నమోదు అయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్ సాయిబాబా, విరసం నేత వరవరరావు వంటివారు ఉన్నారు. ఇప్పుడు యూట్యూబర్ రావణ్ సైతం ఉపా చట్టం కిందే అరెస్టు అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్ ను కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు. దీంతో పనిలో పనిగా ప్రకాష్ రాజ్ కు కూడా నోటీసులు ఇచ్చేలా కేంద్ర పెద్దల నుంచి రాష్ట్రానికి సూచనలు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. జస్ట్ ఆస్కింగ్ అంటూ తరచూ కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడే ప్రకాష్ రాజ్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ కేసును సునిశితంగా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇక ప్రకాష్ రాజ్ సైతం ఈ కేసుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. యూట్యూబర్ రావణ్ పై ఉపా కేసు నమోదు అయిన నుంచి ఆయనలో కొంత ఆందోళన కనిపిస్తోందని పరిశీలకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. రావణ్ తో ప్రకాష్ రాజ్ కు సత్సంబంధాలు ఉన్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కొన్ని వీడియో సాక్షాలు కూడా ప్రభుత్వం సేకరించినట్లు చెబుతున్నారు. దీంతో ప్రకాష్ రాజ్ సైతం సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఒక యూట్యూబర్ పై దేశద్రోహం కేసు నమోదు చేస్తారా? ఇంతలా దిగజారుతారు అనుకోలేదు అంటూ ప్రకాష్ రాజ్ ఘాటు వ్యాఖ్యలతో ఎక్స్ లో ట్వీట్ చేశారు.
ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే ప్రకాష్ రాజ్ చుట్టూ పకడ్బందీ వ్యూహరచన జరుగుతున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రశ్నించడం ఏమైనా తప్పా? అంటూ ప్రకాష్ రాజ్ నిలదీస్తుంటే, మతాలు, కులాల మధ్య చిచ్చురేపేలా వ్యాఖ్యానాలు చేస్తే క్షమించి వదిలేస్తారా? అంటూ ప్రభుత్వం నుంచి కూటమి నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ఇక ప్రకాష్ రాజ్-రావణ్ మధ్య సంబంధాలపై క్లారిటీ రావడంతో బీజేపీ కూడా ఈ కేసుపై సమగ్ర వివరాలు సేకరించి తగిన విధంగా స్పందించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో రావణ్ కేసులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులకు నోటీసులు వచ్చే పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు.