ఉత్తరాంధ్రకు యోగం...భోగం !
అతి త్వరలో ఈ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తోంది. దాంతో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రాకు ఒక యోగం ఒక భోగం అని అంతా అంటున్నారు.
ఉత్తరాంధ్రా అంటే అత్యంత వెనకబడిన ప్రాంతాలు అన్నది అందరికీ తెలుసు. అదే శ్రీక్రిష్ణ కమిషన్, శివరామకృష్ణ కమిటీ కూడా తమ నివేదికలలో తెలియచెప్పాయి. విశాఖ సిటీలో అభివృద్ధి తప్ప అక్కడ నుంచి రూరల్ ప్రాంతానికి వెళ్ళినా లేక విజయనగరం శ్రీకాకుళం జిల్లాలను తలచుకున్నా ప్రగతి అనేది ఎక్కడా కానరాదు. అలాంటి ఉత్తరాంధ్రాకు గేమ్ చేంజర్ లాంటి అతి పెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అతి త్వరలో ఈ ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తోంది. దాంతో భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్రాకు ఒక యోగం ఒక భోగం అని అంతా అంటున్నారు.
భారీ ఎత్తున నిర్మాణం :
విజయనగరం జిల్లాలోని భోగాపురంలో 2,203 ఎకరాలలో 4,592 కోట్ల రూపాయలతో ఈ ఎయిర్ పోర్టు నిర్మితం అయింది. జీఎమ్మార్ సంస్థ దీని నిర్మాణం చేపట్టింది. ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుని పూర్తిగా ఆధునాతన టెక్నాలజీతో రూపొందించారు. ఏకంగా 270 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినా కూడా అలాగే 25 సెంటీమీటర్లకు పైగా అత్యంత భారీ వర్షపాతం నమోదు అయినా కూడా దాన్ని తట్టుకునే విధంగా బహు దిట్టంగా ఈ ఎయిర్ పోర్టుని నిర్మాణం చేసారు.
ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరు :
ఇక భోగాపురం ఎయిర్ పోర్టుకు ఏరో డ్రోమ్ లైసెన్స్ మంజూరుతో ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం చేసుకుంది. భోగాపురం విమానాశ్రయం శత శాతం పూర్తయింది. అతి తొందరలోనె ఈ ఎయిర్ పోర్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రధాని మోది కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం సంప్రదించారని చెబుతున్నారు. ఇక గడచిన నెలరోజులుగా కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ కార్యక్రమం భోగాపురంలో నిర్విరామంగా సాగింది. ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవం అయిన వారం రోజుల తర్వాత పూర్తి స్థాయి కార్యకలాపాలు రాకపోకలు సైతం భోగాపురం ఎయిర్ పోర్టు నుంచే కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
నాలుగు కోట్ల మందితో :
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు సామర్థ్యం కూడా గొప్పది అని అంటున్నారు. నాలుగు కోట్ల మంది ప్రయాణీకుల రాకపోకలకు అనువుగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం చేసినట్టుగా చెబుతున్నారు. దేశంలో చూస్తే కనుక టైర్ వన్ సిటిలలో ఏర్పాటయ్యే విమానాశ్రయాలకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో వసతులు ఈ విమానాశ్రయంలో ఉన్నాయి. ఇక ఎగిరే చేప ఆకృతిలో 78 వేల చదరపు అడుగుల పరిమాణంలో టెర్మినల్ భవనం నిర్మాణం జరిగింది. అదే విధంగా ఇంటిరియర్, ఎక్స్ టీరియర్ వసతులు మరింత అందంగా స్థానిక సంస్కృతి అద్దం పట్ట్లేలా తీర్చిదిద్దినట్టుగా అధికారులు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో దేశంలో నిర్మాణం అయిన విమానాశ్రయాలలో ది బెస్ట్ గా అత్యుత్తమమైనదిగా భోగాపురం ఎయిర్ పోర్టుని చెప్పుకోవచ్చు.
ఉత్తరాంధ్రాకు గ్రోత్ ఇంజన్ :
భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ఒక్కసారి కనుక పూర్తి అయితే ఉత్తరాంధ్ర అభివృద్ధికి మరింత దోహదం అవుతుందని కూటమి ప్రభుత్వం ధీమాగా ఉంది. విశాఖపట్నానికి విమానాశ్రయం దూరం అవుతోందనే అపోహ ఒకటి ఉంది, అయితే దాని మీద కూడా కూటమి ప్రభుత్వం స్పష్టత ఇస్తోంది. విశాఖ నుంచి భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం అయ్యే ఏడు రోడ్లను మరింత విశాలంగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపడుతున్నట్టుగా ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇందులో విశాఖ ఆర్కే బీచ్ నుండి భోగాపురం మీదుగా ఆరు లైన్ల జాతీయ రహదారి కోస్టల్ కారిడార్ కోసం ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. ఇలా అన్ని అనుమతులు పూర్తైన తరువాత రెండేళ్లలో నిర్మాణం పూర్తి అవుతుందని అంటున్నారు.
స్థానిక యువతకు ఉపయుక్తంగా :
ఇక హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం మూడు లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని చేరువ చేస్తోంది, అదే విధంగా భోగాపురం ఎయిర్ పోర్టు రాబోయే రోజులలో ఉపాధితో పాటు అభివృద్ధికి కూడా కేంద్ర బిందువు అవుతుందని అంటున్నారు. కార్గో కోసం ప్రత్యేకంగా భోగాపురం విమానాశ్రయం నిర్మాణం అయిందని, ఆక్వా, ఫార్మా రంగాలకు ఉపయుక్తంగా నిలవనుందని అధికారులు తెలిపారు. అలాగే ఎంఆర్వో కార్యకలాపాల కోసం భోగాపురంలో ప్రత్యేక శ్రద్ధ కేటాయించినట్టు అధికారులు స్పష్టం చేశారు. దేశంలో విమానాల నిర్వహణ, రిపేర్, ఆపరేషన్ స్థానికంగానే ఏర్పాటు ఉండాలని ఎమ్మార్వో నెట్ వర్క్ ని అక్కడే విస్తృతం చేస్తున్నట్టుగా తెలిపారు. ఇక విమానయాన రంగంలో ఉపాధి కోసం స్థానిక యువతకు ఉపయుక్తంగా ఉండేలా ఎడ్యుసిటి నిర్మాణం కోసం కూడా జరుగుతొంది. ఇలా విమానాశ్రయంలోని ఎమ్మార్వో నెట్ వర్క్ ఎడ్యు సిటి ఇతర అన్ని సదుపాయాలు వంటి వాటి ద్వారా రానున్న కాలంలో భోగాపురం ప్రాంతం అంతర్జాతీయంగా ఏవియేషన్ హబ్ గా అవతరించబోతోందని కూటమి ప్రభుత్వం పూర్తి విశ్వాసంతో ఉంది.