ఈజీ మనీ కోసం అడ్డదారి.. యూట్యూబ్ చూసి దొంగలుగా మారిన తల్లీకొడుకులు!

ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అడ్డదారిని ఎంచుకున్న తల్లీకొడుకులు ప్లాన్ రివర్స్ అయింది. యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ పద్ధతులు చూసి నేరానికి పాల్పడిన ఇద్దరు కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కారు.

Update: 2026-07-07 15:30 GMT

ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు అడ్డదారిని ఎంచుకున్న తల్లీకొడుకులు ప్లాన్ రివర్స్ అయింది. యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ పద్ధతులు చూసి నేరానికి పాల్పడిన ఇద్దరు కేవలం గంటల వ్యవధిలోనే పోలీసులకు చిక్కారు. పక్కా ప్లాన్‌తో దొంగతనం చేసినప్పటికీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు. సీసీ కెమెరా పుటేజి సాయంతో నిందితులను గుర్తించి జైలుకు పంపారు. చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని బాధితురాలికి అందజేశారు. విశాఖ నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పోలీసుల విచారణలో నిందితులు చెప్పిన సమాచారం షాక్ కు గురిచేస్తోంది. జల్సాలకు అలవాటు పడటం, భర్త వదిలేయడంతో బతకడానికి అడ్డదారి ఎంచుకున్న ఆ తల్లి కుమారుడు జీవితాన్ని నాశనం చేసింది.

విలాసవంతమైన జీవితం.. ఆర్థిక ఇబ్బందులు

విశాఖ నగరానికి చెందిన ధనలక్ష్మి అనే మహిళ విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడింది. ఈ క్రమంలో చిట్టీలు వేసి భారీగా నష్టపోయింది. కొనుగోలు చేసిన ఫ్లాట్ నెలవారి కిస్తీలు కూడా సకాలంలో చెల్లించలేకపోయింది. మరోవైపు రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో జీవితం సంక్షోభంలో పడింది. ఆర్థిక పరిస్థితులు విషమించడంతో భర్త కూడా ఆమెను వదిలేసి వెళ్లిపోయాడని చెబుతున్నారు. కష్టాల నుంచి బయటపడేందుకు ఏ మార్గం దొరక్క, ఈజీ మనీ కోసం ఆమె నేరపూరితమైన ఆలోచన చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.

యూట్యూబ్ వేదికగా నేర శిక్షణ

ఎలాగైనా డబ్బు సంపాదించాలనే ఆశతో, యూట్యూబ్‌లో చైన్ స్నాచింగ్ ఎలా చేయాలో వీడియోలు చూసి క్షుణ్ణంగా నేర్చుకుంది. ఈ నేరంలో తన కన్నకొడుకు అక్షిత్‌ను కూడా భాగస్వామిని చేసింది. దొంగతనానికి పాల్పడేటప్పుడు పోలీసుల కంట పడకుండా ఉండేందుకు వీరు అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు. స్కూటీ నంబర్ ప్లేట్‌ కనిపించకుండా ప్లాస్టర్ వేశారు. కొడుకు అక్షిత్ మాస్క్, టోపీ ధరించగా, తల్లి ధనలక్ష్మి చున్నీతో ముఖం కనిపించకుండా జాగ్రత్త పడింది.

గత నెల 27న సుజాతనగర్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న ఓ వృద్ధురాలిని వీరు తమ టార్గెట్‌గా ఎంచుకున్నారు. అడ్రస్ అడుగుతున్నట్లుగా ఆమెతో మాటలు కలిపి, ఆమె ఏమరుపాటుగా ఉన్న సమయంలో మెడలోని రెండు 5 తులాల బంగారు గొలుసులను ఒక్కసారిగా లాక్కున్నారు. గొలుసును లాక్కున్న వెంటనే స్కూటీపై అక్కడి నుంచి మెరుపు వేగంతో పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలను నిశితంగా పరిశీలించారు. సాంకేతిక ఆధారాలు, ఫుటేజీల ద్వారా నిందితుల ఆనవాళ్లను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న దొంగిలించిన బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. కన్నకొడుకు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోకుండా, అతన్ని నేరస్థుడిగా మార్చిన తల్లి చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని, అడ్డదారులు ఎప్పుడూ ప్రమాదకరమేనని ఈ ఘటన నిరూపించిందని అంటున్నారు.

Tags:    

Similar News