పవన్ సార్, ఇటుచూడండి : యథావిధిగా గోదావరి.. రాత్రి సమయంలో నదిలోకి కలుషిత జలాలు?
గోదావరి కాలుష్యంపై రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు పేపరు మిల్లు యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ తన పర్యటన సమయంలో ఆదేశించారు.
గోదావరి జలాల కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు అమలుకు నోచుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గోదావరిలో కలుషిత జలాలు వదిలితే జైలులో పెడతామని మే నెల చివరి వారంలో డిప్యూటీ సీఎం హెచ్చరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే పుష్కరాలకు ఏర్పాట్లు పరిశీలించే సమయంలో గోదావరిలో కలుషిత జలాలు పవన్ దృష్టికి వచ్చాయి. ఆ సమయంలో తీవ్రంగా స్పందించిన పవన్ నది ప్రక్షాళనకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నారు. ఉన్నతాధికారులతో ప్రత్యేక టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయడంతోపాటు నదిలోకి కలుషిత జలాలు వదులుతున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.
అయితే, ఉప ముఖ్యమంత్రి పవన్ పర్యటన ముగిసి దాదాపు నెలన్నర అవుతున్నా, రాజమండ్రి సమీపంలో గోదావరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. రాత్రి వేళల్లో వ్యర్థాలతోపాటు కలుషిత జలాలను నదిలోకి వదులుతున్నట్లు ఆరోపిస్తున్నారు. పేపరు మిల్లుతోపాటు నల్లా చానల్ నుంచి పెద్ద ఎత్తున కలుషిత జలాలు గోదావరిలో కలుస్తున్నాయని అంటున్నారు. దీంతో నది పరివాహక ప్రాంతాల్లో దుర్గంధం రాజ్యమేలుతోంది. నల్లా చానల్ ఎగువన ఉన్న కోటి లింగాల ఘాట్ నుంచి దిగువన ఉన్న పుష్కర ఘాట్, మార్కండేయ ఘాట్ వద్ద దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. కొన్నిచోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద ఎత్తున పేరుపోయాయి. నదిలో కాలు పెట్టలేని విధంగా ఆ ప్రాంతం తయారైందని అంటున్నారు.
గోదావరి కాలుష్యంపై రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు పేపరు మిల్లు యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ తన పర్యటన సమయంలో ఆదేశించారు. కానీ, ఇప్పటికీ ఆయా సంస్థల వైఖరిలో మార్పు రాలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై స్థానిక పత్రికల్లో పెద్ద ఎత్తున వార్తా కథనాలు వస్తున్నా అధికారులు చీమకుట్టినట్లుగా కూడా వ్యవహరించడం లేదని పర్యావరణ ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోదావరిలో కలిసే మురుగునీటిని శుద్ధి చేయాలని, ఆ తర్వాతే నదిలోకి వదలాలి అని పవన్ సూచించారు. అయితే ధవళేశ్వరం సాయిబాబా గుడి దిగువన శుద్ధి చేయని మురుగునీరు ఇప్పటికీ కలుస్తుందని స్థానికులు చెబుతున్నారు.
దీంతో నది రంగు, రూపం మారిపోతోందని అంటున్నారు. పుష్కరాలకు ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉండటంతో అప్పటిలోగా ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలని కోరుతున్నారు. ఇక గోదావరితోపాటు రాష్ట్రంలోని ప్రధాన నదులను కాలుష్యం నుంచి రక్షించేందుకు ఏర్పాటైన టాస్క్ ఫోర్సు ఏం చేస్తుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ టాస్క్ ఫోర్సు సమావేశం కావాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఆ సమావేశంలో నదీ జలాల పరిరక్షణపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అయితే టాస్క్ ఫోర్సు ఏర్పాటై నెల రోజులు అవుతున్నా ఇంకా కార్యాచరణ మొదలుపెట్టిన దాఖలా కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ మరోసారి ఈ విషయమై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.