‘స్త్రీశక్తి’ నెగిటివిటీనే పెంచుతుందా? ఉచితంతో అనవసర తలనొప్పి!

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్త్రీశక్తి’ పథకం ఎటువంటి ఫలితాలు ఇచ్చిందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది.

Update: 2026-07-07 14:30 GMT

కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్త్రీశక్తి’ పథకం ఎటువంటి ఫలితాలు ఇచ్చిందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ఏడాది ఆగస్టు 15న మొదలైన ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని పొందారు. అయితే ఉచితం అనగానే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భావనే ఎక్కువగా వ్యక్తమవుతున్నా, క్షేత్రస్థాయి పరిస్థితులు గమనిస్తే ఈ పథకం అమలు తీరులో కొన్ని లోపాల వల్ల ప్రజలకు జరుగుతున్న మంచి కన్నా, ప్రభుత్వానికి వస్తున్న చెడ్డపేరే ఎక్కువగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

గత ఏడాది ప్రవేశపెట్టిన స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్న అభిప్రాయాన్ని కలిగిస్తోందని అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ ను దిగ్విజయంగా అమలు చేస్తున్నా, పథకం ఫలితాలు అనుభవిస్తున్న వారితోపాటు ఇతర ప్రయాణికుల్లోనూ సంతృప్తి కనిపించడం లేదన్న టాక్ ఎక్కువగా ఉంది. అదే సమయంలో పనిభారం, విధి నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులతో ఆర్టీసీ ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారని చెబుతున్నారు. స్త్రీశక్తి అమలుకు ముందు ఇతర రాష్ట్రాల్లో ఎదురైన సవాళ్లను అధ్యయనం చేసిన కూటమి ప్రభుత్వం ఎంతో పకడ్బందీగా నిర్ణయాలు తీసుకుందని చెప్పినా, క్షేత్రస్థాయిలో అనేక లోపాలు పథకం ఉద్దేశాన్ని అటకెక్కిస్తున్నాయని పెదవి విరుస్తున్నారు.

ఉచిత బస్సుతో మహిళలు తండోపతండోలుగా ప్రయాణాలు చేస్తుండటంతో సిబ్బందిపై పనిభారం ఎక్కువైందనే ఆవేదన కనిపిస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు మహిళా ప్రయాణికులు పోటెత్తుతుండటంతో బస్సులు అన్నీ కిటకిటలాడుతున్నాయని చెబుతున్నారు. దీనివల్ల డ్రైవర్, కండక్టర్లపై విపరీతమైన పని ఒత్తిడి పెరిగిపోయిందని అంటున్నారు. అదనపు డ్యూటీలు, పనివేళలు ఎక్కువ కావడం, సెలవులు లభించకపోవడం, విధి నిర్వహణ సమయంలో క్షణం కూడా తీరిక లేకపోవడం వల్ల సిబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారని అంటున్నారు.

ఆర్టీసీలో చాలా కాలం నుంచి నియామకాలు లేకపోవడం వల్ల ఇప్పటికే సిబ్బంది కొరత పీడిస్తోందని అంటున్నారు. స్త్రీశక్తి పథకం వల్ల రద్దీ పెరిగిపోవడం వల్ల సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి నెలకొందని అంటున్నారు. ఈ కారణంగానే మహిళా ప్రయాణికులతో కీచులాటలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఉచితం అమలయ్యే బస్సుల్లో ప్రయాణికులు పరిమితికి మించి ప్రయాణిస్తుండటం, స్టాప్ ఉన్న చోట బస్సును నిలపలేని పరిస్థితులు కూడా చోటుచేసుకుంటున్నాయి. దీంతో మహిళలు సిబ్బందితో యుద్ధానికి దిగుతున్నారు. మరోవైపు మహిళా ప్రయాణికులు అనూహ్యంగా పెరిగిపోవడంతో ఇతర ప్రయాణికులు బస్సు ప్రయాణాన్ని నరకంలా భావించే పరిస్థితులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలకు వెళ్లేవారు సమయానికి బస్సులు అందుకోలేక నానా యాతన అనుభవిస్తున్నారని అంటున్నారు.

ఇది ప్రభుత్వంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు పెంచడం, అదనపు సిబ్బందిని నియమించడం, బస్సుల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణ ఉంటే తప్ప ఈ సమస్యలు అధిగమించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న పథకం ఏ ఒక్కరికి సంతృప్తిని ఇవ్వకపోవడం అంటే తక్షణంలో ఆలోచించాల్సిన విషయమే అంటున్నారు. కొన్ని మార్పులు చేయడం ద్వారా ప్రభుత్వం ఆశించిన ప్రయోజనం దక్కే అవకాశం ఉన్నప్పటికీ, ఆర్టీసీ ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడంతో స్త్రీశక్తి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News