చైనాను గట్టి దెబ్బ కొట్టిన అమెరికా!
తాజాగా అమెరికా జోక్యంతో వెనిజులా రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో పాలన కూలిపోవడంతో అక్కడ అధికార వ్యవస్థ పూర్తిగా మారిపోయే దిశగా అడుగులు పడుతున్నాయి.;
సోషలిస్ట్ దేశమైన వెనిజులాలో చైనా గత రెండు దశాబ్ధాలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టింది. ఎనర్జీ రంగం నుంచి స్పేస్, మైనింగ్, మౌలిక సదుపాయాల వరకూ వెనిజులా-చైనా భాగస్వామ్యం ఎంతో కీలకంగా మారింది. ముఖ్యంగా చమురు రంగంలో వెనిజులా వ్యూహాత్మక మిత్రదేశంగా నిలిచింది.
చైనా పెట్టుబడుల నేపథ్యం
వెనిజులా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని ముందుగానే గుర్తించిన చైనా.. అక్కడి ప్రభుత్వానికి వేల కోట్ల డాలర్ల రుణాలు ఇచ్చింది. ఆ రుణాల ప్రతిఫలంగా వెనిజులా చమురును తక్కువ ధరకే దీర్ఘకాలిక ఒప్పందాల ద్వారా దిగుమతి చేసుకుంటూ వచ్చింది. ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభంతో వెనిజులా అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదుర్కొన్నా.. చైనా మాత్రం చమురు రూపంలో లాభం పొందుతూనే ఉంది.
అమెరికా జోక్యంతో మారిన పరిస్థితులు
తాజాగా అమెరికా జోక్యంతో వెనిజులా రాజకీయ పరిస్థితుల్లో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో పాలన కూలిపోవడంతో అక్కడ అధికార వ్యవస్థ పూర్తిగా మారిపోయే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పరిణామాలు చైనా పెట్టుబడులపై నీలినీడలు కమ్ముకునేలా చేశాయి.
చైనాకు ఎదురయ్యే నష్టాలు
వెనిజులాలో కొత్త పాలన ఏర్పడితే గత ప్రభుత్వంతో చైనా చేసుకున్న ఒప్పందాలపై పునర్విచారణ జరిగే అవకాశం ఉంది. చమురు సరఫరా ఒప్పందాలు రద్దయ్యే లేదా పునర్నిర్ణయానికి వచ్చే పరిస్థితి ఉంది. అలాగే చైనా పెట్టిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తిరిగి వస్తాయా? అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఇది చైనా ఎనర్జీ భద్రతకే కాకుండా లాటిన్ అమెరికాలో దాని ప్రభావానికి కూడా గట్టి ఎదురుదెబ్బగా మారవచ్చు.
అమెరికా వ్యూహం ఏమిటి?
వెనిజులా విషయంలో అమెరికా తీసుకున్న చర్యలు కేవలం రాజకీయ మార్పు కోసమే కాదు. చైనా ప్రభావాన్ని తగ్గించడం.. తమ ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పడం కూడా ఇందులో భాగమేనని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చైనాను ఆర్థికంగా.. వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ జోక్యం జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మొత్తంగా చూస్తే వెనిజులా పరిణామాలు చైనాకు పెద్ద షాక్‌గా మారాయి. తక్కువ ధరకే చమురు తీసుకొని.. భారీ పెట్టుబడులతో లాభాలు పొందిన చైనా ఇప్పుడు అనిశ్చితిలో పడింది. మరోవైపు అమెరికా మాత్రం ఈ పరిణామాలతో అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి తన శక్తిని చాటుకుంటోంది. వెనిజులా భవిష్యత్ పాలన ఏ దిశగా సాగుతుందో అనేదానిపై చైనా–అమెరికా సంబంధాలపై కూడా కీలక ప్రభావం పడనుంది.