చపాతీ, క్యారెట్‌తో రోజులుగా భోజనం.. హర్మూజ్ నౌకల్లో అమెరికా సైనికుల ఆకలి కేకలు

శత్రువుల తూటాల కంటే కూడా కనీస అవసరాలైన ఆహారం.. వసతుల కొరత సైనికులను మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్నాయి.;

Update: 2026-04-18 09:31 GMT

పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికాకు చెందిన సైనికులు యుద్ధ క్షేత్రంలో ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. శత్రువుల తూటాల కంటే కూడా కనీస అవసరాలైన ఆహారం.. వసతుల కొరత సైనికులను మానసికంగా, శారీరకంగా దెబ్బతీస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు అమెరికా సైనిక విభాగంలో కలకలం రేపుతున్నాయి.

ఆహార కొరత.. ఖాళీ ప్లేట్లు.. ఆకలి కేకలు

వైరల్ అవుతున్న చిత్రాల ప్రకారం.. యుద్ధ నౌకల్లో విధులు నిర్వహిస్తున్న సైనికుల భోజన పళ్లెల్లో అత్యల్ప పరిమాణంలో ఆహారం కనిపిస్తోంది. రెండు పలచటి చపాతీలు.. కొన్ని ఉడికించిన క్యారెట్ ముక్కలు, నామమాత్రంగా ఉన్న మాంసాహారం మాత్రమే వారికి అందుతోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం అని పేరున్న యూఎస్ ఆర్మీకి ఈ పరిస్థితి ఎదురవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ముఖ్యంగా ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా హర్మూజ్ జలసంధి సమీపంలో మోహరించిన యూఎస్ఎస్ ట్రిపోలి, యూఎస్ఎస్ అబ్రహం లిన్ కోలిన్ వంటి భారీ యుద్ధ నౌకల్లో సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నౌకల్లో తాజా ఆహార పదార్థాల నిల్వలు నిండుకోవడంతో ఉన్న దానిని అందరికీ సర్దుబాటు చేసేందుకు 'రేషన్' పద్ధతిని అమలు చేస్తున్నారు. ఒక మెరైన్ తన కుటుంబానికి పంపిన సందేశంలో "ఆహారం దొరికినప్పుడు తింటున్నాం.. ఒకవేళ ఎవరికైనా కొంచెం ఎక్కువ లభిస్తే అది ఇతరులతో పంచుకుంటున్నాం" అని తెలపడం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది.

రవాణా ఆంక్షలు.. నిలిచిపోయిన పోస్టల్ సేవలు

సైనికులకు వారి ఇళ్ల నుంచి అందే పార్సిళ్లు, ఆహార పదార్థాలు కూడా నిలిచిపోవడం సమస్యను మరింత క్లిష్టం చేసింది. ఏప్రిల్ నెల నుంచి గగనతల మార్గాల్లో ఆంక్షలు, రవాణా అంతరాయం కారణంగా మిలిటరీ జిప్ కోడ్స్ కు డెలివరీలు నిలిచిపోయాయి. దీనివల్ల కుటుంబ సభ్యులు పంపే వ్యక్తిగత వస్తువులు కూడా సైనికులకు చేరడం లేదు. మార్చి 27న సుమారు 3,500 మంది మెరైన్లతో వెళ్లిన యూఎస్ఎస్ ట్రిపోలితో పాటు.. జనవరి నుంచి అక్కడే ఉన్న యూఎస్ఎస్ అబ్రహం లిన్ కోలిన్ సిబ్బంది సరైన పోషణ లేక ఇబ్బందులు పడుతున్నారు.

సాంకేతిక సమస్యలు.. ప్రమాదాలు

ఆహార కొరత ఒకవైపు వేధిస్తుంటే మరోవైపు సాంకేతిక వైఫల్యాలు సైనికుల జీవనాన్ని నరకప్రాయం చేస్తున్నాయి. ఇటీవల యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్.ఫోర్డ్ నౌకలోని లాండ్రీ విభాగంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల వెలువడిన విష వాయువుల కారణంగా పలువురు సైనికులు అస్వస్థతకు గురయ్యారు. అదే నౌకలో మరుగుదొడ్లు మొరాయించడంతో వేలాది మంది సిబ్బంది తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొన్నారు. సముద్రం మధ్యలో కనీస సౌకర్యాలు లేకపోవడం సైనికుల నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తోంది.

యుద్ధ వాతావరణం, సరఫరా గొలుసులో అంతరాయం, అనుకోని ప్రమాదాలు అన్నీ కలిసి అమెరికా సైనికులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇరాన్ చుట్టూ వ్యూహాత్మక మోహరింపులు చేస్తున్న అమెరికా, తన సైనికుల కనీస అవసరాలను తీర్చడంలో విఫలమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పెంటగాన్ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ బయటకు వస్తున్న కథనాలు మాత్రం పశ్చిమాసియా తీరంలో అమెరికా సేనలు ఆకలితో... అసౌకర్యంతో పోరాడుతున్నాయని స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News