నీ ఇష్టమొచ్చినట్టు నడవదు అమెరికా.. ట్రంప్ కు షాకిచ్చిన సెనెట్
ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న కెనడాతో వాణిజ్య చర్చలను నిలిపివేయడం.. ఆ దేశంపై అదనపు సుంకాలు (టారిఫ్‌లు) విధించాలన్న నిర్ణయాన్ని సెనెట్ తిరస్కరించింది.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాలకు అమెరికా సెనెట్‌లో మరోసారి చుక్కెదురైంది. ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న కెనడాతో వాణిజ్య చర్చలను నిలిపివేయడం.. ఆ దేశంపై అదనపు సుంకాలు (టారిఫ్‌లు) విధించాలన్న నిర్ణయాన్ని సెనెట్ తిరస్కరించింది. కెనడాపై విధించిన సుంకాలను తక్షణమే తొలగించాలన్న తీర్మానం సెనెట్‌లో ఆమోదం పొంది, ట్రంప్ నిర్ణయానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
*పార్టీలకు అతీతంగా సెనెటర్ల ఏకగ్రీవం
ట్రంప్ తీసుకున్న ఈ సుంకాల నిర్ణయానికి వ్యతిరేకంగా డెమోక్రట్లతో పాటు ఏకంగా నలుగురు రిపబ్లికన్ సెనెటర్లు కూడా ఓటు వేయడం ఇక్కడ గమనార్హం. మొత్తం ఓటింగ్‌లో 50 మంది సభ్యులు వ్యతిరేకంగా, 46 మంది మద్దతుగా ఓటు వేయడంతో ఈ తీర్మానం విజయవంతమై ఆమోదం పొందింది. వర్జీనియా సెనెటర్ టిమ్ కైన్ ఈ తీర్మానాన్ని తిరిగి ప్రవేశపెట్టగా ఈసారి ఇది విజయం సాధించింది. గతంలో ప్రవేశపెట్టిన ఇలాంటి తీర్మానం వీగిపోయినా, తాజా ఓటింగ్‌లో పార్టీ రేఖలను దాటి సెనెటర్లు ఒక్కటి కావడంతో ట్రంప్‌కు పరాజయం తప్పలేదు.
* 'కెనడా అమెరికాకు మిత్రదేశం'
తీర్మానం ఆమోదం తర్వాత టిమ్ కైన్ మాట్లాడుతూ “అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికార చట్టాలను ఉపయోగించి మిత్రదేశమైన కెనడాపై సుంకాలు విధించడం సమర్థనీయం కాదు. కెనడా అమెరికాకు సుదీర్ఘకాల మిత్రదేశం. ఈ బంధం దెబ్బతినకూడదు” అని స్పష్టం చేశారు. అలాగే, కెనడా సరిహద్దు రాష్ట్రమైన మైనేకు చెందిన రిపబ్లికన్ సెనెటర్ సుసాన్ కాలిన్స్ కూడా ఈ తీర్మానానికి మద్దతు ఇస్తూ, “కెనడాపై సుంకాలు మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. పరిశ్రమలు, ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి” అని తమ ఆందోళనను వ్యక్తం చేశారు.
* తీర్మానం: ట్రంప్ నిర్ణయానికి గట్టి ప్రతిఘటన
ట్రంప్ ఆగ్రహంతో కెనడాపై సుంకాలను విధిస్తూ వాణిజ్య చర్చలను నిలిపివేసిన నేపథ్యంలో ఇప్పుడు సెనెట్ ఆమోదించిన ఈ తీర్మానం ఆ నిర్ణయానికి గట్టి ప్రతిఘటనగా నిలిచింది. రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక, రాజకీయ సంబంధాలను కాపాడాలనే ఉద్దేశ్యంతో సెనెట్ సభ్యులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో కూడా బ్రెజిల్‌పై ట్రంప్ విధించిన సుంకాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇదే తరహా తీర్మానాన్ని సెనెట్ ఆమోదించింది. ఇది, దేశ అంతర్జాతీయ వాణిజ్య విధానాలపై అధ్యక్షుడు ట్రంప్ యొక్క ఏకపక్ష వైఖరికి సెనెట్ ఎంతమాత్రం మద్దతు ఇవ్వడం లేదని సూచిస్తుంది..