విఫలమైన చర్చలు.. అమెరికా - ఇరాన్ మధ్య ముదిరిన వైరం.. యుద్ధ మేఘాలు తప్పవా?

"ఇరాన్ వైఖరిలో ఎలాంటి సానుకూల మార్పు కనిపించడం లేదు. మా నిబంధనలకు వారు అంగీకరించనంత వరకు శాంతి సాధ్యం కాదు. ’ అని స్పష్టం చేశారు.;

Update: 2026-04-12 05:17 GMT

అమెరికా , ఇరాన్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు ఎటువంటి ఫలితం లేకుండానే ముగియడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అహంకారపూరితమైన వ్యక్తిత్వం, పట్టువిడవని నైజం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏ కోశాన కూడా కలవలేరన్నట్లుగా.. నేడు అమెరికా, ఇరాన్ దేశాల అధినేతల వైఖరి తయారైంది. ఈ చర్చల వైఫల్యం కేవలం ఆ రెండు దేశాలకే కాదు.. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు.. శాంతి భద్రతలకు పెద్ద సవాలుగా మారింది.

చర్చలు ఎందుకు విఫలమయ్యాయి?

అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందం.. ఇరాన్ ప్రతినిధులతో ముఖాముఖి భేటీ అయ్యారు. అయితే చర్చల ప్రారంభం నుంచే ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు పొడసూపాయి. అమెరికా విధించిన కఠిన నిబంధనలను, ముఖ్యంగా అణు కార్యక్రమాలపై ఆంక్షలను ఇరాన్ తోసిపుచ్చింది. మరోవైపు గల్ఫ్ దేశాలపై ఇరాన్ చూపిస్తున్న ఆధిపత్యాన్ని ఉగ్రవాద మూలాలున్న సంస్థలకు ఇస్తున్న మద్దతును అమెరికా తీవ్రంగా వ్యతిరేకించింది.

జేడీ వాన్స్ మాట్లాడుతూ..

"ఇరాన్ వైఖరిలో ఎలాంటి సానుకూల మార్పు కనిపించడం లేదు. మా నిబంధనలకు వారు అంగీకరించనంత వరకు శాంతి సాధ్యం కాదు. ’ అని స్పష్టం చేశారు. దీనితో ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అమెరికా బృందం వెనుదిరిగింది. ఇది భవిష్యత్తులో మరింత తీవ్రమైన ఘర్షణలకు దారితీసే సూచనగా నిపుణులు భావిస్తున్నారు.

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న చమురు సంక్షోభం

ఇరాన్ కేవలం మాటలకే పరిమితం కాకుండా వ్యూహాత్మకంగా ప్రపంచానికి అతిపెద్ద షాక్ ఇచ్చింది. ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడం లేదా అక్కడ ఆంక్షలు విధించడం ద్వారా క్రూడ్ ఆయిల్ సరఫరాను అడ్డుకుంటోంది. దీని ప్రభావంతో

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనేక దేశాల్లో ఇంధన కొరత ఏర్పడి ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం పొంచి ఉంది. రవాణా వ్యయం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఇజ్రాయిల్ పాత్ర.. యుద్ధ మేఘాలు

ఈ వివాదంలో అమెరికాకు మిత్రదేశమైన ఇజ్రాయిల్ పాత్ర అత్యంత కీలకం. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ వంటి కఠిన నిర్ణయాలు తీసుకునే నేతల అండ ఉండటంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై , సైనిక స్థావరాలపై మరింత భారీ దాడులు జరిగే అవకాశం ఉంది.

మరోవైపు ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. గల్ఫ్ ప్రాంతంలోని కీలక దేశాలపై ఒత్తిడి పెంచుతూ తన వ్యూహాలకు పదును పెడుతోంది. ఉగ్రవాద మూలాలున్న శక్తులకు కాపలాగా ఉంటుందన్న విమర్శలు ఉన్నప్పటికీ, తన ఉనికిని కాపాడుకోవడానికి ఇరాన్ ఎంతటి సాహసానికైనా సిద్ధపడుతోంది.

యుద్ధం తప్పదా?

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే శాంతి చర్చలు విఫలం కావడం ఒక పెద్ద హెచ్చరిక. ఇరు దేశాలు తమ పంతాలను వీడకపోతే గల్ఫ్ ప్రాంతంలో మరో భారీ యుద్ధం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకవేళ యుద్ధం గనక మొదలైతే, అది కేవలం రెండు దేశాల మధ్యే కాకుండా గ్లోబల్ సంక్షోభంగా మారి ప్రపంచ శాంతిని చిన్నాభిన్నం చేస్తుంది. ప్రపంచ దేశాలు తక్షణమే జోక్యం చేసుకుని ఈ ఉద్రిక్తతలను తగ్గించకపోతే రాబోయే రోజులు మరింత భయంకరంగా ఉండే అవకాశం ఉంది.

Tags:    

Similar News