రెండేళ్ల పాప‌ను నిర్బంధించిన అమెరిక‌న్ ఇమిగ్రేష‌న్ అధికారులు

క్లోయిరెనెటా టిపాన్ కు రెండేళ్ల‌. త‌న ఎల్విసె జోయెల్ తో క‌లిసి అమెరికాలోని మినియాపోలిస్ లో నివ‌సిస్తోంది.;

Update: 2026-01-25 05:58 GMT

అమెరికాలోని ఇమిగ్రేష‌న్ అధికారుల తీరు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. అమెరికాలో అక్ర‌మంగా నివ‌సిస్తున్న విదేశీయుల‌పై ఇమిగ్రేష‌న్ అధికారులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు వివాదాస్ప‌దంగా మారుతోంది. ఇప్ప‌టికే వేలాది మంది భార‌తీయులను అమెరికా ఇమ్మిగ్రేష‌న్ అధికారులు నిర్బంధించారు. ఈ ఘ‌ట‌న‌లు మ‌ర‌వ‌క ముందే మ‌రో రెండు ఘ‌ట‌న‌లు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి. ఐదేళ్ల బాలుడిని ఇమ్మిగ్రేష‌న్ అధికారులు నిర్బంధించారు. ఆ త‌ర్వాత రెండేళ్ల పాప‌ను కూడా తండ్రితో స‌హా నిర్బంధించ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఎందుకు నిర్బంధించారు ?

క్లోయిరెనెటా టిపాన్ కు రెండేళ్ల‌. త‌న ఎల్విసె జోయెల్ తో క‌లిసి అమెరికాలోని మినియాపోలిస్ లో నివ‌సిస్తోంది. ఎల్విస్ జోయెల్ త‌న కూతురితో క‌లిసి కిరాణా దుకాణం నుంచి బ‌య‌టి వ‌స్తుండగా వారి కారును మ‌రో కారు వెంబ‌డించింది. ఇమిగ్రేష‌న్ అధికారులు ఎల్విస్ జోయెల్ కారును ఆపి.. కారు అద్దాలు ప‌గ‌ల‌గొట్టి వారిని అదుపులోకి తీసుకుని నిర్బంధించారు. తర్వాత వారిని టెక్సాస్ త‌ర‌లించిన‌ట్టు తెలుస్తోంది. ఆ త‌ర్వాత ఆ రెండేళ్ల చిన్నారి నిర్బంధం నుంచి బ‌య‌ట‌ప‌డింది. కానీ ఆమెను ఆ ఘ‌ట‌న తీవ్ర భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసిన‌ట్టు బాధితుల త‌ర‌పు న్యాయ‌వాది పేర్కొన్నారు. వీరు ఈక్వెడార్ కు చెందిన వారు. అమెరికాలో అక్ర‌మంగా నివ‌సిస్తున్నారు. అయితే.. కారు అద్దాలు ప‌గల‌గొట్ట‌డానికి కార‌ణం.. ఎల్విస్ జోయెల్ కారు అద్దాలు తెర‌వ‌డానికి నిరాక‌రించ‌డంతో ప‌గ‌ల‌గొట్టిన‌ట్టు అధికారులు తెలిపారు. క్లోయిరెనెటా టిపాన్ ను ఆమె తల్లికి అప్ప‌గించ‌డానికి ప్ర‌య‌త్నించ‌గా.. ఆమె బిడ్డ‌ను తీసుకోవ‌డానికి నిరాక‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఈక్వెడార్ కు చెందిన వారు అమెరికాలో అక్ర‌మంగా నివాసం ఉంటున్న‌ట్టు హోమ్ ల్యాండ్ విభాగం స్ప‌ష్టం చేసింది.

ఈక్వెడార్ నుంచి అమెరికాకు వ‌ల‌స‌లు ..

ఈక్వెడార్ దేశం నుంచి అమెరికాకు చాలా మంది వ‌ల‌స రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఆ దేశంలో ఉన్న‌టువంటి ఆర్థిక ప‌రిస్థితులు, రాజకీయ అస్థిర‌త‌, ఉపాధి అవ‌కాశాలు లేక‌పోవ‌డం, అమెరికాలో ఉన్న ఉపాధి అవ‌కాశాలు. 1960 వ‌ర‌కు కేవ‌లం కొంత మంది మాత్ర‌మే ఈక్వెడార్ నుంచి అమెరికాకు వ‌ల‌స వ‌చ్చారు. కానీ 1980 త‌ర్వాత ఆ సంఖ్య భారీగా పెరిగింది. వ‌ల‌స వ‌చ్చిన వారిలో కొంత మందికి మాత్ర‌మే అమెరికా నివాస అనుమ‌తి ఇవ్వ‌డంతో మిగిలిన వారు అక్ర‌మంగా ఉండాల్సి వ‌స్తోంది. 1930 నుంచి 1959 వ‌ర‌కు కేవ‌లం 11025 మంది ఈక్వెడార్ ప్ర‌జ‌లు శాశ్వ‌త నివాస అనుమ‌తి పొందారు. ఈక్వెడార్ ప్ర‌ధాన ఆదాయ వ‌న‌రు చ‌మురు. ప్ర‌ధానంగా 1980 త‌ర్వాత చ‌మురు సంక్షోభం కార‌ణంగా డిమాండ్ త‌గ్గ‌డంతో ఈక్వెడార్ ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. దీంతో పాటుగా వ‌ర‌ద‌లు, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌టం వంటి తీవ్ర వాతావ‌ర‌ణ మార్పులు ఈక్వెడార్ ప్ర‌జ‌లు అమెరికాకు వ‌ల‌స రావ‌డానికి కార‌ణ‌మైంది. అమెరికా అనుమ‌తించిన వారు ఇబ్బంది లేకుండా నివ‌సిస్తున్నారు. కానీ అనుమ‌తి లేని వారు త‌రుచూ నిర్బంధాల‌కు గుర‌వుతున్నారు. వారిని అమెరికా వెన‌క్కి పంపే ప్ర‌య‌త్నం చేస్తోంది.

Tags:    

Similar News