ట్రంప్ యూటర్న్ : గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు భారీ ఊరట

అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీ వలసదారులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.

Update: 2026-05-30 09:51 GMT

అమెరికాలో శాశ్వత నివాసం (గ్రీన్ కార్డ్) కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేలాది మంది విదేశీ వలసదారులకు, ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఇటీవల గ్రీన్ కార్డ్ నిబంధనలపై వ్యక్తమైన అంచనాలు, ఆందోళనల నేపథ్యంలో అమెరికా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు తమ ప్రక్రియను పూర్తి చేయడానికి స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. మునుపటిలాగే అమెరికాలో ఉంటూనే ఆ పనులను పూర్తి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం అమెరికాలోని లక్షలాది మంది వలసదారుల్లో నెలకొన్న అనిశ్చితికి తెరదించింది.

ఆందోళన రేకెత్తించిన పాత సంకేతాలు

గత వారం అమెరికా వలస విభాగం నుంచి వచ్చిన కొన్ని సంకేతాలు హెచ్-1బీ వీసాదారులలో తీవ్ర కలకలం రేపాయి. గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులు తమ ప్రక్రియ చివరి దశలో స్వదేశానికి వెళ్లి అక్కడి అమెరికా ఎంబసీల ద్వారానే ప్రక్రియను ముగించాల్సి ఉంటుందనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

ఒకవేళ ఇదే నిజమైతే దరఖాస్తు ప్రక్రియ మధ్యలో స్వదేశానికి వెళ్లడం వల్ల నెలల తరబడి అమెరికాకు దూరంగా ఉండటం వల్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల చదువులు, కుటుంబ జీవనం పూర్తిగా అస్తవ్యస్తమవుతాయి. ప్రయాణాలు, వీసా పునరుద్ధరణల చుట్టూ తిరగడం మానసిక, ఆర్థిక భారంగా మారుతుంది. ముఖ్యంగా భారత్ నుంచి వెళ్లిన ఐటీ ఉద్యోగులు ఈ సంకేతాలతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్ఎస్) స్పష్టత

ఈ వివాదంపై అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ (డీహెచ్ఎస్) తాజాగా రంగంలోకి దిగి అధికారిక వివరణ ఇచ్చింది. గ్రీన్ కార్డ్ దరఖాస్తుల పరిశీలన విధానంలో ఎలాంటి ఆకస్మిక లేదా పెద్ద మార్పులు చేయడం లేదని అధికారులు వెల్లడించారు. "ప్రతి గ్రీన్ కార్డ్ దరఖాస్తును చట్టపరంగా, వ్యక్తిగతంగా పరిశీలిస్తాం. అర్హులైన మెజారిటీ దరఖాస్తుదారులు అమెరికాలోనే ఉంటూ తమ శాశ్వత నివాస అనుమతి ప్రక్రియను పూర్తి చేసుకునే వెసులుబాటు యథాతథంగా కొనసాగుతుంది." అని అమెరికా వలస అధికారులు తాజాగా ప్రకటించారు.

ఊపిరి పీల్చుకున్న భారతీయ ఐటీ రంగం, కంపెనీలు

ట్రంప్ ప్రభుత్వ తాజా స్పష్టతతో అమెరికాలోని భారతీయ టెక్కీలు ఊపిరి పీల్చుకున్నారు. గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌లో అత్యధికంగా భారతీయులే ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం తన కఠిన వైఖరి నుంచి యూ-టర్న్ తీసుకోవడం వలసదారులకే కాకుండా అమెరికన్ కార్పొరేట్ కంపెనీలకు కూడా పెద్ద ఉపశమనం కలిగించింది. ఒకవేళ ఉద్యోగులు స్వదేశాలకు వెళ్లాల్సి వస్తే ప్రాజెక్టులు నిలిచిపోతాయని భయపడిన కంపెనీలు, ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

ప్రస్తుతానికి గ్రీన్ కార్డ్ ప్రక్రియపై నెలకొన్న గందరగోళం తొలగిపోయినప్పటికీ ట్రంప్ ప్రభుత్వ రాబోయే వలస విధానాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. భవిష్యత్తులో అమెరికా వీసా, వలస నిబంధనలలో ఎలాంటి మార్పులు రానున్నాయోనని నిపుణులు నిశితంగా గమనిస్తున్నారు.

Tags:    

Similar News