5,000 అడుగుల ఎత్తులో ఉండగా 'మేడే' కాల్... ఏం జరిగింది?
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి మేడే కాల్ వచ్చిన సంగతి తెలిసిందే;
అహ్మదాబాద్ లో జరిగిన ఎయిరిండియా ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి మేడే కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం ఏటీసీతో కమ్యునికేషన్ కట్ అయ్యింది.. విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సమయంలో తాజాగా అమెరికాలోని విమానం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే మేడే కాల్ వచ్చిన వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అవును... జూలై 25 శుక్రవారం యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం వాషింగ్టన్ లోని డల్లాస్ ఎయిర్ పోర్ట్ నుంచి మ్యూనిచ్ కు బయలుదేరింది. ఈ సమయంలో ఆ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఎడమ ఇంజిన్ ఫెయిలైనప్పుడు గాల్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. ఈ సమయంలో పైలెట్ల నుంచి ఏటీసీకి మేడే కాల్ వెళ్లింది.
దీంతో అప్రమత్తమైన ఏటీసీ సిబ్బంది, పైలెట్లతో కలిసి సురక్షితమైన అత్యవసర ల్యాండింగ్ ను నిర్ధారించారు. ఆ సమయంలో విమానం సుమారు 5,000 అడుగుల ఎత్తులో ఉంది. సరిగ్గా ఆ సమయంలో ఇంజిన్ పనిచేయకపోవడంతో.. విమానం 2 గంటల 38 నిమిషాలు గాలిలో ఉండి వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయానికి తిరిగి వచ్చిందని ఫ్లైట్ అవర్ డేటా వెల్లడించింది.
ఈ సమయంలో విమానం బరువును మెయింటైన్ చేయడానికి పైలట్లు 6,000 అడుగుల వద్ద ఉండాలని అభ్యర్థించారు. ఈ క్రమంలో... విమానాన్ని ఇతర విమానాల నుండి దూరంగా ఉంచడానికి, సురక్షితమైన ఇంధన డంపింగ్ కు అనుమతించడానికి వారికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల నుంచి వివిధ సూచనలు అందాయని ఏవియేషన్ ఏ2జెడ్ నివేదిక తెలిపింది!
ఇక.. ఇంధనం డంప్ పూర్తయిన తర్వాత.. పైలట్లు రన్ వే 19 సెంటర్ లో ఇనిస్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ (ఐ.ఎల్.ఎస్) విధానాన్ని ఉపయోగించి ల్యాండ్ చేయడానికి అనుమతి కోరారు. అలా సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత ఇంజిన్ వైఫల్యం కారణంగా విమానం స్వయంగా ముందుకు కదలలేకపోయిందని.. ఆ సమయంలో రన్ వే నుంచి లాగవలసి వచ్చిందని చెబుతున్నారు.
అయితే... అదృష్టవశాతు ఈ సంఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని నివేదికలు తెలిపాయి. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సంఘటన అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంతో సారూప్యతను కలిగి ఉందని అంటున్నారు.