ఆర్థిక సర్వే పొగిడింది...బడ్జెట్ ఏమిస్తుంది ?

ఈ ఆర్థిక సర్వే ఆ ఏడాది దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితి, వివిధ రాష్ట్రాలలో పురోగతి ఆర్ధికంగా ఎవరేమిటి ఎక్కడ అన్నది పార్లమెంట్ ముందు ఉంచుతుంది.;

Update: 2026-01-30 23:30 GMT

కేంద్ర బడ్జెట్ కి ముందు ఆర్ధిక సర్వేను ప్రవేశపెట్టడం ఒక అనవాయితీగా వస్తోంది. ఈ ఆర్థిక సర్వే ఆ ఏడాది దేశంలో ఉన్న వాస్తవ పరిస్థితి, వివిధ రాష్ట్రాలలో పురోగతి ఆర్ధికంగా ఎవరేమిటి ఎక్కడ అన్నది పార్లమెంట్ ముందు ఉంచుతుంది. ఈసారి ఆర్ధిక సర్వే ప్రత్యేకత ఏమిటి అంటే రెండు తెలుగు రాష్ట్రాలను తెగ పొగిడింది. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధిలో దూసుకుని పోతున్న టాప్ టెన్ సిటీస్ లో ఏపీ నుంచి విజయవాడ తిరుపతిలకు చోటు దక్కింది. అలాగే హైదరాబాద్ ఎపుడూ టాప్ ఫైవ్ లో ఉంటుంది. ఇక ద్రవ్యోల్బనం బాగా తగ్గిందని రెండు రాష్ట్రాలలో ఆర్ధిక పరిస్థితులు బాగా ఉన్నాయని సర్వేలో మెచ్చుకోలు మాటలు వినిపించాయి.

కట్ చేస్తే :

ఇక ఇపుడు చూస్తే ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంత వాటా దక్కుతుంది అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు విభజన తరువాత చాలా హామీల అమలుకు నోచుకోలేదు, విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఏవీ దక్కడం లేదు, ఇక ఏపీ పరిస్థితి చూస్తే ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు కానీ అది 2014 నుంచి 2019 మధ్యన ముగిసిన అధ్యాయం అయిపోయింది. దాంతో పాటు పోలవరం జాతీయ ప్రాజెక్ట్ గా తీసుకున్న కూడా పుష్కర కాలం ముగిసింది కానీ ఇంకా పూర్తి అయితే కాలేదు, ఢిల్లీని తలదన్నే రాజధానిని ఏపీకి నిర్మిస్తామని కేంద్రం చెప్పింది కానీ అమరావతికి అప్పులు మాత్రం ఇప్పిస్తున్నారు, గత బడ్జెట్ లో అదే జరిగింది. ఈసారి ఏమిస్తారు అన్న చర్చ అయితే సాగుతోంది.

కునారిల్లిన ఏపీ :

ఏపీ అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఎందుకంటే ఏపీ వ్యవసాయిక రాష్ట్రం. పారిశ్రామికంగా ఇంకా చాలా ముందుకు సాగాల్సి ఉంది. అలాగే సేవా రంగం నుంచి కూడా పెద్దగా నిధులు సమకూరవు. ఈ నేపధ్యంలో కేంద్రం నుంచి భారీ సాయం ఏపీకి అందడం అవసరం అని అంటున్నారు. అయితే ఏపీలో మహా నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని దీని వల్ల పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు ఉత్పత్తి అవుతాయని దాంతో అన్ని విధాలుగా అభివృద్ధి సాగుతుందని ఆర్ధిక సర్వే చెబుతోంది. ఇది నిజమే కావచ్చు కానీ ఇప్పటికిపుడు అయితే కాదు, అలాగే ఏపీ పారిశ్రామికంగా ప్రగతి పధంలో ఉంది అంటే ఇంకా అడుగులు వేగంగా పడాల్సి ఉంది. ఈ క్రమంలో కేంద్రం ఇచ్చే సాయం అలాగే కేంద్ర బడ్జెట్ లో నిధుల వాటా మీదనే ఏపీ కోటి ఆశలు పెట్టుకుంది అన్నది వాస్తవం.

బీజేపీ ఫోకస్ :

ఇక చూస్తే బీజేపీ బడ్జెట్ లో ఎపుడూ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ప్రాధాన్యతా క్రమంలో ఉంటాయని అంటున్నారు. అంతే కాకుండా బీజేపీ పాలిత రాష్ట్రాలకు పెద్ద పీట వేస్తారు అని ఇప్పటికి పూర్తి అయిన 13 బడ్జెట్లు నిరూపించాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో చూస్తే బీజేపీ ఏపీలో కూటమిలో జూనియర్ పార్టనర్ గా ఉంది, తెలంగాణాలో ప్రతిపక్షంలో ఉంది. దాంతో బీజేపీ ఫోకస్ తెలుగు రాష్ట్రాల మీద ఏ మేరకు ఉంటుంది అన్నది ఒక పెద్ద చర్చ. నిధులు గ్రాంట్లు అన్నీ తమ సొంత రాష్ట్రాలకు ఇస్తున్నారు అని ప్రతిపక్ష రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. అంతే కాదు, బీజేపీ ఎక్కడ దయ చూపిస్తోంది అంటే అప్పులు తెచ్చుకోవడానికి వెసులుబాటు కల్పించే విషయంలో అని అంటున్నారు దీని వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు నష్టపోతాయని అంటున్నారు. అందువల్ల స్పెషల్ గ్రాంట్లు, అలాగే భారీగా నిధులు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. ఏపీ విషయం చూస్తే కేంద్ర బడ్జెట్ మీద ఎంతో ఆశ పెట్టుకుంది అన్నది వాస్తవం. ఆ బడ్జెట్ లో కేటాయింపులు చూసి మధింపు చేసుకుంటూ ఏపీ బడ్జెట్ ని రూపొందిస్తారు. సో ఇపుడు అందరి చూపూ కేంద్ర బడ్జెట్ మీద ఉంది. అర్ధిక సర్వేలో పొగడ్తలే మిగులుతాయా లేక అసలు బడ్జెట్ లో కేటాయింపులు భారీగా ఉంటాయా అన్నది ఫిబ్రవరి 1వ తేదీతో తేలిపోతుంది అని అంటున్నారు.

Tags:    

Similar News