ముద్రగడ రెండో వైపు చూస్తున్నారా ?

ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడు. బాగా పట్టు ఉన్న ఒక సామాజిక వర్గానికి ఆయన చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు.;

Update: 2026-01-31 00:30 GMT

ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లాలో ప్రముఖ రాజకీయ నాయకుడు. బాగా పట్టు ఉన్న ఒక సామాజిక వర్గానికి ఆయన చాలా కాలం పాటు ప్రాతినిధ్యం వహించారు. అంతే కాదు వారి కోసం అతి పెద్ద ఉద్యమం చేశారు. ఈ క్రమంలో తన రాజకీయ జీవితంలో ముఖ్యమైన కాలాన్ని అంతా ఖర్చు చేశారు. నిజంగా ముద్రగడ చేసిన ఈ త్యాగం మెచ్చ తగినది. దానికి తగిన ప్రతిఫలం అయితే ఆయనకు దక్కలేదు. ఇక చూస్తే ఇపుడు గోదావరి జిల్లాలలో కాపులకు మరో బలమైన నేతగా ఆరాధ్య నాయకుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. పవన్ వైపు నుంచి చూస్తే ఆయన అందరి వాడుగా ఉంటున్నారు. కానీ ఆ సామాజిక వర్గం ఆయనను సొంతం చేసుకుంది.

మారిన రాజకీయం :

ముద్రగడ కూడా ఏడు పదుల వయసులో ఉన్నారు. దాంతో ఆయన మార్క్ రాజకీయం దూకుడుకు కాలం చెల్లిందా అన్న చర్చ కూడా ఉంది. ఎందుకంటే కొత్త తరం అన్ని వైపుల నుంచి వచ్చేసింది. ముద్రగడ కూడా రాజకీయంగా కొన్ని రాంగ్ స్టెప్స్ వేశారని విమర్శలు ఉన్నాయి. ఏటికి ఎదురీదారని దాంతోనే ఆయన 2024 ఎన్నికలో వైఫల్యం మూటకట్టుకున్నారని అంటున్న వారూ ఉన్నారు. ఆ సమయంలో కూటమి ప్రభంజనం ఉంది. అదే విధంగా జనసేన ప్రభావం గోదావరి జిల్లాలను కమ్మేసింది. పవన్ కళ్యాణ్ ని ఆరాధిస్తున్న బలమైన సామాజిక వర్గం ఒక వైపు ఉంటే ఆయన్ని ఓడిస్తాను అని వైసీపీలో చేరి ముద్రగడ పెద్ద తప్పు చేశారు అని ఆ సామాజిక వర్గానికి చెందిన వారు అభిప్రాయపడుతూ ఉంటారు.

తాజా భేటీతో :

ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం తాజాగా తమ జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వకమైన భేటీగానే బయటకు వచ్చింది. అయితే ఇక్కడే అనేక రకమైన కధలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందులో వాస్తవాలు ఏమి ఉన్నాయన్నది పక్కన పెడితే ఇవి ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పాలి. ముద్రగడ తిరిగి కూటమి వైపు చూస్తున్నారు అని అందులో భాగంగానే ఆయన చిన రాజప్పతో పెద్ద మీటింగ్ పెట్టారని కూడా పుకార్లుగా షికార్లు గోదావరి తీరమంతా చేస్తూ వస్తున్నారు.

కుమారుడు కోసమేనా :

ముద్రగడ రాజకీయంగా చూడాల్సింది చూసేశారు. ఆయన గత ఏడాది తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఒక విధంగా ఆయన ప్రత్యక్ష రాజకీయాలను గతంలో మాదిరిగా చేసే విధంగా లేరని అంటారు. అయితే ముద్రగడ ఆలోచనలు అన్నీ కూడా తన కుమారుడు గిరి కోసమే అని అంటున్నారు. ఆయనకు రాజకీయంగా భవిష్యత్తు చూపించాలని ఆయన ఆరాటపడుతున్నారని ప్రచారం అయితే సాగుతోంది. వైసీపీలో ప్రత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గానికి వైసీపీ ఇంచార్జిగా గిరిని నియమించారు. ఇక ఈ సీటు ముద్రగడ సొంత సీటు. ఆయన తండ్రి ముద్రగడ వీర రాఘవరావు రెండు సార్లు ఇండిపెండెంట్ గా గెలిచారు. ముద్రగడ ఇదే సీటు నుంచి నాలుగు సార్లు వరుసగా గెలిచారు. ఆ సీటు నుంచి 2029 లో గిరిని పోటీ చేయించి ఎమ్మెల్యేగా చూసుకోవాలని ఆయన కోరుకుంటున్నారని అంటున్నారు.

అందుకోసమేనా :

వైసీపీ నుంచి పోటీ చేస్తే విజయావకాశాలు ఏ విధంగా ఉంటాయో అన్నది కూడా ఉంది అని అంటున్నారు. ఎందుకంటే గోదావరి జిల్లాల రాజకీయం ఇప్పటికీ జనసేన టీడీపీ కూటమికి కట్టుబడిపోయింది. ఏ మాత్రం మార్పు అయితే అక్కడ రావడం లేదు, దాంతో కూటమి వైపుగా కుమారుడిని పంపించాలని ముద్రగడ ఆలోచిస్తున్నారా అన్న ప్రచారం అయితే సాగుతోంది. మరి ఈ పుకార్లలో నిజాలు ఏ మేరకు ఉన్నాయో చూడాలి.

Tags:    

Similar News