కాలుష్య విశాఖ...పవన్ మార్క్ ట్రీట్మెంట్
విశాఖ ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణంతో సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు గడించింది.;
విశాఖ ఒకప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉండేది. ఆహ్లాదకరమైన వాతావరణంతో సిటీ ఆఫ్ డెస్టినీ గా పేరు గడించింది. అయితే రాను రానూ అభివృద్ధితో పాటుగా కాలుష్యం కూడా విశాఖకు ప్రాప్తించింది. ప్రగతి వరం అనుకుంటే వెనువెంటనే వచ్చే కాలుష్యం శాపంగా మారుతోంది. దీని మీద ప్రభుత్వాలు ఫోకస్ పెట్టాలని మేధావులు ప్రజా సంఘాల నుంచి ఎన్నో వినతులు వస్తున్నాయి. ఇదిలా ఉంటే పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ విశాఖ కాలుష్యం మీద కూడా పూర్తి స్థాయి సమీక్షలు చేస్తూ వస్తున్నారు. తాజాగా విశాఖ పర్యటనలో ఆయన కాలుష్యం గురించి సీరియస్ యాక్షన్ ఉండాల్సిందే అని అధికారులకు సూచించడం విశేషం.
అమలు చేయాల్సిందే :
నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందే అని ఆయన అధికారులకు సూచించారు. అందరూ కలిసి తలచుకుంటే కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించవచ్చునని చెప్పారు. ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన కరారు ఇక పరిశ్రమలు కాలుష్య నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని కోరారు. చాలా కాలంగా చూస్తే ఉత్తరాంధ్రలో అభివృద్ధితోపాటు కాలుష్యం పెరిగిపోయిందని పవన్ వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో పరిశ్రమలలో 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని పవన్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గాలిలో నాణ్యత తగ్గుతోంది :
విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాలలో గాలిలో నాణ్యత బాగా తగ్గుతోందని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి చెందిందో అంతే వేగంగా కాలుష్యం ఎగబాకుతోందని అన్నారు. రసాయన పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం కారణంగా ఆయా ప్రభావిత గ్రామాలలో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ బారిన పడిన దుస్థితి ఉందని ఆయన అన్నారు. ఇక చిన్నారులలో అయితే చర్మ వ్యాధులు మహిళల్లో గర్భస్రావాలు, ఊపిరితిత్తుల వ్యాధులు సర్వసాధారణం అయిపోయాయని అన్నారు. ఇక విశాఖ పోర్టు కాలుష్యం కూడా పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్యంపై దాడి చేస్తోందని పవన్ ఎత్తి చూపారు. . పోర్టు పరిసరాల్లో బొగ్గు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆయన ఆవేదన చెందారు.
సమతూకం ఉండాలి :
పరిశ్రమలు రావాలి, అభివృద్ధి చెందాలి, అదే సమయంలో అవి ప్రాణాలను హైరంచేలా కాలుష్యాన్ని పెంచకూడదని పవన్ స్పష్టంగా చెప్పారు. పరిశ్రమలు నిబంధనలు పాటించవన్న భావన ఉందని ఆయన విమర్శించారు. అది మారాల్సిన అవసరం అయితే ఉందని అన్నారు. అన్ని రకాల కాలుష్యాలకు ఉత్తరాంధ్రను డంపింగ్ ప్రాంతం చేశారని ఆ ప్రాంత ప్రజలు వాపోతూ ఉంటారని పవన్ చెప్పారు. పరిశ్రమల యాజమాన్యాలు సాటి మనుషుల పట్ల కనీస బాధ్యతతో స్పందించాల్సిన అవసరం ఉందని అన్నారు. పర్యావరణ అధికారులు కూడా చట్టాలు కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. మొక్కుబడిగా తూతూ మంత్రం చర్యలు కాకుండా జీవ వైవిధ్యాన్ని పెంపొందించేలా చర్యలు ఉండాలని ఆయన చెప్పారు.
పరిష్కారం కోసం :
ఇక ఏపీలోని తొమ్మిది కోస్తా జిల్లాల పరిధిలో 970 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉందని, తీరం మొత్తం అయిదు కిలోమీటర్ల వెడల్పున, మూడు బఫర్ జోన్లుగా విడగొట్టి మొక్కలతో గోడ నిర్మించేందుకు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును తీసుకువచ్చామని పవన్ చెప్పారు. ఈ బృహత్తర ప్రణాళికలో పారిశ్రామికవేత్తలు అంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. గ్రేట్ గ్రీన్ వాల్ తీర ప్రాంతానికి రక్షణ కల్పిస్తుందని ఇదే కాలుష్యానికి సరైన జవాబుగా ఉంటుందని ఆయన అన్నారు.