జనసేనకు అన్యాయం.. కేడర్ ఆలోచన ఇదేనా?

కూటమిలో జరిగిన ఒప్పందం ప్రకారం నియోజకవర్గాల్లో భర్తీ చేసే అన్నిరకాల పదవుల్లో 30 శాతం జనసేన కేడర్ కు దక్కాల్సివుంటుందని అంటున్నారు.;

Update: 2026-01-30 17:30 GMT

కూటమిలో సమన్వయం కోసం అగ్రనేతలు ఎంతలా తాపత్రయపడుతున్నా.. అసంతృప్త స్వరాలు అక్కడక్కడ వినిపిస్తూనే ఉన్నాయి. ప్రధానంగా కూటమికి వెన్నుదన్నులా నిలుస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తీవ్ర అసహనంతో ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. కూటమిలో పదవుల పంపకం విషయంలో తమ పార్టీకి అన్యాయం జరుగుతోందని, ఈ విషయమై తనకు రోజూ ఫోన్లు వస్తున్నాయని జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా ప్రకటించారు. విశాఖ నగరంలోని ఒక నాలుగు ఆలయ కమిటీలకు సంబంధించిన అంశంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేసినా, వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ పదేపదే చెబుతున్నారు. ఈ ముగ్గురు ప్రధాన నేతలు ఏ ప్రధాన సమావేశానికి వెళ్లినా తమ పార్టీ కార్యకర్తలకు ఈ విషయంపై స్పష్టమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. కూటమిలో విడాకులు, క్రాస్ ఫైర్లు ఉండవని, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మరో పదిహేనేళ్లు కలిసి ప్రయాణిస్తామని అగ్రనేతలు ముగ్గురు కుండబద్దలు కొట్టేలా చెబుతున్నారు. అదే సమయంలో చిన్నచిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోవడాలని, పరిష్కారం కాని వాటిని తమ దృష్టికి తీసుకురావాలని చెబుతున్నారు.

అగ్రనేతలు ఇలా ఓపెన్ గా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో నిరసన స్వరాలు మాత్రం ఆగడం లేదు. కూటమిలో 60-30-10 నిష్పత్తిలో పదవులను పంచుకోవాలని గతంలో తీర్మానించుకున్నారు. రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ విషయంలో ఈ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో అంటే గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేసే పదవుల్లో మాత్రం ఈ పద్ధతిని పాటించడం లేదని జనసేన వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంలో బీజేపీ నుంచి పెద్దగా విమర్శలు లేకపోయినా, గ్రామస్థాయిలో టీడీపీకి సమానంగా పదవులు ఆశిస్తున్న జనసేన కేడర్ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.

కూటమిలో జరిగిన ఒప్పందం ప్రకారం నియోజకవర్గాల్లో భర్తీ చేసే అన్నిరకాల పదవుల్లో 30 శాతం జనసేన కేడర్ కు దక్కాల్సివుంటుందని అంటున్నారు. అయితే జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చెప్పిన ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా ఈ విధానం అమలు కావడం లేదనే అంటున్నారు. దీనికి తాజాగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో భర్తీ చేసిన పదవులను ఉదాహరణగా చూపుతున్నారు. ఇక్కడ 5 దేవాలయాలకు ఒకేసారి ట్రస్టు బోర్డులు నియమించగా, జనసేనకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని ఆ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

జనసేన బలంగా ఉన్న విశాఖ నగరంలోనే పరిస్థితి ఇలా ఉందంటే, రాష్ట్రంలో మిగిలిన నియోజకవర్గాల్లో ఇంకెలా పదవులు భర్తీ చేస్తున్నారో అర్థమవుతోందని జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పొరపాట్లు అన్నిచోట్లా జరుగుతున్నాయని బొలిశెట్టి మీడియా ముఖంగా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను వెలుగులోకి తెస్తోంది. అయితే ఈ విషయంలో టీడీపీ, జనసేన అగ్రనాయకత్వాలే కల్పించుకోవాల్సివుందని అంటున్నారు. లోపం ఎక్కడ ఉందో గుర్తించకుండా, కార్యకర్తలను బుజ్జగించడం వల్ల ప్రయోజనం ఉండదని హెచ్చరిస్తున్నారు. పరిస్థితి చక్కదిద్దకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ జనసేనకు నష్టం జరుగుతుందని ఆ పార్టీ కేడర్ ఆవేదన చెందుతోంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ జోక్యం చేసుకోవాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Tags:    

Similar News