షర్మిలకు నో ఛాన్స్!! కాంగ్రెస్ హ్యాండిచ్చినట్టేనా?

వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, షర్మిలకు రాజ్యసభ స్థానం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.;

Update: 2026-01-30 10:52 GMT

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ హ్యాండిస్తుందనే ఊహాగానాలు వినిస్తున్నాయి. గతంలో హామీ ఇచ్చిన విధంగా షర్మిలకు రాజ్యసభ స్థానం కల్పించే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. పార్టీలో సీనియర్ల మధ్య తీవ్ర పోటీ ఉండటం, ఏపీలో అనుకున్న స్థాయిలో షర్మిల పనితీరు లేకపోవడం వల్ల రాజ్యసభ పదవిపై హస్తం పార్టీ నేతలు పునరాలోచనలో పడ్డారని అంటున్నారు. ఇదే సమయంలో షర్మిలకు పదవి రాకుండా తెలంగాణకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.

షర్మిలకు రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశం లేదన్న ప్రచారం రెండు తెలుగు రాష్ట్రాల్లో హీట్ పుట్టిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ అభిమానులతోపాటు ఓ ప్రధాన సామాజికవర్గంలో ఈ చర్చ ఎక్కువగా జరుగుతోంది. షర్మిలకు రాజ్యసభకు పంపుతామన్న హామీతో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో షర్మిలను ఇక్కడకు షిప్ట్ చేసి పీసీసీ పగ్గాలు అప్పగించారు.

ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన షర్మిల రాష్ట్రంలో హస్తం పార్టీ గళాన్ని బలంగా వినిపించారు. రాష్ట్రంలో కనీస ఉనికి లేని పార్టీలో చలనం తీసుకువచ్చారని అంటున్నారు. అంతేకాకుండా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంటుకు పోటీ చేసి అప్పటి అధికార పక్షం వైసీపీని ముచ్చెమటలు పట్టించారు. ఇక ఎన్నికల తర్వాత కూడా వైసీపీని టార్గెట్ చేస్తూ పనిచేస్తున్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ కేడర్ అంతా వైసీపీలో చేరిపోవడంతో వారిని వెనక్కి రప్పించేలా షర్మిల విఫలయత్నం చేస్తూనే వస్తున్నారు.

ఈ క్రమంలో షర్మిలకు రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. దేశంలో కాంగ్రెస్ ప్రస్తుతం 3 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉండగా, త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఆ పార్టీ ఏడు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇందులో ఒక స్థానాన్ని షర్మిల ఆశిస్తున్నారని చెబుతున్నారు. కర్ణాటకలో 4, తెలంగాణలో 2, హిమాచల్ ప్రదేశ్ లో ఒక స్థానం కాంగ్రెస్ గెలుచుకునే వీలుందని అంటున్నారు. అయితే ఈ ఏడు స్థానాలకు పార్టీలో పలువురు సీనియర్లు పోటీ పడుతుండటంతో షర్మిల పేరు సైడ్ అయినట్లేనన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది.

వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, షర్మిలకు రాజ్యసభ స్థానం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే 2024 మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చినా, షర్మిల పేరును పరిశీలనలోకి తీసుకోలేదని చెబుతున్నారు. ఆ సమయంలో తెలంగాణ నుంచి సీనియర్ నేత రేణుకాచౌదరితోపాటు యువనేత అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపారు. ఇక త్వరలో జరిగే ఎన్నికపై షర్మిల ఆశ పెట్టుకున్నా, తెలంగాణకు చెందిన సీనియర్లు ఎక్కువగా రేసులో ఉండటం, ఏపీ నేపథ్యం వల్ల షర్మిల పేరు వెనక్కి వెళ్లిందని అంటున్నారు.

ఇక కర్ణాటక కోటాలో అయినా షర్మిల పేరు పరిశీలిస్తారంటే ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదని అంటున్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గాల మధ్య నెలకొన్ని గ్రూప్ వార్ కారణంగా అక్కడి నేతలకు పదవులు సర్దుబాటు చేయడమే పార్టీకి కత్తిమీద సాములా తయారైందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పక్క రాష్ట్రం వారికి అవకాశం ఇవ్వడం సాధ్యం కాదని కన్నడ నేతలు ఏఐసీసీకి సమాచారం పంపినట్లు చెబుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో షర్మిల కుటుంబానికి సాన్నిహిత్యం ఉందని చెబుతున్నారు. వైఎస్ కుమార్తెగా షర్మిలకు పదవి ఇచ్చే విషయంలో డీకేకు అభ్యంతరం లేకపోయినా ప్రస్తుత పరిస్థితుల్లో తన వర్గాన్ని కాపాడుకోవడానికి షర్మిలకు మద్దతు ఇచ్చే విషయంలో డీకే వెనక్కి తగ్గుతున్నారని అంటున్నారు.

మొత్తానికి కర్ణుడి చావుకి శవాలక్ష కారణాలు అన్నట్లు ఏపీసీసీ చీఫ్ షర్మిలకు రాజ్యసభ సభ్యత్వం దక్కడానికి అనేక అవాంతరాలు అడ్డుగా నిలుస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పదవి సాధించడానికి షర్మిల ఎలాంటి వ్యూహం అనుసరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కేవలం పార్టీ అధిష్టానం ఇచ్చిన మాటపై నిలబడాలని ఎదురుచూస్తారా? లేక తనకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సిందేనంటూ అధిష్టానంపై ఒత్తిడి తీసుకువచ్చేలా పనిచేస్తారా? అన్నది చూడాల్సివుందని అంటున్నారు.

Tags:    

Similar News