అసెంబ్లీకి జనసేన పక్కా ప్లాన్.. మోత మోగిపోవడం ఖాయమా?

గురువారం విశాఖ పర్యటనకు వెళ్లిన జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ వర్చువల్ గా జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించారు.;

Update: 2026-01-30 10:45 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు వచ్చేనెల 11న ప్రారంభం కాబోతున్నాయి. 14న బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మొత్తం ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలి? ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి అనే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ సమావేశాలకు ప్రతిపక్షం వైసీపీ హాజరు అవుతుందా? లేక యథావిధిగా డుమ్మా కొడుతుందా? అనేది చర్చకు తావిస్తోంది. మరోవైపు ప్రతిపక్షం వచ్చినా రాకపోయినా అధికారపక్షం మాత్రం అసెంబ్లీ సమావేశాలపై తీవ్ర కసరత్తే చేస్తోంది. ప్రధానంగా జనసేన ఈ విషయంలో ఒక అడుగు ముందునే ఉందని అంటున్నారు. గురువారం విశాఖ పర్యటనకు వెళ్లిన జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ వర్చువల్ గా జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సుదీర్ఘంగా చర్చించి అసెంబ్లీ అజెండాపై నిర్ణయం తీసుకున్నారు.

వచ్చేనెల ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సమావేశాలకు జనసేన పక్కా వ్యూహంతో సిద్ధమవుతోంది. ప్రధానంగా జనసేనాని పవన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీ చేస్తున్న విమర్శలను అసెంబ్లీ వేదికగా తిప్పికొట్టే స్కెచ్ వేస్తోందని అంటున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై సీబీఐ సిట్ ఫైనల్ చార్జిషీటును నెల్లూరు ఏసీబీ కోర్టులో సమర్పించింది. అయితే ఈ విషయంలో జనసేనాని పవన్ ను కార్నర్ చేస్తూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోందని చెబుతున్నారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని గతంలో పవన్ విమర్శలు చేశారని, ప్రాయశ్చిత్య దీక్షలు చేశారని, కానీ సిట్ దర్యాప్తులో జంతువుల కొవ్వు కలిసిన ఆనవాళ్లపై ఎలాంటి ప్రస్తావన లేదని వైసీపీ ఎత్తిచూపుతోంది. ఈ విషయంలో పవన్ హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేస్తోంది వైసీపీ.

అయితే వైసీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని అసెంబ్లీ వేదికగానే తిప్పికొట్టాలని జనసేన ఎల్పీ సమావేశంలో నేతలు తీర్మానించారు. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వైసీపీ హయాంలో సాగించిన అరాచకాలు, కల్తీ నెయ్యి సరఫరా గురించి ప్రజలకు తెలియజెప్పాలని జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిప్రాయపడ్డారు. చుక్క పాలు వాడకుండా, రసాయనాలతో నెయ్యిని తయారు చేయడం దుర్మార్గమని, ఇది భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని జనసేన శాసనసభాపక్షం అంటోంది. దీంతో అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్నే పార్టీ తరఫున హైలెట్ చేయాలని నిర్ణయించారు. కేవలం అసెంబ్లీలోనే కాకుండా కల్తీ నెయ్యిపై మీడియా, సోషల్ మీడియాలో సైతం పార్టీ తరఫున ప్రజలకు వాస్తవాలు వివరించాలని జనసేన ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు సూచించారు.

ఇక ఈ సందర్భంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అంశంపైనా జనసేన శాసనసభాపక్షం చర్చించినట్లు చెబుతున్నారు. ఆరోపణలు వచ్చిన వెంటనే త్రిసభ్య కమిటీ వేసి నిజనిజాలు విచారించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, దీనిద్వారా పార్టీ ఎంత నిబద్ధతతో ఉంటుందో అధినేత పవన్ అందరికీ తెలియజేశారని శాసనసభాపక్షం కొనియాడినట్లు చెబుతున్నారు. కాగా, బడ్జెట్ సమావేశాలకు ముందు మరోసారి సమావేశమై పార్టీ వ్యూహంపై చర్చించాలని నేతలు నిర్ణయం తీసుకున్నారు. జనసేన ముందస్తు ఏర్పాట్లు చూస్తుంటే ఈ సారి అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీని గట్టిగా టార్గెట్ చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయని అంటున్నారు.

గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ విషయంలో అధికార, విపక్షాలు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నారు. దీంతో భక్తులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని అంటున్నారు. లడ్డూ ప్రసాదం కల్తీపై సుప్రీం ఆదేశాలతో దర్యాప్తు జరిపిన సిట్ కోర్టులో చార్జిషీటు దాఖలు చేసింది. అయితే ఈ నివేదిక అధికారికంగా ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతానికి నెయ్యి సరఫరా చేసిన భోలేబాబా డెయిరీ నిర్వాహకులు తిరుమలకు రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని సరఫరా చేశారని సిట్ గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపైనా మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విపక్షం వైసీపీ ఆలోచనగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మరో పది రోజుల్లో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు తీవ్ర దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News