వాణిజ్య నౌకల ముప్పు .. ఎర్ర సముద్రంలో కేబుళ్ల భద్రతపై ప్రశ్నలు

ప్రపంచ కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు వెన్నెముకలుగా ఉన్న సముద్రగర్భ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు మరోసారి ప్రమాదంలో పడ్డాయి.;

Update: 2025-09-09 09:45 GMT

ప్రపంచ కమ్యూనికేషన్‌ వ్యవస్థలకు వెన్నెముకలుగా ఉన్న సముద్రగర్భ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుళ్లు మరోసారి ప్రమాదంలో పడ్డాయి. ఇటీవల ఎర్ర సముద్రంలో కేబుళ్లు తెగిపోవడం వల్ల భారత్‌, పాకిస్థాన్‌తో పాటు ఆసియా, ఆఫ్రికా ప్రాంతాల్లోని పలు దేశాలు ఇంటర్నెట్‌ అంతరాయాన్ని ఎదుర్కొన్నాయి. ఈ ఘటన మరోసారి గ్లోబల్‌ డేటా మౌలిక సదుపాయాల సున్నితత్వాన్ని బహితర్గతం చేసింది.

వాణిజ్య నౌకలే కారణమా?

సౌదీ అరేబియాలోని జెడ్డా తీరానికి సమీపంలో జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న అంతర్జాతీయ కేబుల్‌ ప్రొటెక్షన్‌ కమిటీ నిపుణులు ప్రాథమికంగా వాణిజ్య నౌకల రాకపోకలే కారణమని చెబుతున్నారు. నౌకలు లంగర్‌లు (anchors) వదులుతుండగా అవి సముద్రతలంలో ఉన్న కేబుళ్లను దెబ్బతీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణుల వాదన. ఏటా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుండడం గమనార్హం.

వ్యూహాత్మకంగా అత్యంత కీలక ప్రాంతం

ఎర్ర సముద్రం దక్షిణ భాగంలో ఉన్న బాబ్‌ అల్‌ మందేబ్‌ జలసంధి గుండా 15 ప్రధాన ఆప్టికల్‌ కేబుళ్లు వెళ్తున్నాయి. ఈ మార్గం తూర్పు ఆఫ్రికాను అరేబియా ద్వీపకల్పం నుంచి వేరు చేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యం, చమురు రవాణా, డేటా కమ్యూనికేషన్ పరంగా ఈ జలసంధి ప్రాముఖ్యత అత్యంత కీలకం. ఇక్కడ కేబుళ్లకు ఎలాంటి ఆటంకం ఏర్పడినా ప్రపంచ మార్కెట్లపై తక్షణ ప్రభావం చూపే అవకాశం ఉంది.

హూతీల ముప్పు కూడా ఉందా?

ఇటీవల ఎర్ర సముద్రంపై హూతీ తిరుగుబాటుదారుల దాడులు పెరగడం కూడా ఆందోళన కలిగించే అంశమే. యెమెన్‌ ప్రభుత్వం పలుమార్లు హూతీలు సముద్రగర్భ కేబుళ్లను లక్ష్యంగా చేసుకునే ప్రణాళికలు చేస్తున్నారని హెచ్చరించింది. అయితే తిరుగుబాటుదారుల నుంచి దీనిపై స్పష్టత రాలేదు. అయినప్పటికీ సైబర్‌ భద్రత, కమ్యూనికేషన్‌ వ్యవస్థల రక్షణ దృష్ట్యా ఈ ముప్పు చిన్నగా చూడాల్సిన అంశం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రభావం, ప్రత్యామ్నాయాలు

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 300కి పైగా సముద్రగర్భ కేబుళ్లు ఉన్నాయి. వీటిపైనే ప్రపంచ కమ్యూనికేషన్‌ 90 శాతం ఆధారపడి ఉంది. ఫోన్‌కాల్స్‌, అంతర్జాతీయ నగదు లావాదేవీలు, దౌత్య సంబంధిత సమాచారం అన్నీ వీటిద్వారానే సాగుతున్నాయి. సమస్యలు తలెత్తిన సందర్భంలో ప్రత్యామ్నాయ లింకులను ఉపయోగించి కనెక్షన్లు అందించినా వేగం తగ్గిపోవడం అనివార్యం. ఈసారి కూడా భారత్‌ సహా దాదాపు 10 దేశాలు ఈ పరిస్థితిని ఎదుర్కొన్నాయి.

భవిష్యత్ సవాళ్లు

వాణిజ్య నౌకల నిర్లక్ష్యం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సహజ విపత్తులు.. ఇవన్నీ సముద్రగర్భ కేబుళ్ల భద్రతకు సవాళ్లు. ఈ కేబుళ్లపై ఆధారపడి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరింత రక్షణ చర్యలు, బహుళ ప్రత్యామ్నాయ కనెక్షన్లు అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News