ఇక నెక్ట్స్ గుమ్మనూరు జయరాం వంతు...!
గుమ్మనూరు జయరాం. గుంతకల్లు నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న సీనియర్ నేత. ఈయన రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు.;
గుమ్మనూరు జయరాం. గుంతకల్లు నుంచి గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్న సీనియర్ నేత. ఈయన రాజకీయంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారారు. గత ఎన్నికల తర్వాత వరుసగా వివాదాల పాలవుతున్న నాయకులలో గుమ్మనూరు జయరాం పేరు ప్రస్తుతం మరోసారి తెర మీదకు వచ్చింది. కొన్నాళ్ల కిందట వైసీపీ నాయకులను బెదిరించారన్న వివాదం వచ్చిన తర్వాత చంద్రబాబు నుంచి గట్టి హెచ్చరికలే వెళ్లాయి. దీంతో గుమ్మనూరు జయరాం కొంత సంయమనం పాటించారు.
అయితే తాజాగా మరోసారి ఆయన రైతులను బెదిరించటం, రైతు నాయకులను తీవ్రస్థాయిలో హెచ్చరించడం వంటివి రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రైవేటు కంపెనీకి భూములు ఇవ్వాలని రైతులపై స్థానిక అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీనిని ప్రజాసంఘాలతో కలిసి రైతులు వ్యతిరేకిస్తున్నారు. కొన్నాళ్లుగా అక్కడ ఉద్యమ స్థాయిలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకున్న గుమ్మనూరు జయరాం సదరు కంపెనీకి అనుకూలంగా మాట్లాడుతూ రైతులపై తీవ్రస్థాయిలో దుర్భాషలు బూతులతో విరుచుకుపడ్డారు.
దీనిని ఖండిస్తూ సిపిఎం పార్టీకి చెందిన నాయకుడు, రైతు సంఘాల తరఫున ఎమ్మెల్యే జయరాంతో మాట్లాడారు. ఈ సందర్భంగా జయరాం ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడి నీ అంతు చూస్తాను, నిన్ను లేపేస్తాను అంటూ విమర్శలు అదేవిధంగా బూతులు మాట్లాడటం ఇప్పుడు స్థానికంగా వివాదం రేపింది. ఈ వ్యవహారంపై కమ్యూనిస్టు సంఘాలు ఉద్యమకారులు కూడా ఎమ్మెల్యే తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యేను కట్టడి చేయాలని వారు కోరుతున్నారు.
ఇక ఈ వ్యవహారం తాజాగా సీఎంవో వరకు చేరింది. నిజానికి 24 గంటల్లోనే ఈ వివాదం సీఎంవోకు చేరింది అంటేనే ఎంత తీవ్ర స్థాయిలో విషయం ఉందనేది అర్థమవుతుంది. దీనిపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి కూడా నివేదిక సమర్పించారని తెలిసింది. ఎమ్మెల్యే దూకుడు కారణంగా స్థానికంగా రైతులు అదేవిధంగా ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం రైతులపై దుర్భాషలకు దిగడం అదేవిధంగా ప్రజాసంఘాల నాయకులను తిట్టిపోయటం, బెదిరించటం లేపేస్తానన్నడం వంటి వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు తీవ్రంగా తప్పుపడుతున్నట్టు సమాచారం.
గుమ్మనూరు జయరాంను అమరావతికి పిలిచి హెచ్చరించడమా.. లేకపోతే స్థానికంగా ఉన్న నాయకులతో చర్చించి చర్యలు తీసుకోవటమా అనే విషయంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే గతంలో జయరాం కారణంగా తీవ్ర వివాదాలు రేగాయి. సొంత పార్టీ నాయకుల్లోను ఆయనపై వ్యతిరేకత ఉంది. వైసీపీ నుంచి టిడిపిలోకి రావడం, గతంలో టిడిపి నుంచి వైసీపీలోకి వెళ్లడం ఇట్లా జంపింగ్ జిలానిగా పేరుబడ్డ గుమ్మనూరు తనకు అనుకూలంగా రాజకీయాలను మలుచుకుంటున్నారని తనకు అనుకూలంగా వ్యవస్థలను తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని టిడిపిలోనూ ఒక వర్గం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన పరిణామం మరింత దుమారం రేపింది. ఇప్పుడు చంద్రబాబు ఆయనపై చర్యలు తీసుకున్నందుకు సిద్ధమైన నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు తెరమీదకు వస్తాయనేది చూడాలి. ఏదేమైనా ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా టిడిపిలో ఎమ్మెల్యేలు దారి తప్పుతున్నారు అన్నది వాస్తవం. మరి ఇప్పటికైనా చంద్రబాబు కఠిన చర్యలు తీసుకోకపోతే మున్ముందు మరింత తీవ్రమయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.