ఉక్రెయిన్ పాలిట 'విలన్'స్కీ.. అమెరికా, నాటోను నమ్మి ముంచేశాడు
ఇదంతా ఎందుకు జరిగింది..? అసలు ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమిటి.?? ఆ దేశం ఇకపైన గతంలో లాగా ఉంటుందా? అంటే దీనికి సమాధానాలు చెప్పలేం..!;
సరిగ్గా నాలుగేళ్ల కిందట ఉక్రెయిన్ అంటే.. అందమైన బీచ్ లు.. అద్భుతమైన నిర్మాణాలు.. ఇంకా గొప్పదైన చరిత్ర.. పాడిపంటలు.. ఆనందంగా జీవించే ప్రజలు..!
మరిప్పుడు.. శతాబ్దాల చరిత్ర ఉన్న నిర్మాణాలు ధ్వంసం.. వ్యవసాయం కుదేలు.. పరిశ్రమలు మూత.. రోడ్లు సహా కుప్పకూలిన మౌలిక వసతులు.. అన్నిటికీ మించి ప్రజల జీవనం చితికిపోయింది.. వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.. నిన్నటివరకు కళ్లముందు కనిపించినవారు నేడు లేరు.. బతికి ఉన్నవారి కళ్లలోనూ ఆనందం లేదు..!
ఇదంతా ఎందుకు జరిగింది..? అసలు ఉక్రెయిన్ భవిష్యత్తు ఏమిటి.?? ఆ దేశం ఇకపైన గతంలో లాగా ఉంటుందా? అంటే దీనికి సమాధానాలు చెప్పలేం..! ఇదంతా ఎవరి వల్ల జరిగింది? అంటే.. అందరి వేళ్లూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్ స్కీ వైపే చూపుతున్నాయి. అమెరికా, దాని ఆధ్వర్యంలోని సైనిక కూటమి నాటోను నమ్మి జెలెన్ స్కీ తన దేశాన్ని నిండా ముంచేశాడు. నాటో కూటమిలో చేరాలన్న ఆయన ప్రయత్నమే ఇంతవరకు తెచ్చింది.
అసలే రష్యా.. ఆపై పుతిన్...
రష్యాతో పెట్టుకోవడం అంటే ఏనుగుతో ఎలుక తలపడినట్లే. అదీ పుతిన్ అధ్యక్షుడిగా ఉండగా రష్యాతో యుద్ధం అంటే ఇక కొరివితో తలగోక్కున్నట్లే. అది తెలిసి కూడా జెలెన్ స్కీ యుద్ధానికి కాలుదువ్వాడు. ఒకప్పటి సోవియట్ యూనియన్ దేశమైన ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరితే రష్యాకు పక్కలో బల్లెంగా మారుతుంది. ఎందుకంటే.. నాటో కూటమి దళాలు సభ్య దేశాల్లో ఉంటాయి. ఈ కూటమిలోని ఒక దేశంపై ఏదైనా దేశం యుద్ధానికి దిగితే కూటమిలోని అన్ని దేశాలు యుద్ధం చేస్తాయి. అందుకనే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉక్రెయిన్ ప్రయత్నాన్ని ఏమాత్రం సహించలేదు. 2022 ఫిబ్రవరిలో యుద్ధం మొదలుపెట్టారు. కాకపోతే, వారం రోజుల్లో ఉక్రెయిన్ ను దారికి తెచ్చుకోగలమని పుతిన్ భావించారు. అది నాలుగేళ్లయినా సాధ్యం కాలేదు. అటు రష్యా సాధించినది ఏమీ లేదు. కానీ, ఉక్రెయిన్ కోల్పోయింది మాత్రం చాలా ఎక్కువ.
చేతులు కాలాక..
ఇప్పుడు జెలెన్ స్కీ నాటో కూటమిలో చేరే ఆలోచనను వెనక్కు తీసుకోవడానికి సిద్ధం అని చెప్పారు. కాకపోతే, యూరప్, అమెరికా తమ దేశ భద్రతకు గ్యారంటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అమెరికా చట్ట సభ కాంగ్రెస్ దీనికి ఆమోదం తెలపాలని కోరుతున్నారు. తమ భూభాగాలను మాత్రం రష్యాకు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆగేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 28 పాయింట్ల ప్లాన్ ప్రతిపాదించారు. దీనిపైన చర్చలు నడుస్తున్నాయి. అందుకోసం జెలెన్ స్కీ జర్మనీకి వచ్చారు.
నాటో సభ్యత్వం లేనట్లే..
నాటో సభ్యత్వం అంటే మాటలు కాదు.. దీనికి ఎన్నో మెలికలు ఉంటాయి. 2023లో ఫిన్లాండ్, 2024లో స్వీడన్ కొత్తగా ఈ కూటమిలో చేరిపోయాయి. రష్యాతో 1,300 కిలోమీటర్ల భారీ సరిహద్దు ఉన్న దేశం ఫిన్లాండ్. కానీ, ఉక్రెయిన్ కు మాత్రం నాటో సభ్యత్వం దక్కలేదు. దీన్నిబట్టే పశ్చిమ దేశాలను (అమెరికా, బ్రిటన్ తదితర) నమ్మి జెలెన్ స్కీ తమ దేశాన్ని నిండా ముంచేశారని తేలుతోంది. ఇప్పుడు చేయాల్సిందల్లా.. సాధ్యమైనంత తక్కువ నష్టంతో రష్యాతో యుద్ధాన్ని ముగించడమే.