వీడియో వైరల్... ఈ టెక్నాలజీతో ప్రమాదం జరిగినా విమానంలోని వారంతా సేఫ్!

అహ్మదాబాద్‌ లో ఇటీవలి జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే.;

Update: 2025-06-16 17:45 GMT

అహ్మదాబాద్‌ లో ఇటీవలి జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన సంగతి తెలిసిందే. టెకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే ఒక్కసారిగా విమానం కుప్పకూలి, అగ్నిగోళంగా మారిపోయింది. ఆ సమయంలో సుమారు 1000 డిగ్రీల ఉష్ణోగ్రత ఏర్పడిందని అధికారులు తెలిపారు. దీంతో.. ప్రయాణికులంతా గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు.

అయితే.. అనూహ్యంగా విమానంలో ప్రయాణిస్తున్న 242 మందిలో ఒకే ఒక్క ప్రయాణికుడు మాత్రం గాయలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. వాస్తవానికి ఇలాంటి ప్రమాదాలు ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరిగాయి. అవి జరిగినప్పుడల్లా విమాన ప్రయాణంలోని భద్రత గురించిన చర్చ జరుగుతుంది. కాలక్రమంగా అది మూగబోతుంది.

ఈ క్రమంలో విమాన ప్రయాణాన్ని వీలైనంత సురక్షితంగా చేయడానికి సాహసోపేతమైన ప్రయత్నంలో భాగంగా... ఉక్రెయిన్ ఏరోస్పేస్ ఇంజనీర్ టటరెంకో వ్లాదిమిర్ నికోలెవిచ్.. ప్రమాద సమయాల్లో విమానం నుంచి వేరుచేయగల ప్రయాణీకుల క్యాబిన్‌ తో కూడిన కాన్సెప్ట్ విమానాన్ని రూపొందించారు. ఇది వైరల్ గా మారింది.

అవును... ప్రయాణిస్తున్న సమయంలో అత్యవసర పరిస్థితి ఉంటే.. ఆ విమానం నుంచి ప్రయాణీకులను తీసుకెళ్లే క్యాబిన్ విడిపోయి పారాచూట్‌ లను ఉపయోగించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా ఓ క్యాన్సెప్ట్ విమానాన్ని ఉక్రెయిన్ ఇంజనీర్ రూపొందించారు. 2016లో ఫస్ట్ టైం ప్రవేశపెట్టబడిన ఈ ఆలోచన ప్రపంచంలో గణనీయమైన చర్చకు దారి తీసింది.

ఈ సందర్భంగా స్పందించిన ఇంజనీర్ టటరెంకో... టేకాఫ్ అయినప్పుడు లేదా ల్యాండింగ్ అవుతున్నప్పుడు.. లేదా, ప్రయాణ మధ్యలోనూ అత్యవసర పరిస్థితి ఏర్పడితే.. ఆ సమయంలో ప్రయాణీకుల క్యాబిన్ విడిపోయేలా రూపొందించబడిందని తెలిపారు. విడిపోయిన తర్వాత.. పారాచూట్లు ఆటోమెటిక్ గా తెరుచుకుంటాయి.

ఆ సమయంలో ప్రయాణికుల క్యాబిన్ నీటిలో పడితే.. గాలితో నిండిన గొట్టాలు క్యాబిన్ మునిగిపోకుండా, తేలడానికి సహాయపడతాయి. ఇదే సమయంలో.. ప్రయాణికులతో పాటు వారి లగేజ్ కూడా క్యాబిన్ కింద ఒక ప్రత్యేక ప్రాంతంలో నిల్వ చేయబడుతుంది అని ఆయన వివరించారు.

ఈ నేపథ్యంలో.. ప్రజలు ఈ ఆలోచనను ఇష్టపడ్డారు. ఒక సర్వేలో.. సుమారు 95 శాతం మంది ప్రయాణికులు ఇటువంటి విమానంలో టిక్కెట్ కోసం అదనంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరి ఇది ఎప్పుడు పౌరవిమానాల్లోకి ఎంటరవుతుందనేది వేచి చూడాలి!

Full View
Tags:    

Similar News