మరో వివాదంలో ఉదయపూర్ ఫైల్స్.. నిర్మాతకు హత్యా బెదిరింపులు!
ఉదయపూర్ ఫైల్స్ వివాదం విషయానికి వస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్యకి సంబంధించింది.;
'ఉదయపూర్ ఫైల్స్'.. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు హైకోర్టు, సుప్రీం కోర్ట్ అంటూ తిరిగిన నిర్మాతకి ఇప్పుడు హత్యా బెదిరింపులు రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ మేరకు తాజాగా ఆయన తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ పెట్టారు." ఒక గుర్తు తెలియని వ్యక్తి.. ఉదయపూర్ ఫైల్స్ మూవీ విడుదల ఆపాలి అని, లేని పక్షంలో తనను హత్య చేస్తాను అంటూ " ఒక వ్యక్తి నుంచి బెదిరింపులు వచ్చాయి అని.. నిర్మాత అమిత్ జానీ తెలిపారు. ఈ మేరకు తనకు బెదిరింపు కాల్ వచ్చిన నంబర్ ను కూడా షేర్ చేస్తూ.. ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖల సోషల్ మీడియా ఖాతాలను ట్యాగ్ చేశారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ వివాదాస్పద సినిమా విడుదలకు ముందు.. అమిత్ జానీకి కేంద్ర హోంశాఖ వై కేటగిరి భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఉదయపూర్ ఫైల్స్ వివాదం విషయానికి వస్తే.. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన టైలర్ కన్హయ్య లాల్ హత్యకి సంబంధించింది. 2022 జూన్ 28వ తేదీన ఇద్దరు దుండగులు కన్హయ్య లాల్ దుకాణంలోకి కస్టమర్లుగా నటిస్తూ ప్రవేశించారు. వారిలో ఒకరికి కన్హయ్య లాల్ కొలతలు తీసుకుంటూ ఉండగా.. మరొకరు అతనిని కత్తితో దాడి చేసి తల నరికేశారు. అంతేకాదు ఈ వీడియో మొత్తాన్ని కెమెరాలో బంధించి, ఆన్లైన్లో విడుదల చేశారు. ఇది దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఈ కథ ఆధారంగా ఉదయపూర్ ఫైల్స్ అనే సినిమా రూపొందించారు. నిజానికి 2025 జూలై 11న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ ఏకంగా 150 సీన్స్ ను ఈ సినిమా నుండి తొలగించింది. దీనికి తోడు అటు ముస్లిం సంఘాలు కూడా వ్యతిరేకత వ్యక్తం చేశారు.. ముఖ్యంగా ఈ సినిమా విడుదల అయితే.. శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, ఈ సినిమా ద్వారా ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు ఉందని , వెంటనే ఈ సినిమా విడుదలను ఆపాలి అని ముస్లిం సంఘాలు డిమాండ్ చేశాయి.
దీనికి తోడు సమాజ్ వాదీ పార్టీకి చెందిన మహారాష్ట్ర ఎమ్మెల్యే అబు అజ్వీ కూడా ఉదయపూర్ ఫైల్స్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సినిమాను విడుదల చేయకుండా పూర్తిగా నిషేధించాలి అని, శాంతి భద్రతలకు సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు అన్ని ప్లాట్ఫామ్ లలో నిషేధించాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ట్రైలర్ ని సోషల్ మీడియా నుంచి తొలగించాలని కూడా ఆయన కోరారు. అంతేకాదు మతసామరస్యం దెబ్బతినే అవకాశం ఉందని, ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఈ సినిమా ఏ మతానికో.. విశ్వాసానికో సంబంధించింది కాదని.. భావజాలం, సత్యం గురించి మాత్రమే అని మూవీ మేకర్స్ చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ చిత్రం నిర్మాత అమిత్ జానీ కూడా కోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే.