ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఫైన్ తెలిస్తే గుండె గుబేల్!

అబుదాబీలో ట్రాఫిక్ నిబంధనల అమలు అత్యంత పారదర్శకంగా, కఠినంగా ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడితే 800 దిర్హామ్‌ల (సుమారు రూ. 18,000) భారీ జరిమానాతో పాటు బ్లాక్ పాయింట్లు విధిస్తారు.;

Update: 2026-01-25 15:30 GMT

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 3000 మందికి పైగా ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగా కన్నుమూస్తున్నారు. ఏడాదికి లక్షలాది కుటుంబాల్లో ఈ ప్రమాదాలు తీరని శోకాన్ని నింపుతున్నాయి. ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్యమే ఈ మరణాలకు ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. అయితే అరబ్ దేశమైన యూఏఈ ఈ పరిస్థితిని మార్చడానికి గట్టి చర్యలను తీసుకుంటుంది. అత్యాధునిక సాంకేతికతను, కఠినమైన చట్టాలను జోడించి.. రహదారి భద్రతలో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ద్వారా మాత్రమే ప్రాణాలను కాపాడుకోగలమని అక్కడి నిబంధనలు హెచ్చరిస్తున్నాయి.

అబుదాబీ కఠిన నిబంధనలు - ఏఐ (AI) నిఘా:

అబుదాబీలో ట్రాఫిక్ నిబంధనల అమలు అత్యంత పారదర్శకంగా, కఠినంగా ఉంటుంది. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ వాడితే 800 దిర్హామ్‌ల (సుమారు రూ. 18,000) భారీ జరిమానాతో పాటు బ్లాక్ పాయింట్లు విధిస్తారు. ఇక్కడ విశేషమేమిటంటే, రోడ్లపై ఉండే అత్యాధునిక ఏఐ కెమెరాలు డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా లేదా ఫోన్ ఉపయోగిస్తున్నా క్షణాల్లో గుర్తించి ఆటోమేటిక్‌గా ఫైన్ వేస్తాయి. అయితే, డ్రైవర్ల సౌకర్యార్థం బ్లూటూత్ లేదా హెడ్‌ఫోన్స్ వాడుకోవడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ఒక డ్రైవర్‌కు 24 బ్లాక్ పాయింట్లు చేరితే వారి లైసెన్స్ శాశ్వతంగా రద్దవుతుంది, ఈ నిబంధనలు పాటించక తప్పని పరిస్థితిని కల్పిస్తోంది.

మితిమీరిన వేగం - భారీ మూల్యం:

అతి వేగం క్షణ కాలపు ఆనందాన్ని ఇవ్వవచ్చు కానీ, అది జీవితకాలపు విషాదాన్ని మిగుల్చుతుంది. ఈ విషయాన్ని యూఏఈ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. నిర్ణీత పరిమితి (80 కి.మీ) కంటే ఎక్కువ వేగంతో వాహనాన్ని నడిపితే ఏకంగా 3,000 దిర్హామ్‌ల మన కరెన్సీ లో (సుమారు రూ. 75,000) భారీ జరిమానా విధిస్తారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్‌ను బేఖాతరు చేస్తూ ముందుకు వెళ్తే 1,000 దిర్హామ్‌ల ఫైన్‌తో పాటు, డ్రైవింగ్ హిస్టరీలో అక్కడ పాయింట్స్ వేస్తారు అవి ఒకేసారి 12 బ్లాక్ పాయింట్లు పడతాయి. ఒకవేళ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరంగా ఉండి ఇతరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తే, అధికారులు వాహనాన్ని సీజ్ చేస్తారు. ఆ వాహనాన్ని తిరిగి విడిపించుకోవాలంటే యజమాని దాదాపు రూ. 12 లక్షలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ కఠిన నిబంధనలు వినడానికి భారంగా ఉన్నప్పటికీ, రహదారులపై క్రమశిక్షణను పెంచడానికి ఇవి ఎంతో దోహదపడుతున్నాయి.

గమనిక: ట్రాఫిక్ నిబంధనలు కేవలం శిక్షల కోసం కాదని, అవి మన ప్రాణ రక్షణ కవచాలని గుర్తించాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత పాటించడం వల్ల మనతో పాటు తోటి ప్రయాణికుల ప్రాణాలను కూడా కాపాడవచ్చు.

Tags:    

Similar News