విజయ్ ని లైట్ తీసుకుంటున్న ద్రవిడ పార్టీలు
తమిళనాడులోని ధరాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార తమిళగ వెట్రి కళగం టీవీకే విజయం సాధించింది.
విజయ్ సినీ నటుడు. నిన్నటి వరకూ వెండి తెర మీద విన్యాసాలు చేసే హీరో. ఇపుడు తమిళనాడు పీఠమెక్కి ముఖ్యమంత్రిగా శాసిస్తున్నారు. ఈ రెండింటికీ మధ్య తేడా చాలా ఉంది. అయితే టైం పెట్టిన గ్యాప్ మాత్రం తక్కువగా ఉంది. అందుకే విజయ్ ని హీరోగానే చూస్తున్న ద్రవిడ పార్టీలు ఆయనను ఇంకా రాజకీయ హీరోగా అంగీకరించలేకపోతున్నాయని అంటున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో రెండుకు రెండు అసెంబ్లీ సీట్లూ టీవీకే గెలుచుకుని జబ్బలు చరచింది. అయితే ఇది విజయమే కాదని ద్రవిడ పార్టీలు అంటున్నాయి. విజయ్ పార్టీ టీవీకే సక్సెస్ అంతా తాత్కాలికం అంటున్నాయి. లైట్ తీసుకోమంటున్నాయి.
స్టాలిన్ హాట్ కామెంట్స్ :
తమిళనాడులోని ధరాపురం, మధురాంతకం అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికల్లో అధికార తమిళగ వెట్రి కళగం టీవీకే విజయం సాధించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అయితే టీవీకే విజయాన్ని విమర్శిస్తూ వ్యాఖ్యానాలు చేశారు. ఇది ద్రోహ రాజకీయాల తాత్కాలిక గెలుపని ఆయన ఎద్దేవా చేశారు. కేవలం ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని మెజారిటీగా మార్చే కుట్రగా ఆరోపించారు. అంతే కాదు డబ్బు, అధికార దుర్వినియోగంతోనే గెలిచారని భారీ ఎత్తున విమర్శలు గుప్పించారు. తప్పుడు ప్రతిష్ట కోసం చేస్తున్న రాజకీయం అని అన్నారు. టీవీకే రాజకీయాల పతనం మొదలైందని కూడా స్టాలిన్ హాట్ కామెంట్స్ చేశారు.
లాజిక్ ఇదేనట :
విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీకి పడిన ఓట్ల కంటే టీవీకేకు వ్యతిరేకంగా పోలైన ఓట్లే ఎక్కువ అని స్టాలిన్ లాజిక్ పాయింట్ ని తీశారు. దీనిని కనుక గమనిస్తే మెజారిటీ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించినట్లేనని ఆయన విశ్లేషించారు. ఇవి బలవంతంగా తీసుకుని వచ్చిన ఉప ఎన్నికలుగా ఆయన విమర్శించారు. అంతే కాదు ప్రజాస్వామ్య హత్య అని పెద్ద పదాన్ని వాడారు. సోషల్ మీడియాలో రీల్స్ చేయడంపై కాకుండా ఇక మీదట అయినా ప్రజా సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి విజయ్ దృష్టి సారించాలని స్టాలిన్ సూచించడం గమనార్హం. మరో వైపు అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా టీవీకే విజయం తాత్కాలికమేనని చెప్పుకొచ్చారు.
త్రిముఖ పోరు కారణమా :
స్టాలిన్ చెప్పిన లెక్క చూస్తే త్రిముఖ పోరుతోనే టీవీకే గెలిచిందని విశ్లేషణగా ఉంది. టీవీకే ఒక వైపు డీఎంకే అన్నా డీఎంకే మరో వైపు నిలబడి పోటీకి దిగాయి. టీవీకే గెలిచిన రెండు సీట్లూ అన్నా డీఎంకేవి. దాంతో ఆ పార్టీతో పాటు డీఎంకే కూడ పోటీ చేయడంతో ఓట్ల చీలిక వల్లనే టీవీకే గెలిచింది అని చెబుతున్నారు. అందుకే స్టాలిన్ విపక్షాలకు పోల్ అయిన ఓట్ల కంటే టీవీకేకి వచ్చిన ఓట్లు తక్కువ అని విమర్శించారు. అయితే టీవీకేకి అసలు ఓటు బ్యాంకే అక్కడ లేదన్న సంగతిని ద్రవిడ పార్టీలు విస్మరిస్తున్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కొత్త పార్టీగా దిగి రెండు బలమైన ద్రవిడ పార్టీలను ఓడించడం టీవీకే నిజమైన విజయం అని అంటున్నారు. టీవీకేని దెబ్బ తీయాలంటే ఓట్ల చీలికను నివారించేందుకు ద్రవిడ పార్టీలు కలసినా కలుస్తాయన్న చర్చ కూడా మొదలైంది. అయితే అలా కలిసి వచ్చినా కూడా జనాల తీర్పు అప్పటికి మళ్ళీ మారవచ్చు కదా అన్నది కూడా విశ్లేషణగా ఉంది. ఏది ఏమైనా రెండు ద్రవిడ పార్టీలు ఒకటిగా దిగితే మాత్రం విజయ్ రాజకీయం విజయం అయినట్లే. ఆ మీదట పోరులో ఏమి జరుగుతుంది అన్నది చూడాల్సి ఉంది.