నా వయసు 65 అన్న కోలగట్ల !
అయితే కాంగ్రెస్ నుంచి బొత్స ఆయన అనుచర వర్గం పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరడంతో కోలగట్ల వెనకబడిపోయారు.
విజయనగరం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి. ఆయన కూడా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు సమకాలీనుడు. అంతే అనుభవం ఉన్న నేత. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి తొలిగా చేరిన నేత. 2012లో వైసీపీకి జిల్లా అధ్యక్షుడే కాదు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. 2014 ఎన్నికలను ఆయనే జిల్లాలో వైసీపీ తరఫున నిర్వహించి మూడు సీట్లను గెలిపించారు. 2015లో బొత్స వైసీపీలో చేరేంతవరకూ కోలగట్ల హవా వేరే లెవెల్ అని ఆయన సన్నిహితులు చెబుతారు. జగన్ కూడా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించారు.
బొత్స రాకతోనే :
అయితే కాంగ్రెస్ నుంచి బొత్స ఆయన అనుచర వర్గం పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరడంతో కోలగట్ల వెనకబడిపోయారు. సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్, జిల్లా వ్యాప్తంగా బంధు గణం, బలగం, అర్థ బలం బీసీ కార్డు ఇలా బొత్సకు అన్నీ కలసి వస్తే ఓసీ కార్డుతో కోలగట్ల ఉన్నత పదవులు దక్కకుండా పోయాయని ఆవేదన చెందిన సందర్భాలు ఉన్నాయి. 2019లో విజయనగరం నుంచి అశోక్ కుమార్తెని ఓడించి వచ్చిన కోలగట్ల మంత్రి పదవి కోసం ఆశపడ్డారు. అయితే అయిదేళ్లూ బొత్సనే మంత్రిగా కొనసాగించిన జగన్ ఆయనను డిప్యూటీ స్పీకర్ గా చేశారు. ఇక 2021లో విజయనగరం కార్పోరేషన్ కి మేయర్ పదవి కోసం తన కుమార్తెని కోలగట్ల ప్రతిపాదిస్తే చివరి నిముషంలో మేయర్ పదవిని బీసీ రిజర్వేషన్లు తెచ్చారని అది సొంత పార్టీ నేతల పనే అని ఆయన వర్గం ఆనాడు మధన పడింది. ఇక 2024 లో ఓటమి తరువాత కోలగట్ల అసంత్రుప్తిగా ఉంటూ పార్టీకి దూరం జరిగారు అన్న ప్రచారమూ సాగింది.
పార్టీ మార్పు మీద :
ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా కోలగట్ల జనసేనలోకి చేరుతారు అన్న ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఊపందుకుంది. దాంతో చిన్న శ్రీను వైసీపీని వీడిన తరువాత మరో బిగ్ వికెట్ వైసీపీకి షాక్ ఇస్తోంది అని చర్చ కూడా జోరుగా సాగుతూ వస్తోంది. ఇక కోలగట్ల కూడా విజయనగరంలో లేకుండా విశాఖలో ఉండడం కూడా అనుమానాలకు తావు ఇచ్చింది. దీంతో కోలగట్ల నేడో రేపో పార్టీకి దూరం అవుతారు అని తెగ వైరల్ అవుతున్న వార్తల మీద ఎట్టకేలకు పెద్దాయన స్పందించారు.
అవన్నీ తప్పు అంటూనే :
కోలగట్ల తన మీద జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలు అన్నారు. సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తాయి. ప్రతీ దానిని ఖండించలేము కదా అన్నారు. తన ఇంటి రిపేర్ కారణంగానే విశాఖలో ఉంటున్నాను అంతే తప్ప జిల్లాకూ పార్టీకి దూరం కాలేదని వివరణ ఇచ్చారు. తన వయసు 65 ఏళ్ళను ఈ ఏజ్ లో పార్తీ మారడాలు అవసరమా అని కూడా ప్రశ్నించారు. ఇలా కోలగట్ల వివరణ ఇచ్చినా వైసీపీలో మాత్రం చర్చ ఆగడంలేదు. కుమార్తెకు మేయర్ సీటు కోసమే ఆయన పార్టీని వీడి జనసేనలోకి వెళ్తున్నారు అన్నది జోరుగా సాగుతున్న చర్చ. కోలగట్ల విజయనగరం పట్టణంలో కీలక నాయకుడు, ఆయనకు మంచి పలుకుబడి ఉంది. ఇక ఆయన తన వారసత్వాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్నారు. వైసీపీ తరఫున ఆయన కుమార్తె మేయర్ గా పోటీ చేస్తారని ఒక వైపు వార్తలు ఉన్నా గెలుపు కోసమే జనసేనలోకి వెళ్తారు అని అంటున్న వారూ ఉన్నారు ఏది ఏమైనా కోలగట్ల తాజా వివరణతో వైసీపీ వర్గాలలో అలజడి తగ్గుతుందా లేదా అన్నదే చూడాల్సి ఉంది.