ఎన్డీయేకు చికాకు...చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్యలు

గతంలో సీజేపీ నిరసనల సమయంలో కూడా చిరాగ్ పాశ్వాన్ ఆందోళనలు చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందని చెబుతూ కొంత పరోక్షంగా సీజేపీని సమర్ధించినట్లుగానే మాట్లాడారు.

Update: 2026-10-10 03:15 GMT

ఎన్డీయే మిత్ర పక్షాలు దాదాపుగా పాతిక దాకా ఉన్నాయి. అయితే అందరికీ ఒకే దారి అని చెప్పకపోయినా ఏ మిత్ర పక్షమూ బాహాటంగా అయితే ఎన్డీయే విధానాల మీద కామెంట్స్ చేయడంలేదు. కానీ కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ మాత్రం ఎందుకో కాస్తా భిన్నంగానే వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. గతంలో సీజేపీ నిరసనల సమయంలో కూడా చిరాగ్ పాశ్వాన్ ఆందోళనలు చేసే హక్కు ప్రజాస్వామ్యంలో ఉందని చెబుతూ కొంత పరోక్షంగా సీజేపీని సమర్ధించినట్లుగానే మాట్లాడారు.

యువతను ఆపలేరంటూ :

తాజాగా చిరాగ్ పాశ్వాన్ కీలక వ్యాఖ్యలే చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉంటుందని ఆందోళనకారులను అడ్డుకోవడానికి ఎన్ని రైళ్లు రద్దు చేసినా ఎన్ని రోడ్లు దిగ్బంధించినా భారతదేశ యువతను ఎవరూ ఆపలేరని ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలో సీజేపీ నిర్వహించ తలపెట్టిన నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన రవాణా ఆంక్షలపై ఎన్డీయే మిత్ర పక్ష నాయకుడు చిరాగ్ పాశ్వాన్ ఈ రకంగా కామెంట్స్ చేయడం అయితే రాజకీయంగా చర్చకు తావిస్తోంది. అదే సమయంలో ఆసక్తిని రేపుతోంది. పైగా చిరాగ్ పాశ్వాన్ రవాణా ఆంక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనకారులు రాకుండా రైళ్లు మెట్రో సేవలను నిలిపివేయడం వంటి చర్యల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగడం మినహా ప్రయోజనం ఉండదని పరోక్షంగా ప్రభుత్వ భద్రతా ఆంక్షలను తప్పుపట్టారు.

భిన్నంగానే చిరాగ్ :

బీహార్ కి చెందిన ఈ యువ నాయకుడు దిగ్గజ నేత దివంగత రాం విలాస్ పాశ్వాన్ తనయుడు. ఆయన బీహార్ లో రాజకీయంగా ఎదుగుతున్నారు. బీజేపీతో కలసి ఎన్డీఏలో చేరి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఆయన కీలక అంశాలలో తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లుగా చెబుతున్నారు. మిగిలిన ఏ ఎన్డీయే మిత్ర పక్షం కూడా ఈ తరహాలో కామెంట్స్ చేయడానికి సాహసించని వేళ నిర్మొహమాటంగా చిరాగ్ పాశ్వాన్ కేంద్రానికి ఈ విధంగా తన అభిప్రాయాలను చెబుతున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన ప్రభుత్వం పక్షాన కూడా ఆందోళనకారులకు సూచనలు చేస్తూ బ్యాలెన్స్ చేస్తున్నారు. కేవలం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తూ రాజకీయాలు చేయడం కంటే ఎన్నికల కమిషనర్లను నేరుగా కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని విపక్షాలకు చిరాగ్ పాశ్వాన్ సూచించారు.

దిశా నిర్దేశంగానేనా :

మిత్ర పక్షాలు అయినంత మాత్రాన మౌనంగా ఉండాలని ఎక్కడా లేదని అంటున్నారు. సరైన సమయంలో తమ అభిప్రాయాలను ప్రజల మనోభావాలను ప్రభుత్వానికి తెలియచేయడానికి ప్రయత్నించడంలో తప్పు లేదని అంటున్నారు. ఇక చిరాగ్ పాశ్వాన్ కి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఆయనకు కేబినెట్ హోదాతో కీలక శాఖలనే అప్పగించింది. అయితే ఆయన బీహార్ రాజకీయాల మీద మక్కువ చూపిస్తున్నారు. ఎప్పటికైనా బీహార్ సీఎం కావాలన్నది ఆయన కోరికగా ఉందని అంటారు. ఆయన తండ్రి రాం విలాస్ పాశ్వాన్ కూడా అదే కోరికతో ఉండేవారు, ఆ కోరిక తీరకుండానే ఆయన మరణించారు. ఇవన్నీ పక్కన పెడితే చిరాగ్ వ్యాఖ్యలు విపక్షాలకు ఆయుధంగా మారుతున్నాయి. ఎన్డీయేకు కొంత చికాకుగా కూడా ఉంటున్నాయని అంటున్నారు. అయితే ఎన్డీయే ప్రభుత్వం పట్ల ఆయన విధేయతను నిబద్ధతను ఎవరూ శంకించాల్సిన పని లేదని లోక్ జన శక్తి నేతలు అంటున్నారు.

Tags:    

Similar News