రాష్ట్రపతి ప్రశ్నతో రాహుల్ షాక్ ?
రాష్ట్రపతితో భేటీ అయిన ఇండియా కూటమి పార్టీలు ఈ నెల 12న సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా కలసి తన వినతిని తెలియచేస్తారు అని అంటున్నారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాహుల్ గాంధీ బృందం కలిసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ మీద చర్యలకు డిమాండ్ చేసింది. ఆయన హయాంలో సర్ ప్రక్రియతో ఓటు చోరీ జరిగిందని కూడా రాహుల్ బృందం దేశ ప్రథమ పౌరురాలికి వివరించింది. దేశంలో ఎన్నికల విధానంలో అక్రమాలు చోటు చేసుకుంటున్న పరిస్థితిని వివరించింది. అయితే రాష్ట్రపతి రాహుల్ బృందానికి ఒక ప్రశ్నను అడిగారని అంటున్నారు. మీడియాతో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఇదే విషయం చెప్పారు. ఓటు చోరీ జరిగింది అని చెబుతున్నారు కదా ఆధారాలు ఇవ్వగలరా అని రాష్ట్రపతి అడిగారు. ఆ విధంగా ప్రశ్నించిన తీరుతో షాక్ కి గురి అయ్యామని రాహుల్ చెప్పడం ఇపుడు వైరల్ అవుతోంది.
ఓట్ల చోరీ మీద :
ఇదిలా ఉంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో ఇండియా కూటమి బృందం అంతా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలసి వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి నుంచి తాము ఆశించిన స్పందన రాలేదన్నట్లుగా రాహుల్ గాంధీ మీడియాకు చెప్పారు. తాము ఓట్ల చోరీ గురించి చెప్తుంటే రాష్ట్రపతి. ఓటు చోరీ జరిగింది అని చెబుతున్నారు కదా దానికి సంబంధించిన ఆధారాలు ఇవ్వగలరా అని ప్రశ్నించారని చెప్పారు. తాము చేసిన ఆరోపణలను రాష్ట్రపతి దృష్టికి తెచ్చామని కానీ ఓట్ల చోరీ మీద నేరుగా ఆధారాలు అడగడంతో తాము షాక్‌కు ఆశ్చర్యానికి గురయ్యామని రాహుల్ వ్యాఖ్యానించారు.
దేశం మొత్తానికి తెలుసు :
అయితే ఓట్ల చోరీ జరిగిన విషయం దేశం మొత్తానికి తెలుసు అని రాహుల్ గాంధీ అన్నారు. ఇక రాష్ట్రపతి కోరినట్లుగా తాము సేకరించిన పూర్తి ఆధారాలను ఆమెకు సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామని రాహుల్ స్పష్టం చేయడం విశేషం. అయితే ఓట్ల చోరీ జరిగింది అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ ఎక్కడ నుంచి అయినా ఓటర్లు తమకు ఓటు పోయింది అని ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయా అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. విపక్షాలది రాజకీయ అజెండా అని వారు తప్పుపడుతున్నారు.
సీజేఐతో కూడా :
రాష్ట్రపతితో భేటీ అయిన ఇండియా కూటమి పార్టీలు ఈ నెల 12న సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా కలసి తన వినతిని తెలియచేస్తారు అని అంటున్నారు. ఇదే విషయాన్ని రాష్ట్రపతితో సమావేశం అనంతరం ప్రతిపక్ష నేతలు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. సోమవారం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను కలిసి రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రం ప్రతిని అందజేయనున్నట్లుగా రాహుల్ గాంధీ వెల్లడించారు. అంతే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ వ్యవహారంపైన న్యాయపరమైన జోక్యం కోరుతామని చెప్పారు.
ఈ డిమాండ్లతోనే :
విపక్షాలు అన్నీ నాలుగు ప్రధాన డిమాండ్లతో ముందుకు సాగుతున్నాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ ప్రక్రియను నిలిపివేయాలని, అక్రమంగా తొలగించిన ఓటర్ల పేర్లను మళ్లీ చేర్చాలని, ఎన్నికలను తిరిగి బ్యాలెట్ పేపర్ల ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నాలుగు డిమాండ్లు నెగ్గేంతవరకూ తాము ఉద్యమాన్ని వీడేది లేదని కూడా స్పష్టం చేస్తున్నారు.