11 నుంచి విజయవాడ ఉత్సవ్.. తమిళనాడు సీఎం దళపతి స్పెషల్ అట్రాక్షన్
ఇక తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాకపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీతో ప్రత్యేక అనుబంధం ఉన్న దళపతి విజయ్ ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఏపీ పర్యటనపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నెల 11 నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ కు దళపతి విజయ్ హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. రెండు రోజుల క్రితం తమిళనాడు రాజధాని చెన్నై వెళ్లిన రాష్ట్ర ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి దళపతి విజయ్ ని ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తరఫున వచ్చిన ఆహ్వానంపై తమిళనాడు సీఎంవో కూడా ఆసక్తి కనబరిచినట్లు చెబుతున్నారు. సినీ స్టార్ గా దళపతికి ఏపీలోనూ భారీగా అభిమానులు ఉండటం, దసరా పండుగ సమయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా అభిమానులకు చేరువ కావొచ్చని సీఎం భావిస్తున్నారని చెబుతున్నారు. అదే సమయంలో విజయవాడ కనకదుర్గమ్మను దసరా పర్వదినాల్లో దర్శనం చేసుకునే భాగ్యం కలగడం పట్ల సీఎం ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు.
దసరా ఉత్సవాలతోపాటు విజయవాడ ఉత్సవ్ ను రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహిస్తోంది. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఏటా అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ ఆనవాయితీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడను పర్యాటకంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో గత ఏడాది నుంచి విజయవాడ ఉత్సవ్ కు శ్రీకారం చుట్టారు. ఎంపీ కేశినేని చిన్న ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి సెలబ్రెటీలు, ముఖ్యనేతల హాజరు అయితే మరింత ప్రచారం వస్తుందనే ఆలోచనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ను ఆహ్వానించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఖరారు అయిందని అంటున్నారు. ఈ నెల 14న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో ముస్తాబు అయ్యే కనకదుర్గమ్మను రాష్ట్రపతి దర్శించుకుంటారని చెబుతున్నారు. అదే సమయంలో విజయవాడ ఉత్సవ్ లోనూ రాష్ట్రపతి పాల్గొంటారని ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ ఉత్సవ్ సందర్భంగా భవానిపురంలో ఉన్న పున్నమిఘాట్ లో దేశవ్యాప్తంగా ఉన్న మహిళా సంఘాలతో జాతీయ సరస్ మేళా నిర్వహిస్తున్నారు. ఇందులో సుమారు 650 స్టాల్స్ ఏర్పాటు చేస్తుండగా, ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇక తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ రాకపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఏపీతో ప్రత్యేక అనుబంధం ఉన్న దళపతి విజయ్ ప్రభుత్వ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు. 14, 15 తేదీల్లో రాష్ట్రపతి నగరంలో ఉంటుండటంతో మరో రోజు చూడాలని ఆయన తన కార్యాలయ అధికారులను ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో తమిళనాడు సీఎంవో నుంచి విజయ్ రాకపై సంకేతాలు అందాయని, సీఎం విజయ్ పర్యటనకు సంబంధించిన తేదీపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయని అంటున్నారు. విజయవాడ పర్యటన విషయంలో సీఎం విజయ్ ఉత్సాహం చూపడం ఆయన అభిమానులను ఆనందానికి గురిచేస్తోందని అంటున్నారు. ప్రధానంగా సీఎం అయిన తర్వాత విజయ్ తొలిసారి రాష్ట్రానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేసేందుకు రెడీ అవుతున్నారు. మొత్తానికి తమిళనాడు సీఎం పర్యటన సమాచారంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.