ఇంటర్నెట్ ఆఫ్.. రైళ్లకు బ్రేక్.. సీజేపీ నిరసనలకు కేంద్రంలో భయం.. సుప్రీం సీరియస్

ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్ వంటి సమీప ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాల కోసం రాజధానికి వస్తుంటారని కోర్టు గుర్తుచేసింది.

Update: 2026-10-09 15:45 GMT

దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలను అడ్డుకునే నెపంతో కేంద్ర ప్రభుత్వం విధించిన తీవ్ర ఆంక్షలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపడుతున్న ఆందోళనల దృష్ట్యా ఏకంగా 57 మెట్రో స్టేషన్లను మూసివేయడం.. రైళ్ల రాకపోకలను నిలిపివేయడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో ప్రజా రవాణా వ్యవస్థను స్తంభింపజేసి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది.

పిటిషన్ దాఖలు.. సుప్రీం విచారణ

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) కు వ్యతిరేకంగా సీజేపీ భారీ నిరసనకు పిలుపునివ్వడంతో కేంద్రం భద్రతను తీవ్ర స్థాయిలో పెంచింది. ఈ క్రమంలో మెట్రో స్టేషన్ల మూసివేత, రైళ్ల రద్దు నిర్ణయాలను సవాలు చేస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, ప్రభుత్వ చర్యలపై ఘాటుగా స్పందించింది. నిరసనకారులను నియంత్రించే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ అందుకోసం నగరం మొత్తాన్ని స్తంభింపజేయడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. "సమస్య తీవ్రతకు మించి కేంద్రం చర్యలు ఉన్నాయి. ఇది కీటకాన్ని చంపడానికి సుత్తిని ఉపయోగించినట్లుగా ఉంది" అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సామాన్య ప్రజల రవాణా హక్కుల పరిరక్షణ

ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, ఘాజియాబాద్ వంటి సమీప ప్రాంతాల నుంచి నిత్యం లక్షలాది మంది ఉపాధి, వ్యాపారాల కోసం రాజధానికి వస్తుంటారని కోర్టు గుర్తుచేసింది. చాలామందికి సొంత వాహనాలు ఉండవని ప్రజా రవాణానే నమ్ముకుంటారని తెలిపింది. అన్ని స్టేషన్లను మూసివేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించిన కోర్టు, శాంతిభద్రతలతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని స్పష్టం చేసింది. అనవసర ప్రాంతాల్లో ఆంక్షలు తొలగించి రవాణా సేవలను పునరుద్ధరించాలని సూచించింది.

కేంద్రం స్పందన.. సీజేపీ నేతల విమర్శలు

న్యాయస్థానం వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందించారు. భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఆంక్షలను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ చర్యలపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా మండిపడ్డారు. జంతర్‌మంతర్ వంటి నిర్దేశిత ప్రదేశాల్లో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు తమకు ఉందన్నారు. "యువత చేపట్టే నిరసనలకు ప్రభుత్వం భయపడుతోంది. అంతగా భయం ఉంటే దేశం మొత్తాన్నే మూసివేయండి" అని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఆంక్షలను ఎంతవరకు సడలిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News