అరవింద్ 'జ్యోతిష్యం'.. ట్రంప్ 'వీసా వేటు'.. స్టార్‌లింక్ 'నెట్' డ్రామా!
అమెరికా అధ్యక్ష పై రెండోసారి డోనాల్డ్ ట్రంప్ కూర్చున్నప్పటి నుంచి మన హైదరాబాద్, బెంగళూరు ఐటీ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి.
ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సోషల్ మీడియా పండితులకు మాత్రం అది ముందే తెలిసిపోతుందట.. పూర్వం జ్యోతిష్కులు జాతకాలు చూసి భవిష్యత్తు చెప్పే రోజులు పోయాయి. ఇప్పుడు ఎక్స్ ఖాతా తెరిచి నాలుగు గంభీరమైన పోస్టులు పడేస్తే చాలు.. రాత్రికి రాత్రే 'నోస్ట్రాడమస్' రేంజ్‌లో గుర్తింపు వచ్చేస్తోంది. తాజాగా అరవింద్ అనే వ్యక్తి గతంలో చేసిన కొన్ని అంచనాలు.. ఇప్పుడు జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలకు సరిగ్గా అతికినట్టు సరిపోవడంతో నెటిజన్లు ఆయన్ను సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు. అసలు అరవింద్ చెప్పిందేంటి.. డోనాల్డ్ ట్రంప్ చేసిందేంటి.. మధ్యలో ఎలోన్ మస్క్ స్టార్‌లింక్ ఎక్కడ ప్రత్యక్షమైందో చూస్తే ఈ సోషల్ మీడియా మాయాజాలం అర్థమవుతుంది.
ట్రంప్ మామా 'హ్యాండ్'.. భారత ఐటీ 'మైండ్ బ్లాక్'
అమెరికా అధ్యక్ష పై రెండోసారి డోనాల్డ్ ట్రంప్ కూర్చున్నప్పటి నుంచి మన హైదరాబాద్, బెంగళూరు ఐటీ కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెడుతుంటాయి. హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించడం.. విదేశీ ఉద్యోగుల నియామకాలపై కొత్త రూల్స్ తేవడం లాంటి నిర్ణయాలు భారత టెక్నాలజీ నిపుణులపై నేరుగా దెబ్బ కొడుతుంటాయి. అయితే "ట్రంప్ వస్తే మన ఐటీకి తిప్పలు తప్పవు" అని అరవింద్ గతంలోనే పోస్ట్ చేశారట. నిజానికి అమెరికా ఎన్నికల సరళిని, ట్రంప్ పాత నిర్ణయాలను గమనించిన ఏ సాధారణ విశ్లేషకుడైనా చెప్పే మాటే ఇది. కానీ అది నిజం కాగానే చూశారా అరవింద్ ముందే చెప్పారంటూ నెటిజన్లు పూనకం వచ్చినట్లు రీట్వీట్లు కొడుతూ రచ్చ చేస్తున్నారు.
‘బ్యాడ్ ఇంటర్నెట్’ మంత్రం.. స్టార్‌లింక్‌కు రెడ్ కార్పెట్?
కథలో అసలైన ట్విస్ట్ ఎలోన్ మస్క్‌కి చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రవేశంతో మొదలైంది. భారత్‌లో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఉన్నట్టుండి ‘బ్యాడ్ ఇంటర్నెట్’ అనే కొత్త రాగం అందుకున్నారు. సరిగ్గా స్టార్‌లింక్ భారత్‌లోకి అడుగుపెట్టే సమయానికే ప్రస్తుత ఇంటర్నెట్ నాణ్యత బాగా లేదనే చర్చ పెరగడం.. దానికి అనుకూలంగా అరవింద్ ముందే అంచనా వేశారని ప్రచారం జరగడం నిజంగానే టైమింగ్ అల్టిమేట్ అనిపిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ అవసరమే అయినా ఉన్నట్టుండి ప్రజలకు తమ ఇంటి వైఫై సరిగ్గా పనిచేయడం లేదని ఒకేసారి గుర్తొచ్చిందా లేక స్టార్‌లింక్ క్రేజ్ పెంచడానికి సోషల్ మీడియా వేదికగా ఏదైనా వినూత్న పిఆర్ డ్రామా నడుస్తోందా అనే అనుమానాలు రాక మానవు.
ఊహించారా? యాదృచ్ఛికమా? లేక గాల్లో దీపమా?
సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన సూత్రం పనిచేస్తుంటుంది. ఒక వ్యక్తి రోజుకు పది అంచనాలు వేస్తే అందులో ఎనిమిది తప్పు అయినా ఎవరూ పట్టించుకోరు. కానీ యాదృచ్ఛికంగా ఒక్కటి నిజమైనా చాలు, ఆ పాత పోస్టును తవ్వి తీసి అతన్ని మహాజ్ఞానిగా మార్చేస్తారు. అరవింద్ విషయంలోనూ ఆ పోస్టులు ఏ తేదీన పెట్టారు, అందులో పేర్కొన్న విషయాలు నిర్దిష్టమైనవా లేక ఎటు తిరిగినా సరిపోయే జనరల్ ప్రకటనలా అనేది పరిశీలించాల్సి ఉంది. ట్రంప్ వీసా విధానాలకు, స్టార్‌లింక్ ప్రచారానికి మధ్య నిజంగానే ఏదైనా రహస్య లింక్ ఉందా లేక రెండూ ఒకే సమయంలో జరగడం కేవలం కాకతాళీయమా అనే ప్రశ్నలకు స్పష్టమైన ఆధారాలు కావాలి.