జగన్ ప్రచార స్ట్రాటజీపై విజయ్ మొగ్గు... ఫలితం అలా కాకూడదంటున్న ఫ్యాన్స్!
అవును.. తమిళనాడులో రోడ్ షోల ద్వారా తన పార్టీకి క్రేజ్ తీసుకురావాలని టీవీకే అధినేత, సూపర్ స్టార్ విజయ్ ఇటీవల ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.;
వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి, సత్తా చాటాలని సినీనటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధినేత జోసఫ్ విజయ్ ప్రాణాళికలు రచిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఇకపై సినిమాలకు గుడ్ బై చెప్పాలని.. పూర్తి కాన్సంట్రేషన్ రాజకీయాలపై పెట్టాలని భావిస్తున్నారని అంటున్నారు.ఈ నేపథ్యంలో ఆయన తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
అవును.. తమిళనాడులో రోడ్ షోల ద్వారా తన పార్టీకి క్రేజ్ తీసుకురావాలని టీవీకే అధినేత, సూపర్ స్టార్ విజయ్ ఇటీవల ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల కరూర్ తొక్కిసలాట ఘటన ఆయనకు బిగ్ షాకిచ్చింది. ఆ ఘటన, తదనంతరం రాజకీయ పరిణామాలు ఆయనకు అనుభవంతో పాటు ఆలోచనలను ఇచ్చిందని అంటున్నారు.
వాస్తవానికి... కరూర్ తొక్కిసలాట అనంతర పరిణామాలతో విజయ్ రాజకీయంగా, మానసికంగా డైలమాలో పడిపోయారని అంటున్నారు. ఆ సమస్య నుంచి ఇప్పటికీ బయటపడని నేపథ్యంలో.. మరోసారి అలాంటి ఘటన జరిగే అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ అధినేత జగన్ అనుసరించిన శైలిని అనుసరించాలని భావిస్తున్నారని అంటున్నారు.
ఏపీలో 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్ షోలకు ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చేవారు కాదు! పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తూ.. "సిద్ధం" సభలు నిర్వహించేవారు. ఆ సభలకు పెద్ద ఎత్తున జనాలు, వైసీపీ కార్యకర్తలు వచ్చేవారు.. ఈ సభలకు అటు మీడియాలోనూ, ఇటు జనాల్లోనూ, సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున చర్చ జరిగేది.
ఈ నేపథ్యంలో తాజాగా కరూర్ ఎక్స్ పీరియన్స్ అనంతరం టీవీకే అధినేత విజయ్ కూడా ఈ తరహా ఆలోచనలే చేస్తున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఆయా నియోజకవర్గాల్లో, జిల్లాల్లో విశాలమైన స్థలంలో జన సమీకరణ చేసి.. నేరుగా హెలికాఫ్టర్ ద్వారా ఆ ప్రాంతానికి చేరుకుని.. ప్రజలను, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించాలని భావిస్తున్నారని అంటున్నారు.
తద్వారా... వాహనంతో పాటు పరుగులు పెట్టడం, తొక్కిసలాట జరగడం, అనంతరం కోర్టు కేసులు ఎదుర్కోవడం వంటి పరిణామాలు ఉండవని విజయ్ & కో భావించారని అంటున్నారు. ఈ క్రమంలో ఇకపై నగరం వెలుపల ప్రైవేట్ ల్యాండ్ ను లీజ్ పై తీసుకుని.. అక్కడ జన సమీకరణ చేసి సభలు నిర్వహించాలని భావించారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దిశగా ప్రాణళికలు రచించిన విజయ్... ఈ మేరకు హెలీకాప్టర్ ను బుక్ చేసుకున్నారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి. ఇకపై అంతా ఈ విధంగా జరుగుతుందని అంటున్నారు. అయితే... “సిద్ధం” సభల ప్రతిఫలాలు తెలిసిన టీవీకే జనం మాత్రం. స్ట్రాటజీ వరకూ ఓకే కానీ.. ఫలితాలు మాత్రం అలా ఉండకూడని భావిస్తున్నారని అంటున్నారు!