విజయ్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంలు ఎంత మంది ?

తమిళనాడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 118 టీవీకేని తెగ కలవరపెడుతోంది. ఆ నంబర్ ని సాధించడానికి టీవీకే నేతలు అంతా తమ ప్రయత్నాలలో వారు చేస్తున్నారు.;

Update: 2026-05-07 16:12 GMT

తమిళనాడు రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ 118 టీవీకేని తెగ కలవరపెడుతోంది. ఆ నంబర్ ని సాధించడానికి టీవీకే నేతలు అంతా తమ ప్రయత్నాలలో వారు చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మద్దతు సాధించిన టీవీకే నేతలు వామపక్షాలు ఇతర చిన్న పార్టీల నేతలతో సంప్రదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న అన్నా డీఎంకేని చీల్చే కార్యక్రమం కూడా సాగుతోంది అని అంటున్నారు.

రెండాకులు చీలిక :

అన్నా డీఎంకే గుర్తు రెండాకులు. ఇపుడు ఆ రెండాకులలో భారీ చీలిక వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిన్న పార్టీల మద్దతు ఎంత లభించినా కూడా కనీసంగా మరో పాతిక మంది ఎమ్మెల్యేలు అయినా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ ఉంటేనే ప్రభుత్వానికి రాజకీయ సుస్థిరత వస్తుందని భావిస్తున్న టీవీకే నేతలు ఆ దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. దీంతో అన్నాడీఎంకేలో ఒక భారీ చీలిక రాబోతోంది అని అంటున్నారు. ఒక సీనియర్ నేత సారధ్యంలో పాతిక మంది దాకా ఎమ్మెల్యేలు బయటకు వచ్చి టీవీకేకు మద్దతు ప్రకటిస్తారని అంటున్నారు.

ఉప ముఖ్యమంత్రి ఆఫర్ :

ఇక అన్నా డీఎంకేలో 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకేకు మద్దతు పలికితే సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగంకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. అంతే కాదు ముఖ్యమైన శాఖలు కూడా అన్నా డీఎంకే నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు ఇస్తారని అంటున్నారు. ఈ మేరకు అన్నా డీఎంకేలోని 28 ఎమ్మెల్యేల మద్దతు కూడగడుతున్న సీవీ షణ్ముగంతో టీవీకే ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. ఇక అన్నా డీఎంకేలోని ఈ చీలిక వర్గం నేతలు అంతా పాండిచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్టులో క్యాంప్ గా ఉన్నారు అని అంటున్నారు. గతంలోనే అన్నా డీఎంకే నుంచి బయటకు వచ్చి టీవీకేలో చేరిన సీనియర్ నేత మాజీ మంత్రి కేఎ సెంగోటయన్ కూడా ఈ చర్చలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు చెబుతున్నారు.

పళనిస్వామికి షాక్ :

మరో వైపు అన్నా డీఎంకేలోని మొత్తం 51 మంది ఎమ్మెల్యేలను ఏకతాటి మీద ఉంచేందుకు మాజీ సీఎం అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి ఆపసోపాలు పడుతున్నారు. పార్టీ రెండోసారి కూడా ఓటమి పాలు కావడంతో సీనియర్లు ఆయన మాట వినేందుకు సుముఖంగా లేరని అంటున్నారు. అందులో ముఖ్య నేత సీనియర్ నాయకుడు సీవీ షణ్ముగం అయితే పార్టీని చీల్చి అయినా పెద్ద నంబర్ నే తీసుకుని టీవీకేకు మద్దతుగా నిలవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయనతో పాటు మరో సీనియర్ అన్నా డీఎంకే నాయకుడు ఓఎస్ మణియన్ వంటి వారు కూడా టీవీకే సంకీర్ణ ప్రభుత్వంలో చేరి కీలక పదవులు అందుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారుఇ.

కాంగ్రెస్ కి కూడానా :

మరో వైపు అయిదుగురు ఎమ్మెల్యేల బలం ఉన్న కాంగ్రెస్ కి కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారా అన్న చర్చ సాగుతోంది. ఇలా మద్దతు ఇచ్చిన పార్టీలు ఉప ముఖ్యమంత్రి పదవి మీద కీలక మంత్రిత్వ శాఖల మీద గురి పెడుతూండడంతో ఈ పంచాయతీ ఎపుడు తెగుతుంది. టీవీకేకు చివరికి మిగిలేవి ఎన్ని మంత్రి పదవులు అసలు ఎంత మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది అన్నది అయితే ఇప్పటికి అయితే అతి పెద్ద చర్చగా ఉంది.

Tags:    

Similar News