68 లక్షల కిలోల కల్తీనెయ్యి..20 కోట్ల లడ్డూల తయారీ
తిరుమల శ్రీవారి ఆలయంలో రోజూ 3.5 -4 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. ఇందుకోసం 12 నుంచి 13 వేలకేజీల నెయ్యిని వినియోగిస్తారు.;
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన టీటీడీ లడ్డూలో వినియోగించిన కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ తాజాగా తన రిపోర్టును సిద్ధం చేసింది. ఇందులో షాకింగ్ నిజాల్ని ప్రస్తావించింది. వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మొత్తం 1.61 కోట్ల కేజీల ఆవునెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీ కోసం కొనుగోలు చేశారు.
అందులో 68 లక్షల కేజీల నెయ్యి కల్తీనేనని స్పష్టం చేసింది. శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూల్ని కల్తీ నెయ్యితోనే తయారు చేసినట్లు స్పష్టం చేసిన సిట్.. "మొత్తం 48.76 కోట్ల లడ్డూల్ని తయారు చేయగా అందులో 40 శాతం పామాయిల్.. పామ్ కెర్నల్ ఆయిల్.. ఇతర రసాయనాలతో తయారు చేసినట్లుగానిర్ధారణ అయ్యింది" అని పేర్కొంది.
టీటీడీకి నెయ్యిని సప్లై చేసిన సంస్థల్లో ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డెయిరీ.. తమిళనాడు దిండిగల్ లోని ఏఆర్ డెయిరీ.. తిరుపతి జిల్లా పునబాకలోని వైష్ణవి డెయిరీ.. ఉత్తరప్రదేశ్ కు చెందిన మాల్ గంగ డెయిరీలకు రూ.250కోట్లు చెల్లింపులు జరిపారు. ఈ డెయిరీల నుంచి మొత్తం 1.61 కోట్ల కేజీల నెయ్యి కొనుగోలు చేయగా.. అందులో 68లక్షల కేజీలు కల్తీగా తేల్చారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో రోజూ 3.5 - 4 లక్షల లడ్డూలు తయారు చేస్తారు. ఇందుకోసం 12 నుంచి 13 వేల కేజీల నెయ్యిని వినియోగిస్తారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసి వాటితో తయారు చేసిన లడ్డూలను అందజేయటం ద్వారా భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసినట్లుగా సిట్ స్పష్టం చేసింది. దీని బాధ్యులపై త్వరలో చర్యలు తీసుకోనున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.