తిరుమ‌ల బాగుంది.. ఆ ప్ర‌చారం బూట‌కం: టీటీడీ

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గుతోంద‌ని.. దీనికి కార‌ణం.. ఇక్క‌డ జ‌రుగుతున్న అసాం ఘిక కార్య‌క్ర‌మాలేన‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.;

Update: 2025-06-09 10:05 GMT

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే వారి సంఖ్య త‌గ్గుతోంద‌ని.. దీనికి కార‌ణం.. ఇక్క‌డ జ‌రుగుతున్న అసాంఘిక కార్య‌క్ర‌మాలేన‌ని పెద్ద ఎత్తున సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని ఖండిస్తూ.. తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. మ‌రీ ముఖ్యంగా... ఓ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త ఒక‌రు పూటుగా మందు కొట్టి.. శ్రీవారి మాడ వీధుల్లో తిరుగుతున్నార‌న్న ప్ర‌చారం జ‌ర‌గడంపై విస్మ‌యం వ్య‌క్తం చేసింది.

అలాంటిదేమీ లేద‌ని.. తిరుమ‌ల అంతా బాగుంద‌ని టీటీడీ వివ‌ర‌ణ ఇచ్చింది. తిరుమ‌ల‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని బూట‌క‌పు ప్ర‌చారంగా పేర్కొంది. ''తిరుమలలో మద్యం సేవించిన వ్యక్తి'' అనే ప్రచారం సత్య దూరమ‌ని వ్యాఖ్యానించారు. ఇటీవల సోషల్ మీడియా వేదికలలో ప్రచారం అవుతున్న ఒక వీడియోలో మద్యం సేవిస్తున్న వ్యక్తి దృశ్యాలను తిరుమలలో జరిగినదిగా వర్ణిస్తూ పుకార్లు వ్యాప్తి చేస్తున్నట్లుగా టీటీడీ దృష్టికి వచ్చింద‌ని.. ఈ ప్రచారాన్ని టీటీడీ పూర్తిగా ఖండిస్తోందని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

"సంబంధిత ఘటన అలిపిరి ప్రారంభంలో అంటే తనిఖీ కేంద్రానికి వచ్చే ముందు ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతం తిరుమల ప‌రిధిలోకి రాదు. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్య‌క్తులు ప్ర‌చార యావ‌తో తిరుమ‌ల‌లో అప‌చారం జ‌రిగిందంటూ ప్ర‌చారం చేయ‌డం మ‌హాపాపం. ఈ నేపథ్యంలో భక్తులు తప్పుడు ప్రచారాలను నమ్మకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. తిరుమల పవిత్రతను దెబ్బతీసే అసత్యాలను ప్రచారం చేస్తున్న‌వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటాం" అని టీటీడీ హెచ్చ‌రించింది.

Tags:    

Similar News