గడువు దగ్గరకు.. అజ్జూ ఫ్యూచర్ ఏంటి?
పదవి రావటం ఒక ఎత్తు. ఆ పదవిలో కుదుటుగా ఉండటం మరో ఎత్తు. ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినోళ్లు.. ఎమ్మెల్సీలుగా ఎంపికైనోళ్లు.. తమ నియామకానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.;
పదవి రావటం ఒక ఎత్తు. ఆ పదవిలో కుదుటుగా ఉండటం మరో ఎత్తు. ఇటీవల కాలంలో రాష్ట్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసినోళ్లు.. ఎమ్మెల్సీలుగా ఎంపికైనోళ్లు.. తమ నియామకానికి సంబంధించి ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీల్ని ఎంపిక చేస్తున్న ప్రభుత్వానికి ఇటీవల కాలంలో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గతంలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నిక కాని వారు మంత్రివర్గంలో చేరితే.. ఎమ్మెల్సీలుగా వారి నియామక ప్రక్రియ వెంటనే జరిగిపోయేది. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అంతకంతకూ తగ్గుతున్నాయి. అందుకు నిలువెత్తు నిదర్శనంగా తెలంగాణ మంత్రి అజారుద్దీన్ ఉదంతాన్ని చెప్పొచ్చు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ ఆశించిన ఆయన్ను.. ఎన్నికల బరిలోకి రాకుండానే ఎమ్మెల్సీ కోటాలో ఎంపిక చేసేందుకు వీలుగా నిర్ణయం తీసుకొని.. మంత్రిపదవిని హడావుడిగా కట్టబెట్టారు. నిబంధనల ప్రకారం ప్రత్యక్ష ఎన్నికల్లో నేరుగా గెలవకున్నా.. నామినేషన్ పద్దతిలో ఎమ్మెల్సీగా ఎంపిక చేయటం ద్వారా మంత్రి పదవిని ముందుగా చేపట్టొచ్చు. కాకుంటే.. మంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి ఆర్నెల్ల గడువు లోపు ప్రత్యక్ష ఎన్నికల ద్వారా కానీ.. మండలి సభ్యుడిగా కానీ ఎంపిక కావాల్సి ఉంది.
ఇదే తీరులో మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్.. ఏప్రిల్ చివరి నాటికి ఏదో ఒక సభ నుంచి ఎన్నిక కావాల్సి ఉంది. అతడికున్న పరిమితుల నేపథ్యంలో ప్రత్యక్ష ఎన్నికలతో ఎన్నికయ్యేది కష్టం. అలాంటప్పుడు మిగిలిన మార్గం ఎమ్మెల్సీగా ఎన్నిక కావటమే. అయితే.. ఎమ్మెల్సీగా ఆయన పేరును ఇప్పటికే రేవంత్ సర్కారు సిఫార్సు చేసింది. అయితే.. ఈ సిఫార్సును గవర్నర్ ఇప్పటివరకు ఆమోదించలేదు. అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటానికి ముందే ప్రొఫెసర్ కోదండరాం.. అమేర్ అలీఖాన్ పేర్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయటానికి గవర్నర్ కుప ంపటం.. దీనిపై సుప్రీం కేసు పడిన నేపథ్యంలో మళ్లీ ప్రతిపాదన పంపాల్సి వచ్చింది.
రెండోసారి కూడా కోదండరాం పేరుతో పాటు.. అజారుద్దీన్ పేరును సిపార్సు చేశారు. సుప్రీంకోర్టులోకేసు కారణంగా నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ పెండింగ్ లో పెట్టారు. అయితే.. గత నెలలో ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రభుత్వ వాదనల అనంతరం స్పందించిన సుప్రీం.. గవర్నర్ నిర్ణయం తీసుకోవచ్చని.. తమ తీర్పు అందుకు అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరికి గవర్నర్ నుంచి ఓకే అన్న మాట వస్తుందని భావించారు.కానీ.. అలా జరగలేదు. దీంతో.. ప్రభుత్వ ముఖ్యులు గవర్నర్ ను కలిసి.. పరిస్థితిని వివరించారు.
ఇదే సమయంలో పాత గవర్నర్ బదిలీ కావటం.. ఆయన స్థానంలో కొత్త గవర్నర్ రావటంతో.. మళ్లీ ఈ విసయాలన్నింటిని కొత్త గవర్నర్ కు వివరించాల్సి ఉంటుంది. ఇదే అంశంపై గురువారం విచారణ జరగ్గా.. ఇప్పటికే ఈ అంశంపై స్పష్టత ఇచ్చామని గుర్తు చేసిన సుప్రీం.. తమ ఆదేశాలు అమలు కాని పక్షంలో రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించొచచ్చని స్పష్టం చేసింది. దీంతో.. గవర్నర్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి. రంజాన్ సందర్భంగా అజారుద్దీన్ కు గవర్నర్ నిర్ణయంతో తోఫా దక్కుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.