చర్చలు విఫలం.. రాత్రినుంచే బస్సులు బంద్.. ఆర్టీసీ సమ్మె షురూ
తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు కీలకమైన టీజీఎస్‌ఆర్టీసీలో మరోసారి కార్మిక ఆందోళన మళ్లీ ఉధృతమవుతోంది.;
తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు కీలకమైన టీజీఎస్‌ఆర్టీసీలో మరోసారి కార్మిక ఆందోళన మళ్లీ ఉధృతమవుతోంది. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ అధికారుల కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు జరిపిన కీలక చర్చలు ఎలాంటి నిర్ణయానికి రాకుండానే విఫలమయ్యాయి. దీంతో కార్మిక సంఘాలు కఠిన నిర్ణయం తీసుకుని నేటి అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మెలోకి దిగనున్నట్లు ప్రకటించాయి.
ఆర్టీసీ కార్మికులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఈ చర్చలను ఎంతో ఆశగా ఎదురుచూశారు. ముఖ్యంగా ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వేతన సవరణ అమలు, పదోన్నతులు, సేవా భద్రత వంటి ప్రధాన అంశాలపై స్పష్టమైన హామీలు వస్తాయని భావించారు. అయితే కమిటీ మాత్రం ఈ సమస్యల పరిష్కారానికి కనీసం నాలుగు వారాల సమయం అవసరమని సూచించింది. సమ్మెను తాత్కాలికంగా విరమించుకోవాలని జేఏసీకి విజ్ఞప్తి చేసింది.
కానీ ఆ ప్రతిపాదనను జేఏసీ నేతలు ఖండించారు. “మా డిమాండ్లు కొత్తవి కావు. గతంలోనే ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు మాత్రమే కోరుతున్నాం. సమస్యలను మళ్లీ మళ్లీ వాయిదా వేయడం మాకు ఆమోదయోగ్యం కాదు” అని జేఏసీ ఛైర్మన్ వెంకన్న స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోవడంతో సమ్మె తప్పనిసరి అయిందని ఆయన పేర్కొన్నారు.
జేఏసీ ప్రకటన ప్రకారం మొత్తం 32 డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు సమ్మె కొనసాగనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సు సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. గ్రామీణ ప్రాంతాల్లో రవాణా వ్యవస్థ మరింత దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఇక ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం, ప్రైవేట్ వాహనాలను వినియోగించడం వంటి చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు చర్చల ద్వారానే సమస్య పరిష్కారం సాధ్యమని భావిస్తున్న ప్రభుత్వం.. కార్మిక సంఘాలను మళ్లీ చర్చలకు ఆహ్వానించే అవకాశమూ ఉంది.
సమ్మె నేపథ్యంలో రాష్ట్ర రాజకీయ వాతావరణం కూడా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే అవకాశం ఉండగా కార్మిక సంఘాలు తమ డిమాండ్లపై రాజీ పడే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ మధ్య తదుపరి పరిణామాలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకంగా మారాయి.