రష్యా ఎఫెక్ట్ : ట్రంప్ ‘అణు’పరీక్షలకు ఆదేశాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షించే కీలక నిర్ణయం తీసుకున్నారు.;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దృష్టిని మళ్లీ ఆకర్షించే కీలక నిర్ణయం తీసుకున్నారు. అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని తను యుద్ధశాఖకు ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు. రష్యా - చైనా తమ అణు కార్యక్రమాలను వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అంతర్జాతీయ వేదికపై తీవ్ర చర్చకు దారితీసింది.
*న్యూక్లియర్ పరుగు: కారణాలు ఇవే!
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో చేసిన పోస్ట్‌లో ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. "ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికా వద్దనే అత్యధిక అణ్వాయుధాలు ఉన్నాయి. నా మొదటి అధ్యక్ష పదవీకాలంలోనే దీనిని సాధించాం. ఈ ఆయుధాలకు ఉన్న విధ్వంసక శక్తి కారణంగా నేను పరీక్షలు నిలిపివేశాను." అని తెలిపారు. ప్రత్యర్థి దేశాల విస్తరణతో ఇప్పుడు వేరే మార్గం లేదు. రష్యా రెండో స్థానంలో ఉంది, చైనా మూడో స్థానంలో ఉంది. వచ్చే ఐదేళ్లలో ఈ దేశాలు మన స్థాయికి చేరే అవకాశం ఉంది." అని తెలిపారు. అందువల్ల అమెరికా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించాలని నేను ఆదేశించాను. ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
*రష్యా, చైనా అణు సామర్థ్యాల విస్తరణ
ట్రంప్ ఈ ప్రకటన చేయడానికి ప్రధాన కారణం రష్యా , చైనాల యొక్క దూకుడు అణు కార్యక్రమాలేనని తెలుస్తోంది. రష్యా ఇటీవల తన ఆయుధ ఉత్పత్తిని విస్తరించడమే కాకుండా, కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగింది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా అణుశక్తి ఆధారిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ ను విజయవంతంగా పరీక్షించినట్లు ప్రకటించారు.
అదే సమయంలో చైనా కూడా తన అణు ఆయుధ సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తోంది. యూఎస్ నిఘా సంస్థల అంచనాల ప్రకారం, మరో ఐదేళ్లలో చైనా అణు సామర్థ్యాలు అమెరికా, రష్యాల స్థాయికి చేరుకునే అవకాశం ఉంది.
రాజకీయ వ్యూహమా?
ట్రంప్ ఈ ప్రకటన దక్షిణ కొరియాలోని బుసాన్‌లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్న కొన్ని గంటల ముందే చేయడం గమనార్హం. ఈ పరిణామం అమెరికా–చైనా మధ్య సాంకేతిక, రక్షణ రంగాల్లోని ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
భద్రతా సమతౌల్యంపై ప్రభావం
ఈ నిర్ణయం అమల్లోకి వస్తే, దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అమెరికా అణ్వాయుధ పరీక్షలను మళ్లీ ప్రారంభించినట్లవుతుంది. ఈ అంశంపై ఇప్పటివరకు పెంటగాన్ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ట్రంప్ ఈ నిర్ణయం ప్రపంచ భద్రతా సమతౌల్యాన్ని కదిలించే చర్యగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రపంచ దేశాల ప్రతిస్పందనలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.