'అయ్యో.. రొయ్య'... ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఏపీలో ఎంతంటే..!
ఈ నేపథ్యంలో... రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది.;
ఆగస్టు 1 నుంచి భారత్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విదిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం అమలులో ఉన్న 10 శాతం సుంకాలకు ఇది అదనమా.. లేక, దీనితో కలిపే 25 శాతమా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని అంటున్నారు. మరోవైపు... 'జరిమానాలు' అదనం అని ప్రకటించిన నేపథ్యంలో.. అవి ఏ మేరకు ఉంటాయనే ఆందోళనలు నెలకొన్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు భారత ప్రభుత్వం తెలిపింది. ఈ సందర్భంగా... జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో... రైతులు, వ్యాపారవేత్తలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ సమయంలో... రొయ్యల ఎగుమతులపై తీవ్ర ప్రభావం ఉండొచ్చని అంటున్నారు.
అవును... ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న అమెరికా 25 శాతం సుంకం, అదనంగా జరిమానా విధించడం వల్ల భారతదేశ సముద్ర ఆహారం ఎగుమతులు, ముఖ్యంగా రొయ్యలు తీవ్రంగా ప్రభావితమవుతాయని వ్యవసాయ ఆర్థికవేత్త అశోక్ గులాటి అన్నారు. అన్ని భారతీయ వస్తువులపై అధిక సుంకం విధించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం చాలా చెడ్డదని.. అది కచ్చితంగా షాకింగ్ నిర్ణయమని గులాటి అన్నారు.
వాస్తవానికి అమెరికా సుంకాల అమలు నిర్ణయం 10 నుంచి 15 శాతం మాత్రమే ఉంటుందని తాను భావించినట్లు చెప్పిన గులాటీ... తాజా చర్య దేశ రొయ్యల ఎగుమతులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని అన్నారు. ఇదే సమయంలో ట్రంప్ పాతిక శాతం సుంకాలు + అదనపు జరిమానా వ్యవహారం.. రొయ్యల ఎగుమతులతో పాటు, వస్త్రాల ఎగుమతులపైనా ప్రభావాన్ని భారతదేశం చూస్తుందని తెలిపారు.
కాగా... 2024-25లో భారతదేశ రొయ్యల ఎగుమతులు సుమారు 4.88 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో... ఇది మొత్తం సముద్ర ఆహార ఎగుమతుల్లో 66 శాతం వాటా కలిగి ఉందని అంటున్నారు. మరోవైపు... భారత రొయ్యలకు అమెరికా, చైనా అగ్ర మార్కెట్లుగా ఉండగా.. ముడి రొయ్యల రకాల ఎగుమతి పరిమాణంలో సుమారు సగం అమెరికా తీసుకుంటోంది!
ఆంధ్రప్రదేశ్ కు బిగ్ ఎఫెక్ట్!:
తాజాగా ట్రంప్ ప్రకటించిన 25% సుంకాల ప్రభావం ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడుల్లోని రొయ్యల ఎగుమతులపైనా పడనుందని అంటున్నారు. వాస్తవానికి భారత్ నుంచి ఏటా 11 లక్షల టన్నుల రొయ్యలు ఎగుమతి అవుతుంటే.. అందులో సుమారు ఎనిమిది లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్ నుంచే ఎగుమతి అవుతున్నాయని చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఏపీ నుంచి ఎగుమతయ్యే రొయ్యల్లో 70 శాతం అమెరికాకే వెళ్తాయని అంటున్నారు.