ప్రపంచాన్ని ఆగమాగం చేస్తున్న ట్రంప్ ప్రతీకార సుంకాల వెనుక మాస్టర్ మైండ్?

అందుకే అంటారు సంపన్నుడు తీసుకునే నిర్ణయాలు.. సంపన్న దేశాలు చేపట్టే విధానాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంటాయి.;

Update: 2025-04-05 18:30 GMT

అందుకే అంటారు సంపన్నుడు తీసుకునే నిర్ణయాలు.. సంపన్న దేశాలు చేపట్టే విధానాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ వాదనను చాలామంది త్రోసిపుచ్చుతారు. అయితే.. ఈ వాదన నిజమన్న విషయంలో ట్రంప్ పుణ్యమా అని మరోసారి రుజువైందని చెప్పాలి. అగ్రరాజ్యం అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ఎంతలా ప్రభావితం చేస్తున్నది.. ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న ప్రతీకార సుంకాల ఎపిసోడ్ చెప్పకనే చెప్పేస్తుంది. చిన్నా.. పెద్దా అన్న తేడా లేకుండా.. మిత్రుడు, శత్రువు అన్న వైరుధ్యాన్ని చూపకుండా అందరి పైనా బాదుడు మోపుతూ ప్రతీకార సుంకాల రచ్చ నడుస్తోంది. దీంతో.. ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్ తీవ్రంగా ప్రభావితమవుతోంది.

ఈ ప్రతీకార సుంకాలతో సరికొత్త వాణిజ్య యుద్ధానికి తెర తీసినట్లైంది. ఇంతకూ ట్రంప్ ప్రతీకార సుంకాలకు సంబంధించిన మాస్టర్ మైండ్ ఎవరిది? ఎవరి కారణంగా ట్రంప్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు? అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. దీనికి అందరి వేళ్లు.. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డు లుట్నిక్ వైపు చూపిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రతీకార సుంకాల విషయంలో ఆయనదే కీలక పాత్రా చెబుతున్నారు.

ప్రతీకార సుంకాల వ్యూహం ఒకవేళ తేడా కొట్టి.. అమెరికానే దెబ్బేస్తే.. అందుకు అతడ్ని బాధ్యుడ్ని చేసే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ ను ట్రంప్ సిద్ధం చేసుకున్నట్లుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ట్రంప్ కేబినెట్ లో వాణిజ్య మంత్రిగా వ్యవహరిస్తునన హోవార్డు లుట్నిక్ విషయానికి వస్తే అతడు కాంటర్ ఫిట్జ్ గెరాల్డ్ అనే సంస్థకు మాజీ సీఈవో. ట్రంప్ ఆర్థిక విధానాల చర్చల్లో ఆయన పాల్గొనటమే కాదు.. ట్రంప్ యంత్రాంగం రూపొందించిన ఆర్థిక.. వాణిజ్య విధానాల్లో కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు.

తాజాగా ప్రకటించిన ప్రతీకార సుంకాల కారణంగా అమెరికాకు ఆర్థిక మాంద్యం ముప్పు పొంచి ఉన్నట్లుగా నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. అయితే.. లుట్నిక్ అంచనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. ప్రతీకార సుంకాల కారణంగా అమెరికాకు ఆదాయం లభిస్తుందని బలంగా వాదిస్తున్నారు. ఒకవేల ట్రంప్ టారిఫ్ వ్యూహం తిరగబడితే.. అందుకు బాధ్యుడ్ని చేసేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 180 దేశాలపై ట్రంప్ యంత్రాంగం సుంకాలు విధించింది. ఈ బాదుడు ప్రపంచ మార్కెట్లపై ప్రభావాన్ని చూపటమే కాదు.. ఆయా దేశాల్లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లుగా భావిస్తున్నారు.

పంటికి పన్నే సమాధానంగా ట్రంప్ విధిస్తున్న టారిఫ్ లకు బదులు టారిఫ్ లను చైనా.. కెనడాలు విధించటం తెలిసిందే. ఇలాంటి వాటి కారణంగా అగ్రరాజ్యంలోని వినియోగదారులపై కొత్త భారం పడుతుందని.. అదే జరిగితే అగ్రరాజ్యంలో మాంద్యం తప్పదన్న హెచ్చరికల్ని చేస్తున్నారు. అయితే.. ట్రంప్ టీం మాత్రంతమ చర్యల్ని సమర్థించుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News