'శాంతి నిర్మాత'... ట్రంప్ ను పొగిడేందుకు ఇద్దరు దేశాధినేతలు పోటీ!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి యావ రోజు రోజుకీ పెరిగితిపోతున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే!;
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి యావ రోజు రోజుకీ పెరిగితిపోతున్నట్లు కనిపిస్తున్న సంగతి తెలిసిందే! ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ఈ మేరకు మద్దతు దొరకగా.. ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం ఆగిన తర్వాత ట్రంప్ మరోసారి ఆ టాపిక్ ఎత్తారు. ఈ క్రమంలో మరో ఇద్దరు దేశాధినేతలు ఈ ప్రతిపాదన తీసుకురాగా.. ఈ క్రమంలో ట్రంప్ ని పొగిడే విషయంలో పోటీపడటం గమనార్హం.
అవును... రెండు దీర్ఘకాల ప్రత్యర్థుల మధ్య ట్రంప్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం చేయించారు. ఇందులో భాగంగా... అమ్రేనియ, అజర్ బైజాన్ మధ్య తాజాగా వైట్ హౌస్ లో ఈ మేరకు సంతకాలు చేయించారు. ఈ సందర్భంగా... అర్మేనియన్ ప్రధాన మంత్రి నికోల్ పషిన్యన్, అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్.. సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇచ్చారు.
ఈ సందర్భంగా స్పందించిన అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలీయేవ్.. “అధ్యక్షుడు ట్రంప్ కాకపోతే ఎవరు నోబెల్ శాంతి బహుమతికి అర్హులు?” అని ప్రశ్నించగా.. ట్రంప్ ను “శాంతి నిర్మాత”గా అభివర్ణించారు అర్మేనియా ప్రధాని పషిన్యన్. ఈ సందర్భంగా... అమెరికా అధ్యక్షుడు “నోబెల్ కు అర్హులు” అని అన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన ట్రంప్... ఈ తాజా ఒప్పందం అర్మేనియా, అజర్ బైజాన్ లను అన్ని పోరాటాలను శాశ్వతంగా ఆపడానికి, వాణిజ్యం, దౌత్య సంబంధాలను తెరవడంతోపాటు ఒకరి సార్వభౌమత్వాన్ని మరొకరు గౌరవించడానికి కట్టుబడి ఉందని ప్రకటించారు. ఇకపై రెండు దేశాలు గొప్ప సంబంధాన్ని కలిగి ఉంటాయని.. విశ్వాసం వ్యక్తం చేశారు.
ఏమిటీ అర్మేనియా - అజర్ బైజాన్ వివాదం?:
క్రైస్తవులు అధికంగా నివసించే అర్మేనియా, ముస్లింలు అధికంగా నివసించే అజర్ బైజాన్ వివాదాస్పద నాగోర్నో - కరాబాఖ్ ప్రాంతంపై రెండు యుద్ధాలు చేశాయి. ఈ ప్రాంతాన్ని 2023 దాడిలో అజర్ బైజాన్ తిరిగి స్వాధీనం చేసుకుంది. దీంతో... సుమారు 1,00,000 కంటే ఎక్కువ మంది అర్మేనియన్లు వలస వెళ్ళారు.
ట్రంప్ ను నామినేట్ చేసిన పాకిస్తాన్!:
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య జరిగిన ఘర్షణల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాత్మక దౌత్య జోక్యాన్ని ప్రశంసిస్తూ.. 2026 నోబెల్ శాంతి బహుమతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నామినేట్ చేసింది ఇస్లామాబాద్. మరోవైపు భారత్ – పాక్ మధ్య సీజ్ ఫైర్ లో మూడో దేశం పాత్ర లేదని ఢిల్లీ స్పష్టం చేసింది.
ట్రంప్ నోబెల్ బహుమతికి ఇజ్రాయెల్ మద్దతు!:
ఇటీవల ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతంలో శాంతిని నెలకొల్పడంలో ట్రంప్ చేసిన కృషి అపారమన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి ఇజ్రాయెల్ నామినేట్ చేస్తోందని తెలిపారు.
ఇదే క్రమంలో... ట్రంప్ కు శాంతి బహుమతికి కంబోడి ప్రధాని హున్ మానెట్ మద్దతు ప్రకటించారు. థాయిలాండ్ తో కంబోడియా కు ఉన్న సరిహద్దు వివాదాన్ని పరిష్కరించిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
ఈ క్రమంలో తాజాగా అర్మేనియా, అజర్ బైజాన్ దేశాధినేతలు ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి విషయంలో మద్దతు తెలిపారు.