మస్క్ కు ఫస్ట్ టైం సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.;

Update: 2025-07-01 14:30 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. "బిగ్ బ్యూటిఫుల్ బిల్"పై మస్క్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్‌లో మస్క్‌కు లభించిన భారీ సబ్సిడీలను ప్రస్తావిస్తూ.. అవి లేకపోతే మస్క్ వ్యాపారం కూలిపోతుందని హెచ్చరించారు.

అమెరికా రాజకీయ రంగంలో ఊహించని విధంగా ప్రకంపనలు సృష్టిస్తున్న రెండు ప్రముఖ వ్యక్తులు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ఇటీవల మస్క్ "బిగ్ బ్యూటిఫుల్ బిల్"పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, ట్రంప్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

- ట్రంప్‌ ఘాటు వ్యాఖ్యలు:

ట్రంప్ తన సొంత సోషల్ మీడియా వేదికైన ట్రూత్ సోషల్‌లో ఎలాన్ మస్క్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇప్పటివరకు మానవ చరిత్రలో ఎవరూ పొందనంత రాయితీలు మస్క్ తీసుకున్నారు. అవి లేకుండా పోతే ఆయన దుకాణం మూసుకొని దక్షిణాఫ్రికాలోని ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై రాకెట్లు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి ఉండదు. అమెరికా భారీగా డబ్బు ఆదా చేయగలదు" అని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. మస్క్ ఒకప్పుడు ట్రంప్‌కు బలమైన మద్దతుదారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ "వీధిలో ఎలక్ట్రిక్ వాహనాలు నడిచేలా చేయాలన్న ఒత్తిడిని మేము ఎప్పుడూ వ్యతిరేకించాం. ఎలక్ట్రిక్ కార్లు మంచివే అయినా ప్రజలపై బలవంతంగా మోపలేం" అని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు మస్క్ వ్యాపార సామ్రాజ్యంపై ప్రత్యక్ష దాడిగా కనిపిస్తున్నాయి.

-"బిగ్ బ్యూటిఫుల్ బిల్"పై మస్క్ మండిపాటు

అమెరికా కాంగ్రెస్‌లో ఇటీవల ఆమోదం పొందిన "వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్"పై ఎలాన్ మస్క్ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ బిల్లు వల్ల అమెరికా అప్పు $5 ట్రిలియన్‌కు చేరుతుందన్న ఆందోళనను మస్క్ ఇప్పటికే అనేక వేదికలపై వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదమైతే తాను ఒక కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తానని కూడా మస్క్ హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలతోనే ట్రంప్-మస్క్ మధ్య రాజకీయ రగడ మొదలైంది.

-రాజకీయ వేదికగా మస్క్ దిగుతారా?

ఎలాన్ మస్క్ ఇప్పటికే ఎక్స్ వేదికగా వరుస పోస్టులతో తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బిల్లుకు వ్యతిరేకత, ట్రంప్‌తో విభేదాలు, కొత్త పార్టీ స్థాపనపై సంకేతాలు ఇస్తున్నారు. ఇవన్నీ మస్క్ రాజకీయ రంగప్రవేశానికి దారితీస్తాయా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తులలో ఒకరు, అతని వ్యాఖ్యలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

- ట్రంప్‌కు రాజకీయ దెబ్బలా?

మస్క్ వ్యాఖ్యలు ముఖ్యంగా బిల్లుపై గట్టి స్టాండ్‌తో ట్రంప్‌ను విమర్శించడమంటే తేలికేం కాదు. అయితే ట్రంప్ కూడా తన శైలిలోనే సమాధానం ఇస్తూ మస్క్‌కు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. రాజకీయంగా కాకపోయినా, ఆర్థికంగా మాత్రం మస్క్‌పై ప్రభావం చూపేలా ట్రంప్ వ్యాఖ్యానించిన తీరు ఆసక్తికరంగా మారింది. ఈ పరిణామాలు అమెరికా రాజకీయ భవిష్యత్తులో ఎలాంటి మార్పులకు దారితీస్తాయో చూడాలి.

Tags:    

Similar News