ట్రంప్‌పై దావా వేసిన 20 రాష్ట్రాలు!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.;

Update: 2025-07-03 12:00 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. మెడిక్‌ఎయిడ్‌ ద్వారా సేవలు పొందుతున్న లక్షల మంది అమెరికా ప్రజల ప్రైవేటు ఆరోగ్య సమాచారాన్ని డిపోర్టేషన్‌ అధికారులకు అందించారని ఆరోపిస్తూ 20 రాష్ట్రాల అటార్నీ జనరళ్ల బృందం ట్రంప్‌పై సంయుక్తంగా దావా వేసింది.

ఈ విషయాన్ని కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ రాబ్ బోంటా మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ట్రంప్‌ పరిపాలన సమయంలో ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్ సలహాదారులు, కాలిఫోర్నియా, ఇల్లినోయీ, వాషింగ్టన్, వాషింగ్టన్ డీసీ లాంటి రాష్ట్రాల నుండి మెడిక్‌ఎయిడ్‌ డేటాను అక్రమంగా హోంలాండ్‌ సెక్యూరిటీ అధికారులకు పంపించారని ఆరోపించారు.

- డేటాలో ఏం ఉన్నది?

ఈ డేటాలో ఆరోగ్య రికార్డులు మాత్రమే కాకుండా, వ్యక్తుల పేర్లు, చిరునామాలు, సోషల్ సెక్యూరిటీ నంబర్లు, ఇమ్మిగ్రేషన్ స్థితి వంటి వ్యక్తిగత సమాచారమూ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది తీవ్ర ఆందోళనకరమని, దీనివల్ల అక్రమంగా అమెరికాలో నివసిస్తున్న వలసదారులను గుర్తించి వారిని బలవంతంగా స్వదేశాలకు పంపించే అవకాశముందని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.

చట్ట ఉల్లంఘన

ఈ చర్యలు ఫెడరల్ హెల్త్ ప్రైవసీ చట్టాలు.. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్‌ (HIPAA) ఉల్లంఘనకేనని అటార్నీ జనరళ్లు స్పష్టం చేశారు. HIPAA ప్రకారం.. వ్యక్తిగత ఆరోగ్య డేటాను ప్రైవసీ కింద రహస్యంగా ఉంచాలి. ప్రభుత్వ అవసరాల పేరుతో ఇలాంటివి ఇతర శాఖలకు ఇవ్వడం అనేది స్పష్టంగా చట్టవిరుద్ధమని వారు పేర్కొన్నారు.

- ప్రభావిత రాష్ట్రాలు & స్పందన

ఈ చర్యల వల్ల ముఖ్యంగా వలసదారులు ఎక్కువగా నివసించే రాష్ట్రాలైన కాలిఫోర్నియా, ఇల్లినోయి, వాషింగ్టన్ ప్రభావితమయ్యాయి. ఈ రాష్ట్రాల్లో పౌరసత్వం లేకపోయినా, మెడిక్‌ఎయిడ్‌ కోసం అనేక మంది నామినేషన్‌ చేసుకుంటారు. అటువంటి వారి సమాచారాన్ని అక్రమంగా ఇతర శాఖలకు పంపించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ట్రంప్ పరిపాలనలో తీసుకున్న చర్యలు తరచూ వివాదాస్పదంగా మారడం కొత్తేం కాదు. అయితే ప్రజల ప్రైవసీకి సంబంధించిన ఇలాంటి చట్ట ఉల్లంఘనపై దేశవ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ దావా ఎలా పరిణమించనుందో చూడాలి.

Tags:    

Similar News